జ్వరాలు వణికిస్తున్నామత్తు వీడని ఆరోగ్య శాఖ

– కూటమి సర్కారుపై షర్మిల ఫైర్‌

విజయవాడ, మహానాడు: రాష్ట్ర వ్యాప్తంగా సీజనల్‌ వ్యాధులు, జ్వరాలు ప్రజలను వణికిస్తున్నా వైద్య ఆరోగ్య శాఖకు నిద్రమత్తు వీడడం లేదని ఎన్డీయే కూటమి సర్కారుపై ఏపీసీసీ చీఫ్‌ షర్మిల మండిపడ్డారు. ఈ మేరకు ఆమె బుధవారం మీడియాతో మాట్లాడారు. జ్వరాలతో ప్రభుత్వాస్పత్రులు నిండిపోతున్నా.. ⁠కూటమి సర్కారుకి కనీసం సూది గుచ్చినట్టయినా లేదని విమర్శించారు. ఇంకా ఆమె ఏమన్నారంటే..

డెంగ్యూ, మలేరియా, చికెన్‌ గున్యాతో రాష్ట్రం జ్వరాంధ్రప్రదేశ్ గా మారింది… పల్లెలు మంచం పట్టాయి. బాధితులతో ఆసుపత్రులు నిండిపోయాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒకే మంచంపై ఇద్దరు, ముగ్గురు రోగులకు చికిత్స అందిస్తున్న దీన దుస్థితి. ఓపి ఫుల్.. వైద్యం నిల్.. అన్నట్లు ఉంది రాష్ట్రంలో సర్కారు వైద్యం పరిస్థితి.

ఏ గ్రామం చూసినా, ఏ వార్డు చూసినా జ్వరాలతో జనాలు మంచం పట్టిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. రోజురోజుకీ పరిస్థితి విషమిస్తుంటే కమిటీల పేరుతో ఆరోగ్య శాఖ మంత్రి కాలయాపన చేస్తున్నారు తప్పితే ..నియంత్రణకు చర్యలు మాత్రం లేవు. గత సర్కారును తిడుతూ ఐదేళ్లు కాలయాపన చేసేస్తారా? వర్షాకాలం కాబట్టి జ్వర తీవ్రత ఉంటుంది, అటు పారిశుద్ధ్యం, ఇటు ఆసుపత్రుల్లో సదుపాయాలు చూసుకోవాలని ప్రత్యేకంగా చెప్పాలా..? మన్యంలో ఇంటికొకరు మంచాన పడితే.. జ్వరాలను అరికట్టడంపై ఇంతవరకు కార్యాచరణ లేకపోవడం ఈ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం.

రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ తలపిస్తోంది.. విష జ్వరాల కాటుకు ప్రజలు బలి కాకముందే కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించాలి. తక్షణం ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలి.. మందుల కొరత లేకుండా చూడాలి. గ్రామీణ, పట్టణ, ఏజెన్సీ ప్రాంతాల్లో దోమల నివారణ చర్యలు వెంటనే చేపట్టాలి. అన్ని శాఖలతో కూడిన సమర్ధవంతమైన పర్వవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని, పరిస్థితి అందుబాటులో వచ్చే వరకు ముఖ్యమంత్రి నేరుగా పర్యవేక్షించాలని, జ్వరాల పీడ నుంచి రాష్ట్ర ప్రజలను రక్షించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.