అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్‌

– డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి

చెరుకుంపాలెం, మహానాడు: ఎన్డీయే ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తోందని, ఇందులో భాగంగానే సరైన సమయానికి పింఛన్లు పంపిణీ చేస్తోందని దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ(టీడీపీ) ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. ఈ మేరకు ఆమె దర్శి మండలం, చెరుకుంపాలెంలో మంగళవారం జరిగిన ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని, మాట్లాడారు. మన ప్రభుత్వం – ప్రజా ప్రభుత్వం అంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌, యువనేత, విద్యాశాఖ మంత్రి లోకేష్ ప్రజల కోసం నిరంతరం పరితపిస్తూ ప్రజా ప్రభుత్వంగా ముందుకు తీసుకువెళుతున్నారన్నారు. అర్హులకై ప్రతి ఒక్కరికీ పింఛన్‌ మంజూరు చేస్తామన్నారు. గత వైసీపీ పాలకులు రాష్ట్రంలో విధ్వంసకర పరిస్థితులు సృష్టించి, ప్రజలను భీతికొల్పారని విమర్శించారు.

రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టివేశారని, ప్రశ్నిస్తే కేసు పెట్టేవారని దుమ్మెత్తిపోశారు. ఇప్పుడా గతి లేదని, అనుభవజ్ఞులు, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ప్రదాత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సహకారంతో రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రజలకు పెంచిన పెన్షన్ లు ప్రతి నెల ఒకటో తేదీ ఇంటిది వద్దకు వచ్చి పంపిణీ చేస్తున్నారంటే కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉందో మీ అందరికీ అర్థమవుతోందన్నారు. వంద రోజుల పాలనలో అనేక ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో పాటు బెజవాడ తుపాను విపత్తును ఎదుర్కొన్న జన రంజక పాలకుడు చంద్రబాబు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ యువనేత డాక్టర్ కడియాల లలిత్ సాగర్, దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, ఎంపీడీవో రఫా, రెవిన్యూ, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.