మంత్రి పెమ్మసాని చొరవ…

జీడీఎస్ సిబ్బందికి పోస్టల్ శాఖలో ఉద్యోగాలు

– అభ్యర్థుల నిరీక్షణకు తెర
– ఉద్యోగుల కృతజ్ఞతలు

గుంటూరు, మహానాడు: గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ని ఆదివారం పలువురు పోస్టల్ ఉద్యోగులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. పెమ్మసాని పట్టించుకోవడం వల్లనే ఏడాదిన్నరగా పెండింగ్ లో పడున్న తమ నియామకాలు తమకు దక్కాయని ఉద్యోగులు తమ ఆనందాన్ని వెలిబుచ్చారు. ఈ సందర్భంగా పెమ్మసానిని శాలువాతో సత్కరించి ధన్యవాదాలు తెలిపారు. వివరాలివి. జీడీఎస్‌(గ్రామీణ డాక్ సేవక్) సిబ్బంది(తాత్కాలిక ఉద్యోగులు) గా పనిచేస్తున్న వారికి పోస్టల్ శాఖలో శాశ్వత ఉద్యోగ అవకాశాల నిమిత్తం గతంలో ఆ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఇందుకు ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి 3,500 మంది అభ్యర్థులు ఏడాదిన్నర క్రితం పరీక్షలు రాసి, ఉత్తీర్ణులయ్యారు. అయితే పలు సాంకేతిక కారణాల వల్ల ఆ అభ్యర్థులకు సుమారు ఏడాదిన్నర నుంచి నియామకాలు లభించలేదు. ఆ అభ్యర్థులు ఢిల్లీ తదితర రాష్ట్రాలకు తమ నియామకాల నిమిత్తం పలువురు అధికారులను కలిసినా ఉపయోగం లేకుండా పోయింది.

ఈ క్రమంలో డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ని ఆ అభ్యర్థులు గత నెలాఖరులో కలిసి తమ వినతులను అందజేశారు. తమ సమస్యలను పూర్తిగా వివరించి ఎన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నామో సవివరంగా తెలిపారు. సమస్యను అర్థం చేసుకున్న పెమ్మసాని వెంటనే స్పందించి ఢిల్లీలోని పోస్టల్ శాఖ ఉన్నతాధికారులతో అప్పటికప్పుడు ఫోన్లో మాట్లాడారు. అనంతరం అభ్యర్థులతో మాట్లాడుతూ ‘మూడు వారాల్లో మీ సమస్యను పరిష్కరిస్తాం. వీలైనంత త్వరగా నియామకాలు జరిగేలా చూస్తాం.’ అని హామీ ఇచ్చారు.

ఆ హామీకి కట్టుబడుతూ పెమ్మసాని పోస్టల్ శాఖలోని అధికారులను సమన్వయం చేస్తూ, త్వరితగతిన సమస్యను పరిష్కరించారు. ఫలితంగా తెలుగు రాష్ట్రాల నుంచి ఉత్తీర్ణులైన ఉద్యోగులకు నియామక ఆదేశాలను పోస్టల్ కేంద్ర శాఖ ఇటీవల జారీ చేసింది. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ నాయకుడు మనసు పెట్టి పనిచేస్తే ఫలితాలు ఎంత వేగవంతంగా ఉంటాయో అనడానికి ఈ ఘటనలో నిదర్శనమని తెలిపారు. పెమ్మసాని తీసుకున్న చొరవ కారణంగానే తమకు జీవితాలు నిలబడ్డాయని ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉద్యోగులు ఆయన్ను కలిసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

పులివెందుల, గుంటూరు, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు చెందిన ఆ అభ్యర్థులు గత ప్రభుత్వంలో ఏడాదిన్నరగా ఎంత మంది నాయకులను, అధికారులను కలిసిన నియామకాల గురించి ఏ ఒక్కరు పట్టించుకోలేదని అభ్యర్థులు తెలిపారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ వ్యవస్థలోని చిన్న సమస్యలను సవరిస్తే ఫలితాలు ఇలాగే ఎక్కువగా ఉంటాయని అన్నారు. తమ వంతుగా ప్రజలకు ఏ మంచి కార్యక్రమం చేయాలన్నా ముందుంటామని, ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. తొలి దశలో 1,200 మందికి నియామకాలు జారీ చేసిన పోస్టల్ డిపార్ట్మెంట్, త్వరలోనే మిగిలిన అభ్యర్థులకు కూడా నియామకాలు జారీ చేస్తుందని చెప్పారు.