బాబు ఇలా.. జగన్ అలా!

– లైంగిక ఆరోపణలొచ్చిన ఎమ్మెల్యే ఆదిమూలంపై టీడీపీ వేటు
– బాధితురాలు ఆరోపించిన రోజునే ఎమ్మెల్యే సస్పెండ్
– నేరం రుజువైతే పార్టీ నుంచి బహిష్కరణ
– బాబుకు భిన్నంగా జగన్ తీరు
– అవంతి, అంబటి, మాధవ్, విజయసాయి, దువ్వాడపై ఆరోపణలు
– వీడియోలకెక్కిన అవంతి, మాధవ్, విజయసాయి, దువ్వాడ రాసలీలల యవ్వారం
– ఎమ్మెల్సీ అనంతబాబుపై హత్యారోపణలు
– ముంబయి నటి జిత్వానీపైనా వైసీపీ నేతల లైంగిక దాడి?
– సకల సలహాదారుడిపైనా శృంగార వార్తలు
– తాడేపల్లిలో టీటీడీ మాజీ చైర్మన్ శృంగార పంచాయితీ
– అయినా ఎవరినీ సస్పెండ్ చేయని జగన్
– కనీసం షోకాజ్ నోటీసులివ్వలేని భయం
– పైగా వారికి పిలిచి మంత్రి పదవులు
– బాబు నిర్ణయాన్ని మెచ్చుకుంటున్న మహిళాలోకం
– జగన్ పార్టీ అందుకే వైకామ పార్టీగా మారిందంటూ సోషల్‌మీడియాలో వ్యంగ్యాస్త్రాలు
-బాబు చర్యతో ఆత్మరక్షణలో జగన్
( మార్తి సుబ్రహ్మణ్యం)

పాలకుడిని బట్టి పాలితులు.. నాయకుడిని బట్టి కార్యకర్తలు పనిచేస్తుంటారు. రౌతుకొద్దీ గుర్రం. రధసారథి ధృతరాష్ర్టుడైతే ఆయన సైనికులు కీచకులవుతారు. అదే జస్టిస్ చౌదరి లాంటి వాళ్లుంటే, ఆ సైన్యం భయభక్తులతో ఉంటుంది. అంటే.. జస్ట్. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. వైసీపీ అధనేత జగన్మోహన్‌రెడ్డి లెక్కన్నమాట! అదెలాగో చూద్దాం.

ఒక మహిళా కార్యకర్తను టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం లైంగిక వేధింపులకు గురిచేసి, ఆమెతో సరదా తీర్చుకున్న శృంగార దృశ్యాలను, సదరు బాధితురాలు సిగ్గువిడిచి మీడియా ముందు చెప్పుకుని కన్నీటిపర్యంతమయింది. తానే డిటెక్టివ్‌గా మారి, పెన్ కెమెరా సాయంతో ఎమ్మెల్యే ఆదిమూలం శృంగారచర్యలను బంధించి, సోషల్‌మీడియాకు విడుదల చేసింది. దీనితో రాజకీయ, మహిళా వర్గాల్లో కలకలం రేగింది.

ప్రభుత్వ-పార్టీ యంత్రాంగమంతా వి‘జల’వాడ సహాయ కార్యక్రమాల్లో తలమునకనలై ఉన్న సమయంలో విడుదలయిన ఈ వీడియో, సహజంగానే అధికార టీడీపీని కలవరపెట్టింది. ఇంకా అప్పటికి దానిపై టీవీల్లో డిబేట్లు ప్రారంభం కాలేదు. రాజకీయ ప్రత్యర్ధుల దాడి మొదలుకాలేదు. ఈలోగా దిద్దుబాటుకు దిగిన టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. పార్టీకి అప్రతిష్ట తెచ్చిన సదరు ఎమ్మెల్యే ఆదిమూలంపై చర్యల కొరడా ఝళిపించారు.

ఆయనను తక్షణం సస్పెండ్ చేస్తున్నట్లు, రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసయాదవ్ ప్రకటించారు. ఆరోపణలు రుజువైతే ఆయనను పార్టీ నుంచి బహిష్కరించాలని నిర్ణయించారు. దానితో ఇక రాజకీయ ప్రత్యర్ధులకు విమర్శించే అవకాశం లభించలేదు. అంటే ఇది పార్టీలోని మిగిలిన ప్రజాప్రతినిధులకు ఒక హెచ్చరిక సంకేతమన్నమాట. దటీజ్ చంద్రబాబు! పార్టీ-ప్రభుత్వ ప్రతిష్ఠ ఆలోచించే ఏ నాయకుడయినా చేసేది అదే!!

కానీ ఐదేళ్లు పాలించిన జగన్మోహన్‌రెడ్డి పనితీరు ఇందుకు పూర్తి భిన్నం. ఇప్పుడు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యే ఆదిమూలం వ్యవహారం వెలుగుచూసిన వెంటనే తెరపైకి వచ్చిన చర్చ ఇది. జగన్ ఐదేళ్ల జమానాలో మహిళలతో వైసీపీ ఎమ్మెల్యేల శృంగార సంభాషణలు మీడియా-సోషల్‌మీడియాలో గబ్బు చేశాయి. గంట-అరగంట ఆరోపణలతో, నాటి ఎమ్మెల్యే అంబటి రాంబాబు-అవంతి శ్రీనివాస్.. మహిళలతో మాట్లాడిన శృంగార సంభాషణలు పార్టీకి అప్రతిష్ఠ తెచ్చిపెట్టాయి.

దానితో వారిద్దరినీ విపక్షాలు గంట-అరగంట మంత్రులంటూ ర్యాంగింగ్ చేసిన వైనం తెలిసిందే. కానీ వారిపై పార్టీ అధ్యక్షుడు-సీఎం జగన్ ఎలాంటి చర్య తీసుకోలేదు. కనీసం విచారణ కూడా జరపలేదు. పైగా వారిద్దరినీ అనంతర కాలంలో మంత్రి పదవులిచ్చి గౌరవించారు. ఇదీ చంద్రబాబు-జగన్ నాయకత్వానికి తేడా!

ఇక ఎమ్మెల్సీ అనంతబాబు.. తన అక్రమ సంబంధాల వ్యవహారం డ్రైవర్ ఎక్కడ బయటపెడతాడేమోనన్న అనుమానంతో అతనిని చంపి, ఇంటికే డెలివరీ పంపిన వైనం సంచలనం సృష్టించింది. అప్పుడు కూడా జగన్ స్పందించలేదు. చాలాకాలానికి సస్పెండ్ చేసినప్పటికీ, ఎన్నికల సమయంలో అనంతబాబు సేవలు వినియోగించుకున్నారు. అదీ జగన్ శైలి!

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఒక మహిళకు తన ఫ్యాంటు జిప్పు తీసి, అంగం చూపిన వీడియో వైరల్ అవడం వైసీపీని మహిళాలోకం ముందు ముద్దాయగా నిలబెట్టింది. ఇది ఢిల్లీలో అన్ని పార్టీల ఎంపీలకు తెలిసిన నేపథ్యంలో ఆయన పెద్ద పోర్నుస్టార్ అయ్యారు. అయినా జగన్ ఆయనపై ఎలాంటి చర్య తీసుకోలేదు. అదీ జగన్ నాయకత్వ తీరు!

తర్వాత పార్టీలో నెంబర్‌టూగా ఉన్న ఎంపి విజయసాయిరెడ్డిపై వచ్చిన ఇలాంటి అనైతిక ఆరోపణ పార్టీని కుదిపేసింది. దేవదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేస్తున్న తన భార్య శాంతి బిడ్డకు, విజయసాయిరెడ్డి తండ్రి అంటూ ఆమె భర్త ప్రెస్‌మీట్ పెట్టి మరీ ఆరోపించడం, పార్టీని నగుబాటు పాలుచేసింది. దానిని విజయసాయిరెడ్డి ఖండించిన తర్వాత కూడా శాంతి భర్త శాంతించలేదు.

నిజంగా విజయసాయికి తన భార్యతో ఎలాంటి అక్రమ సంబంధం లేకపోతే, డీఎన్‌ఏ పరీక్షకు సిద్ధంగా ఉండాలని సవాల్ చేయడం, దానిపై విజయసాయి మౌనం వహించడం పార్టీని ఇరుకునపెట్టింది. ఒక ఎంపి, అందునా తనకు సన్నిహితుడైన వ్యక్తిపై బహిరంగంగా అనైతిక ఆరోపణలు వచ్చినప్పుడు, స్పందించాల్సిన జగన్ మౌనవ్రతం పాటించారు. ఆయనకు క నీసం షోకాజ్ నోటీసు కూడా ఇవ్వకపోవడం విచిత్రం.

చివరికి జగన్ తన పార్టీ నేతలతో ఢిల్లీలో ధర్నా చేసిన సమయంలో.. అక్కడికి సైతం వెళ్లిన శాంతి భర్త.. విజయసాయితో తన భార్య అక్రమ సంబంధాన్ని జాతీయ మీడియాలో నానా రచ్చ చేయడంతో, పార్టీ పరువు బజారునపడింది.

ఇక ఇటీవలే శ్రీకాకుళం వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్.. కట్టుకున్న భార్య, పిల్లలు ఉండగనే పార్టీకి చెందిన మాధురి అనే కళాకారిణితో, సహజీవనం సాగిస్తున్న బండారాన్ని సొంత పార్టీకే చెందిన భార్య, పిల్లలు ధర్నా చేసి మరీ వెల్లడించారు. ఆ సందర్భంలో దువ్వాడ పోలీసుల సమక్షంలోనే భార్యపై దాడికి ప్రయత్నించిన వైనం మీడియాలో కూడా వచ్చింది.ఆ

ఘటనతో వైసీపీకి వై‘కామ’ పార్టీగా ముద్రపడిపోయింది. ఇలాంటి అనైతిక చర్యను ఖండించి, చర్యలు తీసుకోవాల్సిన పార్టీ అధినేత జగన్ ఇప్పటిదాకా దాకా ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాకపోతే ఆయనను నియోజకవర్గ ఇన్చార్జిగా తప్పించి, మరొకరిని నియమించారే తప్ప, ఆరోపణలు రుజువయ్యేంత వరకూ సస్పెండ్ చేయలేదు. ఇదే కేసుకు సంబంధించి, తాజాగా మాధురి యాక్సిడెంట్ కట్టుకథ ఆడియో రికార్డు బయటపడింది.

తాజాగా ముంబయి నటి జిత్వాని కిడ్నాప్ వ్యవహారం వెలుగులోకి వచ్చి, వైసీపీపై పడినై వె‘కామ’ పార్టీ ముద్రను నిజం చేసింది. ప్రముఖ పారిశ్రామికవేత్త జిందాల్‌పై ముంబయిలో అత్యాచార యత్నం కేసు పెట్టిన జిత్వానీని, బెజవాడకు తీసుకువచ్చి జైల్లో వేసిన వైనం వెలుగుచూడటం సంచలనం సృష్టించింది.

తన మిత్రుడైన జిందాల్‌ను రక్షించేందుకు, స్వయంగా జగనే నడుంబిగించి.. సకల శాఖల సలహాదారు, నిఘా దళపతి, విజయవాడ సీపీ, డీసీపీలను పురమాయించిన వైనం ఇప్పుడు ఐపిఎస్‌ల మెడకు చుట్టుకుంది. ఈ కేసులో సూత్రధారి అయిన సీనియర్ ఐపిఎస్‌ను, ఈ వారంలో అరెస్టు చేసే అవకాశాలున్నట్లు పోలీసు వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారంలో నాటి సకలశాఖ సలహాదారు పాత్ర బయటపడితే, ఆయన కూడా జైలుకు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.

అసలు సదరు సకల శాఖ సలహాదారు కూడా.. ఇలాంటి గిల్లే యవ్వారంలో నిష్ణాతుడన్న పేరుందట. ఆయన చొరవ పుణ్యంగా ఒక మహిళా ఎమ్మెల్యేకు మంత్రి పదవి కూడా దక్కిందని, ఎన్నికల ముందు ఆమె నియోజకవర్గ మార్పునకూ ఆయనే కారణమన్న వార్తలు, అప్పట్లోనే గుప్పుమన్న విషయం తెలిసిందే.

ఇక టీటీడీ చైర్మన్‌గా వెలిగిపోయి.. ‘వై నాలుగొందలు? ఎనిమిందొందలు చెయ్’మని దేవుడి సేవల రేట్లపై సెలవిచ్చిన ఓ కీలక నేత కూడా, శృంగారపురుషుడన్న ఘన కీర్తి పార్టీ వర్గాల్లో లేకపోలేదు. సారు ఎక్కడుంటే అక్కడ శృంగారరసం వెల్లువెత్తుందని, విశాఖలో ఊరి చివరన ఉన్న గెస్టుహౌస్-స్టార్‌హోటల్ గురించి తెలిసిన నేతలు బహిరంగంగానే చెబుతుంటారు.

ఇప్పుడు ఎమ్మెల్యే ఆదిమూలం తరహాలో.. అప్పుడు ఒక మహిళా ఉద్యోగి కూడా, సారు తనతో ఉన్న వీడియోను చూపించి ఆయనను బెదిరించగా, అప్పట్లో తిరుపతి ఎస్పీగా ఉన్న ఒక రెడ్డిగారు కేసును రెండుకోట్లకు సెటిల్ చేసి, ఆమెను దేశం దాటించారన్న చర్చ పార్టీ వర్గాల్లో బహిరంగంగా నడిచిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని జగన్ దంపతుల దృష్టికి సైతం వెళ్లిన సందర్భంలో.. ఆయనను హెచ్చరించి వదిలేశారే తప్ప, ఎలాంటి చర్య తీసుకోలేదు. అసలు ఈ విషయాన్ని పార్టీలో ఆయనంటే సరిపడని మరో పెద్ద ఎంపీనే, లీక్ చేశారన్న చర్చ కూడా అప్పట్లో పార్టీ వర్గాల్లో నడిచింది.

కాగా టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం అనైతిక చర్యకు స్పందించిన పార్టీ అధినేత చంద్రబాబు .. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం, వైసీపీ అధినేత జగన్‌ను ఆత్మరక్షణలో పడేసింది. దువ్వాడ వ్యవహారంపై ఇప్పటిదాకా స్పందించని జగన్‌కు, ఇప్పుడు ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం అనివార్యంగా మారింది.

అసలు పార్టీ ఎమ్మెల్యే, ఎంపీలపై ఇలాంటి అనైతిక ఆరోపణలు వచ్చినప్పుడే వారిని సస్పెండ్ చేసి ఉంటే, మిగిలిన వారు అంత రెచ్చిపోయే వారు కాదన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. జగన్ వారికి స్వేచ్ఛ ఇచ్చిన ఫలితంగానే ఇప్పుడు పార్టీకి వై‘కామ’ పార్టీ అన్న చెడ్డపేరు వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఇప్పైడైనా ఎమ్మెల్సీ దువ్వాడను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే పరువుదక్కుతుందంటున్నారు.

లేకపోతే తటస్థులు-మేధావులు-విద్యావంతులు-మహిళా వ ర్గాల్లో, జగన్ ఇమేజ్ పూర్తిగా డామేజీ అయ్యే ప్రమాదం ఉందని పార్టీ సీనియర్లు స్పష్టం చేస్తున్నారు. అటు సోషల్‌మీడియాలో సైతం సొంత పార్టీ ఎమ్మెల్యేను సస్పెండ్ చేస్తూ తీసుకున్న నిర్ణయంపై సోషల్‌మీడియా, మహిళా లోకంపై హర్షం వ్యక్తమవుతోంది. మరి జగనన్న ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.