– రైల్వే ప్రాజెక్టులు ఆలస్యంపై పెమ్మసాని సీరియస్
– అండర్ పాస్ లో డ్రైనేజ్ పైపులు లీకులు
– సమస్యలకు గల కారణాలపై ఆరా!
– ప్రతి నెలా సమీక్షించి, చర్యలు తీసుకుంటాం
– రైల్వేస్టేషన్ ను పరిశీలించిన క్రమంలో పెమ్మసాని
గుంటూరు, మహానాడు: రైల్వే ప్రాజెక్టు పనులపై అలసత్వం వహిస్తే సహించం. అండర్ పాస్ లో డ్రెయినేజీ లీకులను 20 రోజుల్లో అరికట్టాలి. నిధులున్నా రైల్వే కాంట్రాక్ట్ పనులు ముందుకు కదలడం లేదు. ఇక నుంచి ప్రతి నెలా వచ్చి పరిశీలిస్తామని రూరల్ డెవలప్ మెంట్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. స్థానిక రైల్వే స్టేషన్, అండర్ పాస్, ఆటోస్టాండ్ లను స్థానిక ఎమ్మెల్యేలు గళ్లా మాధవి, నసీర్ అహ్మద్ తో కలిసి పెమ్మసాని గురువారం పరిశీలించారు. రైల్వే ప్రాజెక్టుల ప్రస్తుత పురోగతి గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైల్వే అండర్ పాస్ లో డ్రెయినేజీలు లీకై నీరు నిల్వ ఉండడాన్ని చూసి అసహనం వ్యక్తం చేశారు. లీకులకు గల కారణాలను గుర్తించి వెంటనే అరికట్టాలని ఆదేశించారు.
అనంతరం రైల్వే స్టేషన్ వద్ద ట్రాఫిక్ సమస్యలపై ఆటోడ్రైవర్లు, ప్రయాణికులతో పెమ్మసాని మాట్లాడారు. ఈ సందర్భంగా గుంటూరు సమగ్ర ప్రభుత్వాస్పత్రికి ఎదురుగా ఉన్న రైల్వే స్టేషన్ ప్రధాన గేటును మారిస్తే కొంత ట్రాఫిక్ సమస్య తీరుతుందని స్థానిక ప్రజాప్రతినిధులు సూచించారు.
ప్రతి నెలా సమీక్షిస్తాం…
అనంతరం పెమ్మసాని విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ద్వారా గుంటూరుకు రెండు మేజర్ రైల్వే ప్రాజెక్టులు మంజూరయ్యాయని తెలిపారు. వీటిలో రూ.150 కోట్లతో మల్టీ ట్రాకింగ్ కనెక్టివిటీ, రూ.40 కోట్లతో అమృత భారత్ స్కీమింగ్ ద్వారా ఇతర పనులు మంజూరయ్యాయి. అమృత్ భారత్ స్కీమ్ పనుల్లో కొన్ని 70 శాతం, మరికొన్ని 20 శాతం, 40 శాతం పూర్తయ్యాయని వివరించారు. మల్టీ ట్రాకింగ్ పనుల్లో కొన్ని 53 శాతం వరకే జరిగాయన్నారు.
మల్టీ ట్రాకింగ్ పనులు మార్చిలోగా పూర్తి చేస్తామని రైల్వే అధికారులు చెప్పారని, వీటిని ప్రతి నెలా స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి సమీక్షిస్తామని పెమ్మసాని గారు వెల్లడించారు. కార్యక్రమంలో రైల్వే డీఆర్ఎం రామకృష్ణ, రైల్వే చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ డి. మనోహర్ రెడ్డి, డీసీఎం ప్రదీప్ కుమార్ ఇతర అధికారులు పాల్గొన్నారు.