సర్పంచ్‌ల డిమాండ్లను నెరవేరుస్తున్న సీఎం చంద్రబాబు

– పంచాయతీ రాజ్ ఛాంబర్ జాతీయ అధ్యక్షుడు జేంద్రప్రసాద్

తిరుపతి, మహానాడు: రాష్ట్రంలోని సర్పంచ్‌ల డిమాండ్లను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారని పంచాయతీ రాజ్ ఛాంబర్ జాతీయ అధ్యక్షుడు వై.వి.బి రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఈ మేరకు తిరుపతి నగరంలోని ప్రెస్ క్లబ్‌లో పంచాయతీ రాజ్ ఛాంబర్, సర్పంచుల సంఘం రాష్ట్ర నాయకులతో కలిసి ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ప్రతిపక్ష నేత హోదాలో 2004 జనవరి మూడోతేదీన మంగళగిరి లోని సికె కన్వెన్షన్ లో సర్పంచ్ల రాష్ట్ర సదస్సుకు హాజరైన 16 డిమాండ్లు నెరవేరుస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అందులో భాగంగా ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నందుకు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్, రాష్ట్ర సర్పంచుల సంఘం తరపున ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామన్నారు. శనివారం అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన పంచాయతీరాజ్ శాఖ సమీక్ష సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చిన ఐదు డిమాండ్ లివి.

– గత ప్రభుత్వం దొంగిలించి దారి మళ్లించి వాడుకున్న 15వ ఆర్థిక సంఘం నిధులు 988 కోట్ల రూపాయలను గ్రామ పంచాయతీలకు మండల పరిషత్లకు జిల్లా పరిషత్లకు విడుదల చేస్తూ నిన్న నిర్ణయం తీసుకొని ఆదివారం ఉదయమే గ్రామపంచాయతీల పి.ఎఫ్.ఎం.ఎస్ అకౌంట్లో జమ చేయించారు.

– స్థానిక సంస్థలలో ముగ్గురు పిల్లలు ఉంటే పోటీకి అనర్హులు అన్న నిబంధనను తొలగించి ఎంతమంది పిల్లలు ఉన్నా పోటీకి అర్హులు అని క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

– సర్పంచులకు, ఎంపీటీసీలకు, జెడ్‌పిటీలకు, కౌన్సిలర్లకు, కార్పొరేటర్లకు, మండల పరిషత్ అధ్యక్షులకు, జిల్లా పరిషత్ చైర్మన్ లకు, మున్సిపల్ చైర్మన్ లకు, నగర మేయర్లకు గౌరవ వేతనం పెంచాలని నిర్ణయం తీసుకున్నారు.

– జాతీయ గ్రామీణ ఉపాధి హామీ నిధులను రాష్ట్రంలోని 13, 336 గ్రామపంచాయతీలలో ఒకే రోజు ఈ నెల 23వ తారీకు గ్రామ సభలు ఏర్పాటు చేసి ఆ గ్రామానికి కావలసిన అభివృద్ధి పనులపై గ్రామ ప్రజల అభిప్రాయాలు తెలుసుకొని తీర్మాణం చేశారు. గ్రామీణ ప్రజలను స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలని ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కల్యాణ్‌ నిర్ణయించారు.

– గ్రామీణ ప్రాంతంలో ప్రతి ఇంటికి మంచినీరు అందించే జల్జీవన్ మిషన్ పథకానికి 500 కోట్ల రూపాయలు కేటాయించారు.

ఈ విలేకరుల సమావేశంలో పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాప్ రెడ్డి, ఉపాధ్యక్షుడు సింగంశెట్టి సుబ్బరామయ్య, కొత్తపు మునిరెడ్డి, ఉమ్మడి చిత్తూరు జిల్లా పంచాయతీ రాజ్ ఛాంబర్ అద్యక్షుడు చుక్కా ధనంజయ యాదవ్, సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర కార్యదర్శి కుప్పాల మురళి, నాగేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.