– నాసిరకం మద్యంతో ఆడబిడ్డల తాళిబొట్లు తెంచారు
– ఉచిత ఇసుక రద్దుతో కార్మికుల ఆకలి చావులు
– మండిపడ్డ మంత్రి అనగాని సత్యప్రసాద్
అమరావతి: తన ఐదేళ్ల అరాచక పాలనలో జగన్ రెడ్డి బడుగు, బలహీన వర్గాలను పీల్చుకుతిన్నారని రాష్ట్ర రెవిన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. జగన్ రెడ్డి తానిచ్చిన హామీల్లో 12 శాతం మాత్రమే అమలు చేశారని, బలహీనవర్గాలకు అప్పటికే అమలవుతున్న 150 పథకాలను రద్దు చేశారని తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రశ్నించిన ప్రతి పౌరుడిపైన అక్రమ కేసులు పెట్టి, దాడులు చేసి వేధించిన జగన్ రెడ్డి… ఇప్పుడు చిలుకపలుకులు పలికితే… నమ్మేందుకు ఎవరూ సిద్ధంగా లేరన్నారు. ఉచిత ఇసుకను రద్దు చేసి, భవన నిర్మాణ రంగాన్ని నిర్వీర్యం చేసిన జగన్ రెడ్డి ఆ రంగంలో పని చేసే కార్మికుల ఆకలి చావులకు కారణమయ్యారని దుమ్మెత్తిపోశారు. నాసిరకం మద్యం తాగించి, వేల మంది ఆడపడుచుల తాళిబొట్లను తెంచిన జగన్ రెడ్డి… ఇప్పుడు మద్య నియంత్రణ గురించి మాట్లాడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
జగన్ రెడ్డి చెప్పినట్టుగానే తన అరాచక ప్రభుత్వానికి, ప్రస్తుత ఎన్డీయే కూటమి ప్రజాస్వామ్య ప్రభుత్వానికి తేడాను ప్రజలను స్పష్టంగా గమనిస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చి రాగానే ఐదు హామీలను నేరవేర్చిందని, జగన్ రెడ్డి 13 లక్షల కోట్ల రూపాయల అప్పులను ఇచ్చినప్పటికీ వీలైనంత త్వరగా ఇచ్చిన వాగ్ధాలన్నింటీనీ అమలు చేస్తామని అన్నారు. పెన్షన్ను నాలుగు వేలకు పెంచడం తోపాటు ఒకటో తేదీనే ఇస్తుండడంతో అవ్వాతాతలందరూ చంద్రబాబే తమ పెద్ద కొడుకని ఆనందంలో ఉన్నారన్నారు. అధికారం కోల్పోయిన తర్వాత జగన్ పిచ్చిపట్టినట్టుగా వ్యవహరిస్తున్నారని, అందుకనే అప్పుడే ఎన్నికల గురించి మాట్లాడుతున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు.