– ఎన్జీవోలు, సామాజిక సంస్థలు భాగస్వాములవ్వాలి
– హోం మంత్రి వంగలపూడి అనిత, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి
మానవ అక్రమ రవాణాను అరికట్టడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని, ఈ సంప్రదింపులు మా సంకల్పానికి బలం చేకూర్చాయని, ఈ వ్యూహాలను అమలు చేసేందుకు కట్టుబడి ఉన్నామని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. మానవ అక్రమ రవాణా కేవలం మానవ హక్కుల ఉల్లంఘన కాదు, ఇది జీవితాలను మరియు సమాజాలను నాశనం చేసే నేరం అని అన్నారు.
గురువారం నోవాటెల్ హోటల్ లో నిర్వహించిన నేషనల్ కన్సల్టేషన్ ఆన్ కౌంటరింగ్ సైబర్ – ఎనేబుల్డ్ ట్రాఫింకింగ్ పై ఏర్పాటు చేసిన వర్క్ షాపులో ఆమె మాట్లాడుతూ ..పద్మశ్రీ సునీత కృష్ణన్ తో ఈ ప్లాట్‌ఫారమ్‌ను పంచుకోవడం నాకు గర్వంగా ఉందన్నారు. సైబర్ హ్యూమన్ ట్రాఫికింగ్ ను అరికట్టేందుకు ఎన్జీవోలు, సామాజిక సంస్థలు భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు.
ప్రతి జిల్లాలో సైబర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి సైబర్ నేరాలను అరికట్టేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సాంకేతికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ, ట్రాఫికర్లు ఉపయోగించే పద్ధతులు కూడా అంతుచిక్కకుండా ఉంటున్నాయన్నారు. దేశవ్యాప్తంగా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో విడుదల చేసిన డేటా ప్రకారం, 2021 నుండి పిల్లల అక్రమ రవాణాకు సంబంధించి నేరాలలో 32 శాతం పెరుగుదలను ప్రతిబింబిస్తున్నాయన్నారు.
ప్రజ్వల సంస్థ తయారు చేసిన సైబర్-ఎనేబుల్డ్ హ్యూమన్ ట్రాఫికింగ్‌పై నేషనల్ యాక్షన్ రీసెర్చ్ రిపోర్ట్‌ను మంత్రులు డీజీపీతో కలిసి విడుదల చేశారు.. తొలుత మంత్రులు వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి కలసి రెండు రోజుల నిర్వహించే ఈ సదస్సును జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు.
కమ్యూనిటీ సమూహాలు మరియు స్వచ్ఛంద సేవకులు బాధితులకు సహాయం చేయడానికి, వారి హక్కుల కోసం వాదించడానికి మరియు దోపిడీని నిరోధించడానికి ముందు వరుసలో పనిచేస్తున్నారన్నారు. ఈ ముప్పును ఎదుర్కోవడానికి మరొక రక్షణ యంత్రాంగం చట్టాలు మరియు విధానాలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ట్రాఫికర్లు లొసుగులను ఉపయోగించుకుంటారు. ట్రాఫికర్లు దోపిడీ చేసే డిజిటల్ ఆవిష్కరణలకు అనుగుణంగా చట్టాలు పటిష్టంగా అమలు చేయాలన్నారు.
భారతదేశంలో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, సుప్రీం కోర్ట్ యొక్క వివిధ మార్గదర్శకాలు సైబర్ మానిటరింగ్ సెల్‌లను ఏర్పాటు చేయడానికి చట్ట అమలును ఎనేబుల్ చేసినప్పటికీ, ఇంకా చాలా చేయవలసిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా సైబర్ పర్యవేక్షణ మరియు పరిశోధనల కోసం చట్టబద్ధమైన నిబంధనలను అందించాల్సిన అవసరం ఉందన్నారు.
మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతూ.. ఈ రోజు ఇక్కడ కనిపిస్తున్న సమిష్టి కృషి, పెరుగుతున్న నేరాన్ని పరిష్కరించడానికి మాకు ఒక మార్గాన్ని అందించిందన్నారు.. మన సమాజంలో టాఫికింగ్ బాధితులను రక్షించే దిశగా ఒక ముఖ్యమైన అడుగు పడిందన్నారు.
సైబర్ స్పేస్ అనేది భౌగోళిక పరిదులు లేనిదని మరియు సైబర్ నేరాలను నియంత్రించడానికి అన్ని స్థాయిల్లోనూ వివిధ శాఖలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.. సైబర్ నేరాలు అనేది చాలా త్వరితగతిన వ్యాపిస్తున్న అంతర్జాతీయ నేరాల యొక్క రూపాల్లో ఒకటన్నారు.
ట్రాఫికర్ల ద్వారా బాధితుల నియామకంపై సాంకేతికత వివిధ మార్గాల్లో ప్రభావం చూపిందన్నారు. బాధితుల స్నేహితులు, కుటుంబం, పని వివరాలు, సెలవులు, అభిరుచులు, అలవాట్లు వాటి వివరాలు ముఖ్యంగా ఫేస్ బుక్, టిక్ టాక్, స్నాప్ చాట్ మరియు ఇన్ స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లలో ట్రాఫికార్స్ ఇంటర్నెట్ ను ఉపయోగించి కనుగొంటున్నారన్నారు..
డీజీపీ సీహెచ్. ద్వారకా తిరుమల రావు మాట్లాడుతూ.. నేషనల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రిపేర్ చేయడానికి కృషి చేస్తున్నామన్నారు. అది చాలా కష్టతరమని అయినా చేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు.. మానవ అక్రమ రవాణా ఈనాడు వచ్చింది కాదు. ప్రాచీన కాలం నుంచి ఉందన్నారు. మానవ అక్రమ రవాణా అనేది అనేక రూపాలల్లో నేడు సమాజంలో కనిపిస్తుందన్నారు.
నూతన సాంకేతికతను ఉపయోగించుకుని మానవ అక్రమ రవాణా నిరోధించడానికి రాష్ట్ర సీఐడీ సంస్థ ప్రముఖంగా పనిచేస్తుందన్నారు. పోలీసు శాఖ కూడా అనేక విధాలుగా దీన్ని నిరోధించడానికి అవిరళ కృషి చేస్తుందన్నారు.
ప్రజ్వల వ్యవస్థాపకురాలు డాక్టర్ సునీత కృష్ణన్ ఈ ఈవెంట్ ప్రాముఖ్యతపై తన ఆలోచనలను పంచుకున్నారు. ఈ కొత్త యుగంలో మానవ అక్రమ రవాణా అనే నేరం అంటువ్యాధి లా వ్యాప్తి చెందుతుందని, దీన్ని అరికట్టి, తక్షణ చర్యలు తీసుకోవడానికి సమయం ఆసన్నమైందని, పౌర సమాజం కూడా చేతులు కలపాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ సదస్సులో యూఎస్ కాన్సులేట్ జనరల్ జెన్నీఫర్ లార్సన్, ఐటి సెక్రటరీ సౌరవ్ గౌర్ ఐ.ఏ.ఎస్, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీ ఏ. సూర్య కుమారి మరియు 27 రాష్ట్రాలు నుండి వచ్చిన సీనియర్ పోలీస్ ఆఫీసర్స్, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, డౌరెక్టర్స్ ఆఫ్ జ్యుడీషియల్ అకాడమీస్, మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ అధికారులు మరియు పౌర సమాజ సంస్థల ప్రతినిధులు, తదితరలు పాల్గొన్నారు.