– రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్
విజయవాడ, మహానాడు: విజయవాడలో వరద ముంపునకు గురైన బాధితులందరికీ పౌర సరఫరాలు, మార్కెటింగ్ శాఖల ద్వారా శుక్రవారం ఉదయం వివిధ నిత్యావసర సరుకుల పంపిణీ ప్రారంభిస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన గురువారం విజయవాడ కలెక్టరేట్లో మీడియాతో మాట్లాడారు. గతంలో ఎన్నో వరదలను చూశామని కాని ఈసారి వరదలతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు. అయితే, బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేతృత్వంలో అధికార యంత్రాంగం అహర్నిశలు పనిచేసి సహాయ చర్యలు కొనసాగించడం జరుగుతోందని మంత్రి మనోహర్ పేర్కొన్నారు.
విజయవాడలోని 179 వార్డు, 3 గ్రామ సచివాలయాల పరిధిలో శుక్రవారం ఉదయం నుండి వరద బాధితులకు 25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, కిలో వంట నూనె, కిలో పంచదార, 2 కిలోల ఉల్లి పాయలు, 2 కిలోల బంగాళా దుంపలను రెండు బ్యాగులుగా చేసి పంపిణీ చేస్తామన్నారు. ముందుగా ఎక్కువ ముంపునకు గురైన ప్రాంతాల్లో పంపిణీని చేపట్టి, తర్వాత మిగతా ప్రభావిత ప్రాంతాల్లో పంపిణీ ఉంటుందన్నారు. లబ్ధిదారుల వివరాలను నమోదు చేసి పంపిణీ చేస్తామన్నారు. ఒక్క రోజులోనే నిత్యావసర సరుకుల పంపిణీని పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఇప్పటికే సుమారు 2 లక్షల మంది బాధితులను గుర్తించామని మంత్రి మనోహర్ వెల్లడించారు. రేషన్ కార్డులు లేని వారికి ఆధార్ కార్డు నమోదు ద్వారా పంపిణీ చేస్తామని అన్నారు.
12 ప్రాంతాల్లో గ్యాస్ సర్వీసు కేంద్రాలు
వరదలకు దెబ్బతిన్న బాధితులకు ఉచిత సేవలు అందించేందుకు బీపీసీఎల్, హెచ్పీసీఎల్, ఐవోసీ కంపెనీల ఆధ్వర్యంలో 12 ప్రాంతాల్లో ఉచిత సర్వీస్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చాయని మంత్రి మనోహర్ చెప్పారు.