– బాధిత బాలిక కుటంబానికి రూ. 10 లక్షల పంపిణీ
– నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు
– వైసీపీ పాలనలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యం
– జగన్ పాలనలో విచ్చలవిడిగా మద్యం, గంజాయి
– రాష్ట్రమంతటా సీసీ కెమెరాలు, నార్కోటిక్ వింగ్
– హోం మంత్రి వంగలపూడి అనిత
తిరుపతి, మహానాడు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఆదేశాల మేరకు వడమాలపేట మండలంలోని అలివేలు మంగాపురం ఎస్టీ కాలనీకి చెందిన బాధిత బాలిక తల్లిదండ్రులకు 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేసినట్టు హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఈ మేరకు ