4 నెలల్లోనే ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత!

– చంద్రబాబు మోసాలతో ప్రజల్లో వెల్లువెత్తుతున్న ఆగ్రహం
– పరిపాలన కుప్పకూల్చి, దేవుడికే ఆగ్రహం తెప్పిస్తున్నారు
– వీళ్ల పనులకు దేవుడూ మెట్టికాయలు వేస్తున్నాడు
– మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

తాడేపల్లి, మహానాడు: ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలైంది. సూపర్‌ సిక్స్‌ లేదు. సూపర్‌ సెవన్‌ లేదు. అబద్ధాలు మోసం కింద మారి అవి ప్రజల కోపంగా మారుతున్నాయి. అందుకే ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత చూస్తున్నాం. అన్ని విషయాల్లోనూ ఈ ప్రభుత్వం కుప్పకూలింది. స్కూళ్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆస్పత్రులు, ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా అన్నీ పోయాయి. మూడు నెలల్లో లక్షన్నర ఫించన్లు తగ్గించారు. జన్మభూమి కమిటీలు వచ్చాయి. చదువులు లేవు, వ్యవసాయానికి పెట్టుబడి సాయం, ఆర్బీకేలు, ఫ్రీ క్రాప్‌ ఇన్సూరెన్స్‌ పోయాయి. ప్రభుత్వంలో రోల్‌ మోడల్‌లో నిలబడాల్సిన వ్యవసాయం, చదువులు, వైద్యం.. ఈ మూడు రంగాల్లో ప్రభుత్వం పూర్తిగా తిరోగమనంలో ఉందని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. తాడేపల్లి క్యాంప్‌ ఆఫీస్‌లో వైయస్సార్‌సీపీ అనుబంధ విభాగాల అధ్యక్షులతో పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం సమావేశమయ్యారు. జగన్‌ ఏమన్నారంటే…

డైవర్షన్‌ పాలిటిక్స్‌

ఇష్టం వచ్చినట్లు దొంగ కేసులు పెట్టి రెడ్‌ బుక్‌ పరిపాలన చేస్తున్నారు. లా అండ్‌ ఆర్డర్‌ లేదు. డోర్‌ డెలివరీ గాలికెగిరిపోయింది. పారదర్శకత లేదు. చివరికి విజయవాడలో వరద నష్టాన్ని కూడా అంచనా వేయలేని దుస్ధితిలో ఉన్నారు. ప్రజలు కలెక్టర్‌ ఆఫీస్‌ను చుట్టుముడుతున్నారు. వాళ్లకు నచ్చిన కొందరికే పరిహారం ఇస్తున్నారు. నాలుగు నెలలకే ప్రభుత్వం మీద వ్యతిరేకత తారాస్ధాయికి వెళ్లడంతో, ఎప్పటికప్పుడు డైవర్షన్‌ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారు. తిరుపతి లడ్డూ అని ఒకసారి, డిక్లరేషన్‌ అని మరోసారి డైవర్షన్‌ చేస్తున్నారు.

దేవుడికే కోపం తెప్పిస్తున్నారు..

వీళ్లు చేసే పనులకు దేవుడు కూడా కోపం వచ్చి అనూహ్య రీతిలో మొట్టికాయలు వేస్తున్నారు. అది కూడా దేవుని దయే. టీటీడీకి తెలుగుదేశం ప్రభుత్వంలోనే అపాయింట్‌ అయిన ఐఏఎస్‌ ఆఫీసరే ఈఓగా ఉన్నారు. వాళ్ల ఈఓ చెప్పిన మాటలు.. చంద్రబాబునాయుడు చెప్పిన మాటలు వేరుగా ఉన్నాయి. చంద్రబాబు చెప్పిన మాటలు అబద్దాలు అని తేలిపోయింది. నోటీసులు ఇవ్వలేదంటారు. అడ్డుకోలేదంటారు. ఇవిగో నోటీసులు అంటే మాట్లాడరు. ప్రభుత్వం వాళ్లు చేస్తున్న పనులతో దేవుడికి కూడా కోపం తెప్పిస్తున్నారు. చాలా అధ్వాన్నమైన పాలన చేస్తున్నారు.

ఏదైనా సాధించగలం

వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి సంబంధించిన దాదాపు 24 అనుబంధ విభాగాలను యాక్టివేట్‌ చేస్తున్నాం. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫ్రంటల్‌ ఆర్గనైజేషన్స్‌ పోషించే పాత్ర చాలా కీలకమైనది. కారణం పార్టీకి కాళ్లు, చేతులు ఈ ఫ్రంటల్‌ ఆర్గనైజేషన్సే.. ఇవి ఎంత బలంగా ఉంటే పార్టీ అంత బలంగా పోరాడగలదు. పరిగెత్తగలదు. పార్టీని పటిష్ఠపరిచేందుకు శ్రీకారం చుడుతున్నాం. పదిహేను సంవత్సరాలుగా పార్టీ బలంగా ఉంది. మరింత ఆర్గనైజ్డ్‌గా పని చేయాలి. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్ధాయిలో పార్టీకి అభిమానులు, కార్యకర్తలు ఉన్నారు. వీరిని ఆర్గనైజ్డ్‌గా అనుబంధ విభాగాల్లోకి తీసుకుని వస్తే.. అప్పుడు ఏదైనా సాధించగలుగుతాం.

మనం చేసే కార్యక్రమాన్ని పద్ధతిగా తీసుకుని రావడంతో పాటు, గ్రామం నుంచి జిల్లా, రాష్ట్ర స్ధాయిలో ఏ పిలుపునిచ్చినా మొత్తం కేడర్‌ కదులుతుంది. ఎప్పుడైతే కేడర్‌ కదులుతుందో అప్పుడే కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలబడగలుగుతాం. పార్టీ సంస్ధాగతంగా బలంగా ఉంటనే ఈ పోరాటం చేయగలుగుతాం. మనం పిలుపునిస్తే.. ప్రతి గ్రామంలోనూ కార్యక్రమం జరగాలి. అప్పుడే మనం ఆర్గనైజ్డ్‌గా పని చేస్తున్నట్లు అవుతుంది.

అందరినీ కలుపుకుపోవాలి

పార్టీ ఒక పిలుపు ఇస్తే అది గ్రామస్ధాయి వరకు మెసేజ్‌ పోవాలి. ప్రతిపక్షంగా ప్రతి అంశంలోనూ గ్రామస్ధాయి నుంచి పోరాటం చేయాలి. అలాంటి వ్యవస్ధను క్రియేట్‌ చేయాలి. ప్రతి కార్యకర్తను, అభిమానిని ఈ నిర్మాణంలోకి తీసుకుని రావాలి. ఇందులో భాగంగా మిమ్నల్ని రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షులుగా నియమించాం. తర్వాత జిల్లా అధ్యక్షుల నియామకం కూడా పూర్తైంది. ఇప్పుడు మీరు ఆయా జిల్లాల్లో అధ్యక్షులతో మమేకం కావాలి. ప్రతి జిల్లాలోనూ అనుబంధ విభాగాలకు సంబంధించి.. జిల్లా, నియోజకవర్గ, మండల స్ధాయి వరకు నియమించాలి. ముందుగా బలమైన జిల్లా అధ్యక్షుడిని నియమించాలి. ఆ తర్వాత నియోజకవర్గం, మండలాల ద్వారా ప్రతి గ్రామంపై దృష్టి పెట్టాలి.

జిల్లాల్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు పిలుపునిస్తే ఆ జిల్లా అంతా కదలాలి. రాష్ట్రస్థాయి నుంచి పిలుపునిస్తే.. గ్రామ స్ధాయి నుంచి కదలిక రావాలి. అన్ని కోణాల నుంచి ఆలోచన చేసి మిమ్మల్ని ఎంపిక చేశాం. గతంలో ఎప్పుడూ లేనంత ధ్యాస పెడుతున్నాం. గ్రామస్ధాయి నుంచి తొలిసారిగా ఇంత ధ్యాస పెట్టి ఆర్గనైజ్డ్‌గా ఒకే గొడుకు కిందకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ.. వేగంగా అడగులు వేస్తున్నాం. మీరు చాలా క్రియాశీలకంగా వ్యవహరించాలి. ప్రతి ఒక్కరూ జిల్లాలో తిరగాలి. పర్యవేక్షణ చేయాలి. ఏం జరుగుతుందో చూడాలి. అందుకే ఇందులో అనుభవం ఉన్నవాళ్లను నియమించాం.

