– మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్, మహానాడు: ఇందిరమ్మ రాజ్యంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు ఉద్యోగులు నిజాయితీ, అంకితభావంతో పని చేయాలని రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఉద్యోగులతో ఇంటరాక్టివ్ సెషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు.
రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే ప్రజలకు ఎలాంటి ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా సేవలు అందించాలని కోరారు. అద్దెలు, విద్యుత్ ఛార్జీలు, అద్దె వాహనాల ఛార్జీలు మొదలైన వాటికి అవసరమైన బడ్జెట్ అవసరాలను త్వరలో క్లియర్ చేస్తామని ఆయన ఉద్యోగులకు హామీ ఇచ్చారు. రిజిస్ట్రేషన్ శాఖకు శాశ్వత ప్రభుత్వ భవనాల ఆవశ్యకతను మంత్రి ప్రస్తావిస్తూ, త్రిముఖ వ్యూహాన్ని రూపొందిస్తున్నామని, దీని కింద అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాలు రెండేళ్లలో ప్రభుత్వ భవనాల్లో పనిచేయడం ప్రారంభిస్తాయన్నారు. ఇతర రాష్ట్రాల్లోని రిజిస్ట్రేషన్ శాఖల్లో ఉన్న బెస్ట్ ప్రాక్టీసులను మన రాష్ట్రంలో కూడా పాటించేలా అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు పారదర్శకంగా సేవలను అందించేందుకు వీలుగా కొత్త టెక్నాలజీలను అవలంబించాల్సిన అవసరాన్ని కూడా తెలిపారు.
ప్రభుత్వ కార్యదర్శి, స్టాంపులు రిజిస్ట్రేషన్ల కమిషనర్ బుద్ధ ప్రకాష్ జ్యోతి రిజిస్ట్రేషన్ శాఖ పనితీరు గురించి సంక్షిప్త వివరణ ఇచ్చారు. 2014లో రూ.2,746 కోట్లుగా ఉన్న రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం గతేడాది 14,588 కోట్లకు చేరుకుందని తెలిపారు. మంత్రి మార్గదర్శకత్వంలో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల బదిలీలు సజావుగా పూర్తయ్యాయని పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ వార్షిక నివేదికను కూడా మంత్రి విడుదల చేశారు. రెవెన్యూ సమీకరణ, శాఖ పనితీరు, శాఖకు సొంత భవనాలు, డిపార్ట్మెంట్ బడ్జెట్ ఆవశ్యకత మొదలైన వాటిపై శాఖ సీనియర్ అధికారులు తమ అభిప్రాయాలను అందించారు. ఈ సమావేశంలో అదనపు ఐజీలు, డీఐజీలు, జిల్లా రిజిస్ట్రార్లు, సబ్ రిజిస్ట్రార్లు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.