– పార్టీ నుంచి సస్పెండ్
– రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ
పార్టీకి చెందిన మహిళా నేతను లైంగిక వేధింపులకు గురిచేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న సత్యవేడు టిడిపి ఎమ్మెల్యే ఆదిమూలంపై టిడిపి వేటు వేసింది. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు.
తనను లైంగికంగా వేధించారని, పదే పదే ఫోన్లు చేస్తూ బెదిరించారని, తనతోపాటు పలువురు మహిళలపై ఆయన లైంగిక వేధింపులకు పాల్పడ్డారని సదరు మహిళ ఆరోపణలు చేసింది. తనను తిరుపతిలోని ఓ హోటల్‌కు పిలిపించి మూడుసార్లు అత్యాచారం చేశారని, ఈ విషయం బయటకు చెపితే తన కుటుంబాన్ని చంపేస్తామని బెదిరించారని, అయినా తన భర్త సహకారంతో ఎమ్మెల్యే అకృత్యాలను తాను బయటపెడుతున్నానని హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె తెలిపారు.
పోయిన మాసంలో తనను తిరుపతిలోని హోటల్‌కు అర్థరాత్రి ఒంటిగంటకు పిలిపించుకున్నారని, ఆరోజు తాను ఎమ్మెల్యే అకృత్యాలను బయటపెట్టేందుకు పెన్ కెమెరాతో వెళ్లి ఆయన ఘోరాలను రికార్డు చేశానని ఆ మహిళ తెలిపారు. ఇటువంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండకూడదని, ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఆమె ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును, పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను కోరారు.
కాగా మహిళ విడుదల చేసిన వీడియో అనంతరం దాన్ని పరిశీలించిన టిడిపి అధిష్టానం పార్టీ ఎమ్మెల్యేను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. మహిళలను వేధిస్తే..పార్టీ వారైనా..తాము ఊరుకోబోమని, కఠిన చర్యలు ఉంటాయని అధిష్టానం స్పష్టంచేసింది.
కాగా ఎమ్మెల్యేపై క్రిమినల్‌చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంది. గతంలో జగన్ అధికారంలో ఉన్నప్పుడు పలువురు వైకాపా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నాయకులు మహిళలను లోబర్చుకోవడం, వేధించడం, నగ్నంగా వీడియోకాల్స్ చేసినా అప్పట్లో జగన్ ప్రభుత్వం వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మాజీ మంత్రులు అంబటిరాంబాబు, అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్సీ అనంతబాబు, మాజీ ఎంపి గోరంట్ల మాధవ్ వంటి వారు మహిళలపై ఎన్ని అకృత్యాలకు పాల్పడినా..వారిపై జగన్ చర్యలు తీసుకోలేదు.
టిడిపి మాత్రం తన ఎమ్మెల్యేపై ఆరోపణలు వచ్చిన వెంటనే కఠిన చర్యలు తీసుకుంది. చిత్రమేమిటంటే..ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆదిమూలం గత ఎన్నికలకు ముందు వైకాపాలో ఉన్నారు. అక్కడ నుంచి పార్టీ మారి టిడిపిలో చేరి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.