– వరదలకు దెబ్బతిన్న వారికి ఆత్మీయ పరామర్శ
– కృష్ణా జిల్లా వ్యాప్తంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి కొల్లు రవీంద్ర సుడిగాలి పర్యటన
మచిలీపట్నం: వరదల్లో చిక్కుకున్న ప్రతి ఒక్కరికీ తానున్నానంటూ కృష్ణా జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు & ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సుడిగాలి పర్యటన చేశారు. బుడమేరుకు పడిన గండిని పరిశీలించారు. తద్వారా ముంపునకు గురైన పంటల్ని పరిశీలించారు. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో లక్షలాది మంది వరదతో అవస్థలు పడ్డారని, అందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఉదయం గన్నవరం నియోజకవర్గం పరిధిలోని గన్నవరం మండలం జక్కులనెక్కం, సావరగూడెం గ్రామాల్లో పర్యటించారు. బుడమేరు కారణంగా ముంపునకు గురైన ప్రాంతాలను ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుతో కలిసి పరిశీలించారు. నడిచి వెళ్లలేని ప్రాంతాలకు ట్రాక్టర్ల ద్వారా వెళ్లారు. పడవల ద్వారా బుడమేరు ముంపు ప్రాంతాలన్నింటినీ కలియ తిరిగారు.
నాలుగైదు అడుగులకు పైగా రోడ్లపై నీరు చేరి అవస్థలు పడుతున్న వారికి భరోసా ఇచ్చారు. జక్కుల నెక్కంలో ఏర్పాటు చేసిన సామూహిక భోజనాలను పరిశీలించారు. అనంతరం ప్రభుత్వం నుండి వచ్చిన ఆహార పొట్లాలు, పాలు, బిస్కెట్లను పలువురికి అందించారు. సావరగూడెంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని పరిశీలించారు.
అక్కడున్నవారిని పరామర్శించి సదుపాయాల గురించి ఆరా తీశారు. ఆహారం, తాగునీరు, మందులు సరిగా అందుతున్నాయో లేదో అడిగి తెలుసుకున్నారు. వరద నీరు తగ్గిన ప్రాంతాల్లో శానిటేషన్ పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారుల్ని ఆదేశించారు.వ్యాధులు వ్యాపించకుండా నిత్యం బ్లీచింగ్ చేయాలని, అవసరమైన చోట మురుగు, బురద తొలగింపు పనులు చేపట్టాలన్నారు.
మచిలీపట్నంలోని 50వ డివిజన్ పరిధిలోని సుందరయ్య నగర్లో పర్యటించి వరద పరిస్థితులను అడిగి తెలుసుకన్నారు. డివిజన్ కేంద్రంలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపుని పరిశీలించారు. అన్ని రకాల అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు. వ్యాధులు వ్యాపించకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు. వరద నీరు రోడ్లపై చేరడం, కార్లు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో మోటార్ బైకుపై వెళ్లి డివిజన్లోని అన్ని ప్రాంతాలను కలియ తిరిగారు. పరిస్థితిని తెలుసుకున్నారు. ముంపునకు గురైన ప్రతి ఇంటికీ, ప్రతి బాధితుడికీ పరిహారం అందించే బాధ్యత తాను తీసుకుంటానన్నారు. నియోజకవర్గంలోని ప్రతి ఇంటికీ పెద్దకొడుకులా తానుంటానని బాధితులకు భరోసా కల్పించారు.
సాయంత్రం పామర్రు నియోజకవర్గంలోని తోట్లవల్లూరు గ్రామంలో వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించారు. పశువులకు మేత అందక అవస్థలు పడుతున్న నేపథ్యంలో పశుగ్రాసం ట్రాక్టర్లను జెండా ఊపి ప్రారంభించారు. పునరావాస కేంద్రాలను పరిశీలించారు. బాధితులకు భరోసా కల్పించారు. వారికి అందుతున్న సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు ప్రతిఒక్కరికీ అధికారులు అండగా ఉండాలని ఆదేశించారు. తక్షణమే గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ పనులు చేపట్టాలని ఆదేశించారు.