స్వచ్ఛత మనందరి బాధ్యత

– పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం
– మరిన్ని సౌకర్యాల కల్పనకు మున్సిపల్ మంత్రితో చర్చిస్తాం
– ‘స్వచ్ఛతా హీ సేవ’ కార్యక్రమంలో పెమ్మసాని

గుంటూరు, మహానాడు: ‘పారిశుద్ధ్యం అంటే వీధులు శుభ్రపరచడం మాత్రమే కాదు. పారిశుద్ధ్య కార్మికుల ఆత్మగౌరవం నిలబెట్టడం మా బాధ్యత. కార్మికుల సమస్యలకు పరిష్కారం చూపిస్తాం.’ అని గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నగరంలోని వెంకటేశ్వర విజ్ఞాన్ మందిర్ లో బుధవారం ఏర్పాటు చేసిన స్వచ్ఛతా హీ సేవ-2024 కార్యక్రమానికి విశిష్ట అతిథిగా పెమ్మసాని పాల్గొన్నారు. జీవీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు సభా అధ్యక్షతన ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో పెమ్మసాని ప్రారంభించారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో స్వచ్ఛత – సుభ్రతపై అవగాహన కల్పించేలా స్వచ్ఛత ప్రతిజ్ఞను చేయించారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.

నేడు స్వాతంత్య్రం, సమానత్వం, అహింస కోసం పోరాడిన ఒక మహా పురుషుని జన్మదినం. ఆ రోజుల్లో గాంధీ మాట్లాడుతూ స్వాతంత్య్రం కన్నా ముఖ్యమైనది పారిశుద్ధ్యమన్నారు. కార్మికుల ఆత్మ అభిమానాన్ని కూడా కాపాడాలి. ఏ కార్యక్రమమైనా సరే కార్మికులు వెళ్లి శుభ్రం చేసిన తర్వాతే ప్రారంభమవుతుంది. మేం నిత్యం నియోజకవర్గంలో తిరిగినప్పుడు సైడ్ కాలువలను చూస్తే కార్మికుల కష్టం కనిపిస్తుంటుంది. కరోనా సమయంలో మీరు చేసిన కృషి, త్యాగం ఎప్పటికీ మరువలేనిది. మా అందరి తరపున ఈ క్షణం మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

శానిటేషన్ అనేది ఒక రోజులో జరిగేది కాదు. ఈ పారిశుద్ధ్య పనుల్లో ఎన్నో సాధక బాధకాలు ఉంటాయి. ఈ కార్మికులందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు తీసుకు వెళుతున్న మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అందరికీ ధన్యవాదాలు. 10 లక్షల మంది ఉన్న గుంటూరు జనాభా కు 2,000 మంది కార్మికులతో పారిశుద్ధ్య పనులు చేయిస్తే సరిపోదు. చెత్తను రోడ్లపై వేయకుండా డంపర్ బిన్లను పూర్తిగా వాడుతూ, నిర్లక్ష్యం వీడి పని చేసిన నాడే గుంటూరును గ్రీన్ సిటీగా చేయగలుగుతాం. అప్పుడే ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ నిర్దేశించిన లక్ష్యాలను సాధించగలుగుతాం.

ప్రస్తుతం మూడు నెలల్లో అధికారుల బదిలీలు, వరదలు వంటి సమస్యలతో సమయం వృధా అయ్యింది. ఇకనుంచి గుంటూరు నగరాభివృద్ధిపై దృష్టి పెట్టి ముందుకు వెళ్తాం.

నేను డిగ్రీ కళాశాలకు వెళ్ళినప్పుడు కొందరు కార్మికులు తమ సమస్యలను వివరించారు. చెత్త సేకరించి వేసేందుకు డంపర్ బిన్లు లేవని తెలిపారు. అలాగే పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు.

‘చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు.’ అని మహాత్మా గాంధీ అన్నారు. అదేవిధంగా ‘మంచిని చూడాలి, మంచిని గుర్తించాలి, మంచిని ప్రోత్సహించాలి.’ అనే మూడు అంశాలు కూడా అనుసరించిన నాడే సమాజం ముందుకు వెళుతుంది. పారిశుద్ధ్య కార్మికులు, ఎప్పుడైనా, ఏ సమస్య వచ్చినా మా పార్టీ ఆఫీసుకు రండి. మీ సమస్యలు తెలుసుకుని పరిష్కరించే బాధ్యత మేం తీసుకుంటాం అని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పెమ్మసానితో పాటు ఎమ్మెల్యేలు మొహమ్మద్ నసీర్ అహ్మద్, గళ్ళా మాధవి, కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి, జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు, డిప్యూటీ మేయర్ సజీలా, పలువురు కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.

అభిప్రాయాలు

ఫీజులు కూడా కట్టుకునే పరిస్థితిలో లేం
– మా పిల్లలకు స్కూల్ ఫీజులు కూడా కట్టుకునే పరిస్థితిలో లేం. పిల్లలను కాలేజీల్లో చేర్పించడానికి ఉద్యోగాలు కల్పించేందుకు సహకరించండి. మాకు వచ్చే జీతాలతో ఇంటి అద్దెలు ఇంటి పోషనే సరిపోతుంది ఏదైనా అవసరం అయితే అప్పులు తెచ్చి వడ్డీలు కట్టుకోవడంతోనే జీవితం సరిపోతుంది. మాకు ఉండే అవకాశాలను గుర్తించి లోన్లు ఇప్పించాలని కోరుతున్నాం. సాంకేతిక సమస్యలను కారణంగా చెబుతూ మాకు అందాల్సిన పి ఎఫ్ లు అందడం లేదు.
– శ్రీధర్, పారిశుద్ధ్య కార్మికుడు.
————————————————-

చిన్న సమస్యలు పరిష్కరించండి
చెత్త డబ్బాలు లేవు. డంప్ చెత్తను సేకరిస్తే ఎక్కడ వేయాలో తెలియడం లేదు. చిన్న చిన్న ట్రాలీలు ఇచ్చారు. వాటిని తోసుకొని తిరగాల్సి వస్తుంది. మాకున్న ఈ చిన్న సమస్యలను పట్టించుకునే వాళ్ళు లేరు.
– బండి దుర్గమ్మ, పారిశుద్ధ్య కార్మికురాలు.
————————————

ట్రాలీలను మా డబ్బులతో బాగుచేయించుకోమంటున్నారు…

చెత్త డబ్బాలు, ట్రాలీలు పనిచేయడం లేదని చెబుతుంటే మా డబ్బులతో బాగు చేయించుకోమని అధికారులు అంటున్నారు. మాకు వచ్చే జీతాలతో ఇవన్నీ బాగు చేయించుకునే స్తోమత మాకు ఉందా సార్. మహిళలమై ఉండి చిన్న సమస్యలను అందరి ముందు చెప్పుకోలేకపోతున్నాం. ఈఎస్ఐ ఆసుపత్రులకు వెళ్ళినా సరిగా పట్టించుకోవడం లేదు.
రూతు, పారిశుద్ధ్య కార్మికురాలు.