పరిశుభ్రత జీవన విధానంలో భాగం కావాలి

– ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

మచిలీపట్టణం: పరిశుభ్రత ప్రతీ ఒక్కరి జీవన విధానంలో భాగం కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. స్థానిక ఏ జె. కళాశాల ఆవరణలో ‘స్వచ్ఛతా హి సేవా’ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన పారిశుధ్య కార్యక్రమంలో అధికారులు, పారిశుద్ధ్య కార్మికులతో కలిసి ముఖ్యమంత్రి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం గ్రామాల అభివృద్ధి ద్వారానే సాధ్యమన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే రోగాలు, అంటువ్యాధులు మన దరిచేరవన్నారు. మహాత్మాగాంధీ పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చేవారన్నారు.

పల్లెల అభివృద్ధిని గత ప్రభుత్వం అలక్ష్యం చేసిందని, ‘స్వచ్ఛతా హి సేవా’ కార్యక్రమం ద్వారా మళ్లీ పల్లెల్లో అభివృద్ధి పరుగులు పెడుతున్నదన్నారు. గ్రామాల అభివృద్ధికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పధకం కింద గ్రామాలలో పలు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం నిధులు కేటాయించిందన్నారు.

ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులను కలిసి వారి సమస్యలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు ఆ ప్రాంతంలో గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మచిలీపట్నంలోని డంపింగ్ యార్డ్ ను ముఖ్యమంత్రి పరిశీలించారు.

రాష్ట్ర మంత్రులు పొంగూరు నారాయణ, కొలుసు పార్థసారథి, కొల్లు రవీంద్ర, ఎంపీ వల్లభనేని బాలసౌరి , ఎమ్మెల్సీ కంచుమర్తి అనురాధ, ఎమ్మెల్యే లు వెనిగళ్ళ రాము, కాగిత కృష్ణ ప్రసాద్ , వర్ల కుమార్ రాజు, మండలి బుద్ధ ప్రసాద్, యార్లగడ్డ వెంకట్రావు, ఏలూరు రేంజ్ ఐజి అశోక్ కుమార్, జిల్లా కలెక్టర్ డి. కె. బాలాజీ ,జిల్లా ఎస్పీ ఆర్. గంగాధర్ రావు ,, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ, మాజీ ఎమ్మెల్యే బూరగడ్డ వేదవ్యాస్, ప్రభృతులు పాల్గొన్నారు. .