– శ్రీనివాస్‌నగర్‌లో డెయిరీ ఏర్పాటు
మిర్యాలగూడ, మహానాడు: సంగం డెయిరీ తన వ్యాపారాన్ని విస్తరించే క్రమంలో తెలంగాణలో అడుగుపెట్టింది. తాజాగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం శ్రీనివాస్ నగర్ గ్రామంలో లక్షన్నర లీటర్ల కెపాసిటీతో అత్యాధునికమైన యంత్ర సామగ్రితో కూడిన డెయిరీని ఏర్పాటు చేసింది. ట్రెయిల్ రన్ ప్రారంభించేందుకు బుధవారం చైర్మన్ దంపతులు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, జ్యోతిర్మయి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ డెయిరీ నుండి నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాదు, మహబూబ్ నగర్ తదితర జిల్లాలకు ఉత్పత్తులు చేరవేయనున్నామని, అలాగే ప్లాంట్ కు అనుబంధంగా తెలంగాణ రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల్లో ఆరు చిల్లింగ్ సెంటర్లను త్వరలో ఏర్పాటు చేయబోవుతున్నట్టు నరేంద్రకుమార్ వెల్లడించారు. భవిష్యత్తులో మూడు లక్షల లీటర్ల కెపాసిటీకి విస్తరించే విధంగా మౌలిక సదుపాయాలు ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్టు వివరించారు. కాగా, మిర్యాలగూడ ప్లాంటు వద్ద కంపెనీ పాలకవర్గ సమావేశం కూడా జరిగింది. కార్యక్రమాల్లో పాలకవర్గ సభ్యులు, మేనేజింగ్ డైరెక్టర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.