– టీడీపీ దర్శి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి
దర్శి, మహానాడు: దర్శి నియోజకవర్గ ప్రజల చిరకాల వాంఛగా గత తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రారంభమైన ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్‌ను వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకుండా వదిలేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్ళీ ఈ ప్రాంత వాసుల ఆశలు చిగురించాయి. దీంతో దర్శి ప్రజల ఉపాధి అవకాశాలు పెంచే డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటుకు తెలుగుదేశం పార్టీ(టీడీపీ) దర్శి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి కొంగుబిగించారు. సచివాలయంలో గురువారం రవాణా, క్రీడా శాఖ మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి ని కలిసి సమస్యపై వివరించారు. సానుకూలంగా స్పందించిన మంత్రి త్వరలో తిరిగి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ దర్శిలో ఏర్పాటు చేసేందుకు నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రికి లక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ 2014 తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో దర్శిలో ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్టుగా ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ 18 కోట్లతో మంజూరు చేసి పనులు ప్రారంభించారు. దాదాపు మూడు కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆ ప్రాజెక్టును పట్టించుకోకుండా గాలికి వదిలేసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తిరిగి ఆ ప్రాజెక్టును ప్రారంభించేందుకు మంత్రిని కలిసినట్టు తెలిపారు. గత అంచనాలను రివైజ్ చేస్తూ 28 కోట్ల అంచనాలతో మంత్రికి విన్నవించాం. త్వరలో దర్శి ప్రజల కల సహకారం కాబోతుందని అన్నారు.