– మోక్షగుండంను ఆదర్శంగా తీసుకోండి.. కాళేశ్వరం కట్టిన ఇంజనీర్లను కాదు
– గత ముఖ్యమంత్రి.. నేనే ఛీఫ్ ఇంజనీర్ అనుకుంటూ ప్రాజెక్టులు కడితే మూడేండ్లకే కూలిపోయింది
– క్వాలిటీతో ప్రజాధనానికి కాపలాగా ఉండేవారే అసలైన ఇంజనీర్లు
ఐదు మండలాలకో ఇంజనీరు కూడా లేరు
నూతనంగా ఎంపికైన ఇంజనీర్లకు, శిల్పకళావేదికలో.. ప్రభుత్వం ఆర్డర్ కాపీలు అందించిన కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
హైదరాబాద్: మాది ప్రజా ప్రభుత్వం, అందరికీ అందుబాటులో ఉంటుంది. నిరుద్యోగుల, యువతపట్ల బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నాం. 2022 లో నోటిఫికేషన్ వేస్తే.. గత ప్రభుత్వం పట్టించుకోకపోతే, మేం అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక్కొక్క సమస్యను పరిష్కరించి మీకు ఆర్డర్స్ అందిస్తున్నాం.
మేనిఫెస్టోలో చెప్పినట్టు ఉద్యోగాలు నింపుతాం. అంతేకాదు, యువతను స్కిల్డ్ ఫోర్స్ గా మార్చి వారికి మెరుగైన భవిష్యత్తును అందిస్తాం. అందుకే ముఖ్యమంత్రి.. ఆనంద్ మహీంద్రవంటి ఒక గొప్పవ్యక్తిని ఛైర్మన్ గా పెట్టి, స్కిల్ యూనివర్సిటీకి రూపకల్పన చేశారు. ఇంత మంచి ఆలోచన గత ప్రభుత్వానికి ఎందుకు రాలేదు?
మోక్షగుండం విశ్వేశ్వరయ్య లాంటి గొప్ప ప్రజల ఇంజనీర్లు పుట్టిన దేశంలో.. సైట్లో ఉండి దేశాన్ని, రాష్ట్రాన్ని నిర్మించాల్సిన ఇంజనీర్లు తప్పులు చేసి, విచారణ కమీషన్ల ముందు హాజరు కావడం బాధాకరం. గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో ఇంజనీర్లు అబాసుపాలయ్యారు. స్వయంగా గత ముఖ్యమంత్రి.. నేనే చీఫ్ ఇంజనీర్ అనుకుంటూ ప్రాజెక్టులు కడితే మూడేండ్లకే కూలిపోయింది.
70 యేండ్ల క్రింద మేం కట్టిన నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఇప్పటికి చెక్కుచెదరలేదు, చిన్న గీతకూడ పడలేదు. ఆ రోజుల్లో సరైన టెక్నాలజీ లేదు, సరిపడ ఇంజనీర్లు లేరు, సరిపడ క్రేన్లు లేవు, వెహికిల్స్ లేవు పెద్ద పెద్ద బండరాళ్లను కూలీలే లేపి పెట్టిన రోజుల్లో కట్టిన ప్రాజెక్టు చక్కగా ఉందంటే మీరంతా అర్ధం చేసుకోవచ్చు.
ఇంజనీర్లంటే రోడ్లేసి, కాలువలు తవ్వి, బిల్డింగ్ లు కట్టేవారు కాదు. క్వాలిటీతో ప్రజాధనానికి కాపలాగా ఉండేవారే అసలైన ఇంజనీర్లు. మీరంతా మోక్షగుండం విశ్వశ్వరయ్యను ఆదర్శంగా తీసుకోండి.. కాళేశ్వరం కట్టిన ఇంజనీర్లను కాదు.
కాళేశ్వరం కట్టకముందు అంతానాదే అన్న మాజీ ముఖ్యమంత్రి, ప్రాజెక్టు కూలిపోయినంత విద్రోహ చర్య అన్నారు. విద్రోహచర్య అయితే పైకిపోవాలి కానీ.. కిందకు ఎలా పోయింది? ఆయన మోసం బయటపడే సరికి ప్రజల్ని మోసగించేందుకు నానా ప్రయత్నాలు చేసిండు. అనవసరంగా తెలంగాణ ప్రజలపై లక్షన్నర కోట్ల భారం వేసిండు.
ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదేండ్లలో పదిసార్లు కూడా సెక్రటేరియేట్‌కు రాలేదు. కానీ మన ముఖ్యమంత్రి ప్రతీరోజు సెక్రటేరియేట్‌కు వస్తున్నడు. ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నరు.
మీరంతా.. ఆనాటి మాటల ప్రభుత్వానికి, ఇప్పుడు పనిచేసే మా ప్రభుత్వానికి మధ్య తేడాను గమనించాలని నా వినతి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి, మీరు ఉద్యోగాలు వచ్చినయి. లేదంటే ఐదేండ్లు అయిన ఉద్యోగాలు రాకపోయేవి.
రేపు పొద్దున ప్రతిపక్ష నాయకులు మేము ఉద్యోగాలు వేస్తే.. మీరచ్చి ఆర్డర్ కాపీలు ఇచ్చారని ట్విట్లు పెడతారు. చిన్న చిన్న సమస్యల్ని పరిష్కరించి రెండేండ్ల నుంచి ఆర్డర్ కాపీలు మీరెందుకు ఇవ్వలేదని వారిని మీరంతా ప్రశ్నించాలని కోరుతున్నాను
రాష్ట్రంలో ఐదు మండలాలకో ఇంజనీరు కూడా లేరు. ఇవ్వాల 156 మంది ఇంజనీర్ల నా శాఖకు వచ్చిండ్రు.. మీరందరికి 8 రోజులుగా ట్రైనింగ్ ఇచ్చినం. ఇవ్వాల ముఖ్యమంత్రి చేతులమీదుగా ఆర్డర్ కాపీలను ఇస్తున్నాం.
ఇంజనీర్లు ఎస్ఈలు, ఈఈలు, డీఈలు కంటే మీ మీదే పెద్ద బాధ్యత ఉంది. మీరంతా కాంట్రాక్టర్, సూపర్ వైజర్ మీద బాధ్యత వదిలివేయంకుండా, పనులు నాణ్యంగా జరుగుతున్నయా లేదా అని క్రాస్ చెక్ చేసుకోవాలి.
దేశాన్ని నడిపించేది ఇంజనీర్లే. ఇంజనీర్లు విమానాలు తయారు చేస్తారు. నడిపిస్తారు. రైళ్లు తయారు చేస్తారు. నడిపిస్తారు. రోడ్లేస్తరు. బ్రిడ్జీలు కడతారు. ప్రాజెక్టులు కడతారు. కాలువలు తవ్వుతరు. ప్రతీచోట ఇంజనీరు ఉంటరు.ఇంజనీర్లు దేశానికి వెన్నముకలు. ఇంజనీర్లు లేని సమాజాన్ని ఊహించుకోలేం.
హైదరాబాద్ కు వరదలు వచ్చినప్పుడు నిజాం నవాబు.. మోక్షగుండం విశ్వశ్వరయ్య అనే ఇంజనీర్ ను పిలిపిస్తే ఆనాడు హైదరబాద్ కు ప్రమాదంగా మారిన మూసీ ఉపనది ఈసాకి అడ్డంగా గండిపేట వంటి రిజర్వయర్ ను కట్టి హైదరాబాద్ ను రక్షించిండు.
వికారాబాద్ లో పుట్టి దామెరచర్లలో కృష్ణానదిలో కలిసే ఒరిజినల్ నది మన మూసీ నది. అది మురికికూపంగా మారింది. దీంతో ప్రజలు క్యాన్సర్, లంగ్, వాటర్ బూన్ డిసీజెస్ తో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.
నేను ఎంపీగా ఉన్నప్పుడు సబర్మతి నది చూసొచ్చిన. సబర్మతి నీళ్లు తియ్యగా ఉన్నయి. అక్కడ మోడీ సబర్మతి, నమామి గంగా అని అన్ని నదుల్ని క్లీన్ చేసుకుంటుంటే.. ఇక్కడి బీజేపీ నాయకులు మూసీని ముట్టుకుంటే ఊరుకునేది లేదని స్టేట్మెంట్లిస్తున్నరు.
మీరంతా ఇంజనీర్లుగా ఒకసారి ఆలోచించండి. ప్రభుత్వం కోటిమంది ప్రజల ప్రాణాలు కాపాడాలని కృతనిశ్చయంతో పనిచేస్తుంది. ఇందాక ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క జపాన్ పర్యటనలో వీడియోలను చూపించారు. అక్కడ సిటీలో నుంచి క్లీన్ రివర్స్ పారుతున్నయి. అది చూసినప్పుడు మన మూసి ఎందుకు అలా కాకుడదని నేను అడుగుతున్నాను.
ముఖ్యమంత్రి మూసీ శుద్ధీకరణ కోసం త్రికరణశుద్ధితో కృషిచేస్తున్నారు. మీరంతా యంగ్ ఇంజనీర్లు. ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా పనిచేయాలని కోరుతున్నారు. మీరు మేము అందదరం కలిసి ఆర్ఆర్ఆర్ నిర్మాణంలో పాలుపంచుకొని హైదరాబాద్ ను, మన తెలంగాణను ప్రపంచపటంలో నిలబడదాం. ఉద్యోగాన్ని జీతం ఇచ్చేదిగా కాకుండా.. ఒక బాధ్యతగా నిర్వర్తించాలని కోరుకుంటున్నాను.