అభివృద్ధికి కూటమి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యం

– ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్

పెదకూరపాడు, మహానాడు: అభివృద్ధిలో పెదకూరపాడు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిపేలా కృషి చేస్తామని పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అన్నారు. ఐదవ రోజు “ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమంలో భాగంగా బెల్లంకొండ మండలం పాపాయపాలెంలో జరిగిన ప్రజా వేదిక కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ప్రజా వేదికలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత వంద రోజులుగా చేసిన అభివృద్ధి,సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో జరిగిన ఆర్థిక విధ్వంసంతో రాష్ట్రం అట్టడుగు స్థాయికి చేరిందని అపార అనుభవం కలిగిన చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారన్నారు. చంద్రబాబు స్ఫూర్తితో వందరోజుల పాటు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం శ్రమిస్తున్నామన్నారు. డయల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని నియోజకవర్గ ప్రజలు సమర్థవంతంగా వినియోగించుకోవాలని కోరారు. రానున్న రోజుల్లో రాష్ట్రాన్ని మరింతగా అభివృద్ధి చేసేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.