– ఎమ్మెల్యే నసీర్
గుంటూరు, మహానాడు: రక్తదానంతో ఎంతో మంది ప్రాణాలు కాపాడొచ్చని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ అన్నారు. ఆదివారం లాలాపేట్ లోని గర్ల్స్ హైస్కూల్లో డాక్టర్ బి.రవి కుమార్ స్ఫూర్తితో బాలాజీ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మెగా రక్తదాన శిబిరంలో ఎమ్మెల్యే పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నసీర్ మాట్లాడుతూ అన్ని దానాల కంటే రక్తదానం గొప్పదని, రక్తాన్ని కృత్రిమంగా తయారు చేయడం సాధ్యం కాదని ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడానికి ముందుకు వచ్చే విధంగా ప్రజలను చైతన్యవంతం చేసే బాధ్యత యువత తీసుకోవాలని పిలుపునిచ్చారు. డాక్టర్ రవి కుమార్ స్ఫూర్తితో ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న రవి హెల్పింగ్ హాండ్స్ ట్రస్టు సభ్యులను అభినందించారు. ఇదే స్ఫూర్తితో మరెన్నో గొప్ప కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ చంద్రశేఖరే, ప్రభాకర్, మనోజ్, శ్రీనివాస్, నూరుద్దీన్, వార్డు అధ్యక్షుడు సలీం, హఫీజ్, తదితరులు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.