అనధికార లే ఔట్ల పై ప్రజల్లో అవగాహన కల్పించాలి

– అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ల ద్వారా పనులు వేగవంతం
– మున్సిపాలిటీల్లో పట్టణాభివృద్ధి సంస్థల భాగస్వామ్యం పెరగాలి
– అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ల అధికారులతో సమీక్షలో మంత్రి నారాయణ

అమరావతి, మహానాడు: అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ల ద్వారా అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని 19 పట్టణాభివృద్ధి సంస్థల(యూడీఏ) అధికారులతో మంత్రి నారాయణ శుక్రవారం సమీక్షించారు. ఒక్కొక్క పట్టణాభివృద్ధి సంస్థ వారీగా చేపడుతున్న కార్యక్రమాలు, ఆదాయ వివరాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అధికారులు మంత్రికి వివరించారు.

ఇప్పటివరకూ యూడీఏలు చేపట్టిన కార్యక్రమాలను అడిగి తెలుసుకున్న మంత్రి నారాయణ… రాబోయే రోజుల్లో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టాలనే దానిపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనధికార లే ఔట్లు, భవన నిర్మాణాలకు అనుమతులు పై చర్చించారు. అనుమతులు లేకుండా వేస్తున్న లే ఔట్ ల విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు.

అనుమతి లేని లే ఔట్ లలో చేపట్టే నిర్మాణాలకు మున్సిపాలిటీల నుంచి ఎలాంటి మౌలిక వసతులు కల్పించరనే విషయాన్ని ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ల పరిధిలో ఉన్న మున్సిపాలిటీల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను యూడీఏ నిధులతో చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో పట్టణ ప్రణాళిక విభాగం డైరెక్టర్ విద్యుల్లత, పబ్లిక్ హెల్త్ ఈఎన్ సీ గోపాలకృష్ణా రెడ్డి తో పాటు 19 పట్టణాభివృద్ధి సంస్థల అధికారులు పాల్గొన్నారు.