నెలలోనే 45 లక్షల టన్నుల ఇసుక మేసేశారు
ఉచితం పేరుతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి
ఇసుక బుక్ చేద్దామంటే వెబ్‌సైట్ పగలు పని చేయదు
మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు ధ్వజం
తాడేపల్లి: ఉచిత ఇసుక పేరుతో మోసపు ప్రకటన చేసిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక గతం కన్నా నాలుగు రెట్లు అధిక ధరలకు కూటమి నాయకులతో అమ్మించి వారి జేబులు నింపుతున్నారని మాజీ ఎమ్మెల్యే, వైయస్సార్‌సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్‌బాబు ఆక్షేపించారు.
ఇసుక బుక్ చేద్దామంటే వెబ్‌సైట్లు అర్థరాత్రి తప్ప పగలు పని చేయవని, రోజు రోజుకీ ఇసుక ధర పెరుగుతోందని ఆయన వెల్లడించారు. పేరుకే ఉచిత ఇసుక. కానీ లారీ లోడ్ అరకులో ఏకంగా రూ.54 వేలు ఉందని తెలిపారు.
ఉచిత ఇసుక పాలసీ కారణంగా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడిందన్న ఆయన, ఇసుక అమ్మకాల ద్వారా గత ప్రభుత్వంలో ఏటా రూ.765 కోట్ల చొప్పున ఐదేళ్లలో సుమారు రూ.3825 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు. వర్షాకాలంలో సరఫరా కోసం గత వైయస్సార్‌సీపీ ప్రభుత్వం ముందు జాగ్రత్తగా ఈ ఏడాది జూన్ నాటికి, రాష్ట్రంలోని అన్ని స్టాక్ పాయింట్లలో 85 లక్షల టన్నుల ఇసుక నిల్వ ఉంచితే, ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి, నెల రోజుల్లోనే 45 లక్షల టన్నులు ఇసుక మాయం చేశారని మాజీ ఎమ్మెల్యే చెప్పారు.
ఇప్పుడు స్టాక్ పాయింట్లన్నీ ఖాళీ కాగా, ఇసుక సరఫరా లేక దాదాపు 36 రకాల వృత్తులవారు, 45 లక్షల భవన నిర్మాణ కార్మికులు పనులు లేక రోడ్డున పడ్డారని ఆవేదన చెందారు. ఉచిత ఇసుక విధానం ఏ మాత్రం సక్రమంగా లేదన్న మాజీ ఎమ్మెల్యే.. గతంలో టన్ను ఇసుక ధర రూ.475 కాగా, ఇప్పుడు రూ.3 వేలకు మించి అమ్ముతున్నారని గుర్తు చేశారు.
అలాగే ట్రాక్టర్ ఇసుక గతంలో రూ.3 వేలు కాగా, ఇప్పుడు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు.. ఇక 18 టన్నుల ఇసుక ఏకంగా రూ.30 వేల నుంచి రూ.63 వేల వరకు కొనాల్సిన దుస్థితి నెలకొందని ఆక్షేపించారు.
కూటమి ప్రభుత్వ ఇసుక పాలసీని ప్రశ్నిస్తూ, సోషల్ మీడియలో పోస్టులు పెట్టిన వారిపై దొంగ కేసులు బనాయించి వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.