– ‘వారధి’కి బాధిత మహిళల ఫిర్యాదు
– ఈ వ్యవహారాన్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తా..
– బీజేపీ ఫ్లోర్ లీడర్ పెన్మత్స విష్ణు కుమార్ రాజు హామీ
విజయవాడ, మహానాడు: వైసీపీ ప్రభుత్వం హయాంలో 2019 నుండి 2023 సంవత్సరం వరకు అరకు పార్లమెంట్ పరిధిలో యువజన శిక్షణ కేంద్రాల్లో పెట్టిన భోజనాల బిల్లులు రూ. 72 లక్షలు చెల్లించలేదని పి.జయ, ఝాన్సీ, సరస్వతి ఫిర్యాదు చేశారు. వీరితో ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు మాట్లాడిన అనంతరం ఈ అంశాలు అసెంబ్లీలో ప్రస్తావిస్తానని ఫిర్యాదు దారులకు హామీ ఇచ్చారు.
భారతీయ జనతా పార్టీ(బీజేపీ) వారధి కార్యక్రమం బుధవారం జరిగింది. పాడేరు ఐటీడీఏ పరిధిలో యువజన శిక్షణా కేంద్రాల్లో డ్వాక్రా సంఘాల ద్వారా భోజనాలు పెట్టాలని ఆదేశించిన ఐటీడీఏ పీవో దాదాపు నాలుగేళ్ళ నుంచి బకాయిలు చెల్లించలేదని ఫిర్యాదు వచ్చింది. ఈ సందర్భంగా విష్ణు కుమార్ రాజు మాట్లాడుతూ సీతంపేట, కె.ఆర్.పురం, రంపచోడవరం, శ్రీశైలం, పార్వతీపురంలో కూడా ఐటీడీఏ బకాయిలు చెల్లించలేదన్న విషయం కూడా ఆరా తీయాల్సిన అవసరం ఉందని విష్ణు కుమార్ రాజు అన్నారు.
స్కిల్ డెవలప్మెంట్ ఏపీఎస్‌ఎస్‌డీసీ ఆర్డర్ ప్రకారం ట్రైనింగ్ ఇచ్చిన ట్రైనింగ్ పార్టనర్స్ కు కుడా బకాయిలు చెల్లిచలేదన్న విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తానని చెప్పారు. బీజేపీ అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గుడిసే దేవానంద్, పార్టీ సీనియర్ నేత పైడి వేణు గోపాల్, వారధి కో ఆర్డినేటర్ కిలారు దిలీప్, తదితరులు పాల్గొన్నారు.