సమన్వయంతో సమష్టి కృషి

జిల్లా అధ్యక్షులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు ఎలా సమ్వయంతో పనిచేయాలి. సంయుక్తంగా పార్టీని ఎలా గ్రామస్థాయికి తీసుకుని పోవాలి అన్నదానిపై ఒక వర్క్‌ షాప్‌ కూడా ఉంటుంది. ఇందులో గ్రామస్దాయికి పార్టీని ఎలా తీసుకుని పోవాలన్న దానిపై అవగాహన కల్పిస్తారు. అందులో ప్రస్తుతం ఉన్న 24 విభాగాల్లో కొన్ని గ్రామస్థాయి వరకు విస్తరించాల్సిన విభాగాలు ఉంటాయి. వాటికి గ్రామస్ధాయి వరకు ప్రతినిధులు.. యువత, మహిళా, రైతు ఇలా అన్ని విభాగాల్లో ఉండాలి. ఈ కార్యక్రమాన్ని అనుబంధ విభాగాల అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు కలిసి చేయాలి. జిల్లా అధ్యక్షుడితో అనుబంధ విభాగాల అధ్యక్షులు ఎంత విస్తృతంగా మమేకమై తిరగగలిగతే.. అంత లోతుగా గ్రామస్థాయి వరకు పార్టీ విస్తరిస్తుంది. అలాగే పార్టీకి కూడా అంత మేలు జరుగుతుంది. నేను కూడా అయా విభాగాలతో మాట్లాడే పరిస్థితి ఉంటుంది.

‘జగన్‌’ మీ అందరి ప్రతినిధి మాత్రమే..

మీమీద నమ్మకంతో పెట్టిన ఈ బాధ్యతను మీరు అంతే బాధ్యతగా నెరవేరిస్తే.. మీక్కూడా మంచి జరుగుతుంది. పార్టీ మీ సేవలను గుర్తిస్తుంది. పార్టీ అనుబంధ విభాగాలతో పాటు, జిల్లా అధ్యక్షులు సహా పార్టీలో ఎవరైతే కష్టపడి పని చేస్తారో, వారికే ప్రాధాన్యత ఉంటుంది.

పార్టీ మనది, మనందరిది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. అందరం కలిసికట్టుగా పార్టీని నిర్మించుకున్నాం. జగన్‌మోహన్‌రెడ్డి మీ అందరి ప్రతినిధి మాత్రమే. పార్టీ కోసం కష్టపడే వారికి, ఆ ప్రక్రియలో నష్టపోయిన వారికి పార్టీ పూర్తిగా అండగా ఉంటుంది. వారికే ప్రథమ ప్రాధాన్యత కూడా ఉంటుంది.

క్షేత్రస్థాయి నుంచి బలోపేతం

పార్టీ అనుబంధ విభాగాల నిర్మాణం మూడు, నాలుగు నెలల్లో పూర్తి కావాలి. ఆ తర్వాత బూత్‌ కమిటీల ఏర్పాటు కూడా పూర్తి కావాలి. పార్టీ నిర్మాణంలో ఉన్న వారందరికీ ఐడీ కార్డులు ఇవ్వాలి. వారందరినీ పార్టీలో భాగస్వామ్యం చేయాలి. ఈ ప్రక్రియ పటిష్ఠంగా అమలు చేయాలి. వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని దేశంలో అత్యంత శక్తివంతమైన పార్టీగా నిర్మించాలన్న దృఢ సంకల్పంతో పనిచేస్తున్నాం. క్షేత్రస్ధాయి నుంచే పార్టీని మరింత బలోపేతం చేస్తాం. పార్టీకి కోట్లాది మంది అభిమానులు, లక్షల సంఖ్యలో కార్యకర్తలు ఉన్నారు. వారంతా పార్టీని నమ్ముకుని ఉన్నారు. వాళ్లందరికీ పార్టీ వ్యవస్ధలోకి తీసుకుని రావాలి.

అనుబంధ విభాగాల అధ్యక్షులు ఎలా పని చేయాలి. అనుబంధ విభాగాల అధ్యక్షులు, పార్టీ జిల్లా అధ్యక్షులు.. ఇద్దరూ ఎలా పార్టీ కార్యక్రమాల్లో సమన్వయం చేసుకోవాన్న దానిపై త్వరలోనే వర్క్‌ షాప్‌ నిర్వహిస్తాం.