దారుణం!

– వైద్యురాలి నిర్లక్ష్యంతో రాలిన శిశువు

నల్గొండ, మహానాడు: నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం జరిగింది. ప్రసవం కోసం వచ్చిన గర్భిణీ పై వైద్యురాలు దాష్టీకం ప్రదర్శించింది. మాడ్గులపల్లి మండలం, గ్యారకుంట పాలెంకు చెందిన గర్భిణీ చెరుకుపల్లి శ్రీలత నెలలు నిండడంతో ఆస్పత్రికి వచ్చింది. అయితే, అక్కడి వైద్యురాలు నిర్లక్ష్యంగా ఆపరేషన్ చేయడంతో పండంటి శిశువు మృతి చెందిందని బాధితులు ఆరోపిస్తున్నారు.

శ్రీలత గురువారం రాత్రి కుర్చీలో కూర్చొని డెలివరీ అయిందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. అయినా.. వైద్యురాలిలో కనికరం కనిపించలేదని వారంతా కన్నీళ్ళపర్యంతమయ్యారు. ఘటన పై అదనపు కలెక్టర్ పూర్ణ చంద్ర ఆస్పత్రిని సందర్శించి, వైద్య సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఉన్నతాధికారుల మందలింపుతో ఆమెను నిన్నటి నుండి వైద్య సిబ్బంది పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. వైద్యురాలు, సిబ్బంది వైఖరితో భయపడి ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్ళిపోతుండగా మందలించి ఆపరేషన్ చేస్తామని నమ్మించారని, తాము ఊహించినట్టే ఆపరేషన్ చేసి శిశువును చంపారని శ్రీలత కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించారు.