– గ్రామస్థుల వద్ద రూ. 3 కోట్ల అప్పుచేసి పరారయ్యాడు
– 38వ రోజు మంత్రి నారా లోకేష్ ‘ప్రజాదర్బార్’ లో ప్రజల విన్నపాలు
– ప్రజా ప్రభుత్వం ప్రతి ఒక్కరికి అండగా ఉంటుందని మంత్రి భరోసా
అమరావతి, మహానాడు: ప్రజా సమస్యల పరిష్కారమే ఏకైక అజెండాగా సాగుతున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 38వ రోజు ‘ప్రజాదర్బార్’ కు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. ఉదయం నుంచే బారులు తీరారు. ఉండవల్లిలోని నివాసంలో మంత్రి లోకేష్ ను స్వయంగా కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతి పత్రాలు అందించారు. ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని పరిశీలించిన మంత్రి.. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆయా సమస్యల పరిష్కారంపై అప్పటికప్పుడే సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
మంగళగిరి నియోజకవర్గం నుంచి వచ్చిన విజ్ఞప్తులు
– గ్రామస్థుల నుంచి రూ.3 కోట్ల వరకు అప్పుగా తీసుకుని పరారైన గొరిజాల శ్రీనివాసరావును అరెస్ట్ చేసి బాధితులకు న్యాయం చేయాలని పెదవడ్లపూడికి చెందిన మాజీ సర్పంచ్ అన్నే చంద్రశేఖర్ మంత్రి నారా లోకేష్ ను కలిసి ఫిర్యాదు చేశారు. గ్రామంలో అనేక మంది వద్ద అప్పులు చేసిన శ్రీనివాసరావు.. వాటిని చెల్లించకుండా తప్పించుకునేందుకు పెదవడ్లపూడిని వదిలి కుటుంబంతో సహా గుంటూరుకు మకాం మార్చారని, ఇప్పుడు బెంగుళూరు పరారయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. విచారించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
– పక్షవాతంతో బాధపడుతున్న తనకు పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని మంగళగిరికి చెందిన అక్కల శివశంకరరావు విజ్ఞప్తి చేశారు.
– ఇటీవల సంభవించిన వరదలకు తమ ఇళ్లల్లోకి నీరు చేరి సామగ్రి పూర్తిగా పాడైపోయాయని, నష్టపరిహారం అందించి ఆదుకోవాలని మహానాడు ప్రాంత వాసులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ప్రకటించిన పరిహారం అందలేదని, విచారించి పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
– రోజువారీ కూలిపనులు చేస్తూ జీవనం సాగిస్తున్న తాను ఇటీవల అనారోగ్యం బారిన పడ్డానని, భర్త కూడా లేని తనకు వితంతు పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని ఆత్మకూరు వడ్డెరపాలెంకు చెందిన వేముల సీతమ్మ కోరారు.
– పుట్టుకతో దివ్యాంగురాలినైన తాను ఇంటర్ వరకు చదువుకున్నానని, ఇటీవల తన తల్లిదండ్రుల ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ జీవనం భారంగా మారిందని ఆత్మకూరుకు చెందిన తమ్మిశెట్టి రాధాకీర్తి కన్నీటిపర్యంతమయ్యారు. ఏదైనా ఉద్యోగ అవకాశం కల్పిస్తే.. కుటుంబానికి అండగా ఉంటానని కోరారు.
– లారీ డ్రైవర్ గా జీవనం సాగించే తనకు రోడ్డు ప్రమాదం కారణంగా రెండు కాళ్లు కోల్పోయానని, ఎలాంటి బీమా పరిహారం అందలేదని మంగళగిరికి చెందిన సమ్మంగి బాలాజి కన్నీటిపర్యంతమయ్యారు. ప్రస్తుతం కుటుంబపోషణ భారంగా మారిందని, ఆర్థిసాయం అందించడంతో ఉపాధి అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన విజ్ఞప్తులు
– అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం కునింపూడిలో తన తండ్రికి చెందిన 1.95 ఎకరాలను ఫోర్జరీ డాక్యుమెంట్లతో గల్లా నాగవెంకట సత్యనారాయణ కబ్జా చేశారని, విచారించి తగిన న్యాయం చేయాలని ఏలూర జిల్లా కోడేలుకు చెందిన ఆదినాగు విజ్ఞప్తి చేశారు.
– డిప్లమో చదివిన ఉద్యోగ అవకాశం కల్పించి ఆదుకోవాలని బాపట్ల జిల్లా వేటపాలెం మండలం పందిళ్లపల్లికి చెందిన టి.శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు.
– వివిధ యూనివర్సిటీల్లో కాంట్రాక్టు, తాత్కాలిక, అకడమిక్ కన్సల్టెంట్ విధానాల్లో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్లకు మినిమమ్ టైం స్కేల్ వర్తింపజేసి, రెగ్యులరైజ్ చేయాలని రాజమండ్రికి చెందిన అడ్ హాక్ టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.
– ప్రకాశం జిల్లా కంభం మండలం కందులాపురంలో తమ కుటుంబానికి చెందిన 1.09 ఎకరాల పట్టాభూమిని గత వైసీపీ ప్రభుత్వం నిర్వహించిన రీసర్వేలో గ్రామకంఠంగా నమోదు చేశారని, విచారించి తగిన న్యాయం చేయాలని మార్కాపురానికి చెందిన రాచకొండ లక్ష్మీదేవి ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నామని, వెబ్ ల్యాండ్ నుంచి తొలగించిన తమ భూమిని పునరుద్ధరించి క్రయవిక్రయాలకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
– నెల్లూరు జిల్లా కోటలోని ఎన్ బీకేఆర్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన ఉపాధ్యాయేతర సిబ్బందికి ట్రిబ్యునల్ తీర్పు అమలుచేయడంతో పాటు సర్వీసులో మరణించిన, రిలీవ్ చేసిన యూనియన్ లోని ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని సిబ్బంది మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా యూనియన్ లోని సభ్యులపై దాడికి పాల్పడిన నేదురుమల్లి రామ్ కుమార్ నిరంకుశ, అమానుష చర్యలపై విచారించి తగిన న్యాయం చేయాలని కోరారు. విన్నపాలు, ఫిర్యాదులు పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.