‘దానా’ తుపాను… 41 రైళ్ల రద్దు!

సికింద్రాబాద్‌, మహానాడు: ‘దానా’ తుపాను ప్రభావంతో దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తమైంది. మొత్తం 41 రైళ్లను రద్దు చేసింది. ఈ నెల 23, 24, 25, 27 తేదీల్లో సర్వీసులందించే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు ద.మ.రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్‌ ఓ ప్రకటనలో వెల్లడించారు. రద్దు చేసిన రైళ్ల వివరాలను ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు. రద్దయిన రైళ్లలో ఎక్కువగా హావ్‌డా, భువనేశ్వర్‌, ఖరగ్‌పుర్‌, పూరీ తదితర చోట్ల నుంచి ఇతర ప్రాంతాలకు సర్వీసులందించే రైళ్లే అధికంగా ఉన్నాయి. దానా తుపాను ప్రభావంతో అక్టోబర్‌ 23 నుంచి ఒడిశాలోని తీర ప్రాంతాల్లో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, వర్షాలూ కురుస్తాయని గోపాల్‌పుర్‌ వాతావరణ అధ్యయన కేంద్రం అధికారులు ఇటీవల వెల్లడించారు. సముద్రంలో కెరటాల ఉద్ధృతి తీవ్రంగా ఉంటుందని, అందువల్ల మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు.