రహదారులు, భవనాల రక్షణపై అధికారులు అప్రమత్తంగా ఉండాలి

– ప్రజలకు ఎక్కడా ఇబ్బందులు లేకుండా తక్షణ చర్యలు చేపట్టాలి
– ఉన్నతస్థాయి సమీక్షలో అధికారులకు మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి ఆదేశం

అమరావతి: వరద ప్రభావిత ప్రాంతాల్లో రహదారులు, భవనాల సంరక్షణ విషయంలో ఆర్ అండ్ బి శాఖ అధికారులు నిత్యం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలశాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు.

వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో వరద ప్రభావిత జిల్లాలు కృష్ణా, గుంటూరు, పల్నాడు, పశ్చిమగోదావరి జిల్లాలకు సంబంధించిన ఆర్ అండ్ బి శాఖ ఎస్.ఈ, ఈఈ, ఇతర అధికారులతో మంత్రి జనార్ధన్ రెడ్డి ఆర్ అండ్ బి ఉన్నతాధికారులు ఈ.ఎన్.సి, సీఈలతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఆయా జిల్లాల్లో వరదలు, రోడ్లు, భవనాల పరిస్థితులపై అధికారులను ఆరా తీశారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం సుమారు 2,000 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయని, వాటిని యుద్ధ ప్రాతిపదికన నిర్మించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు.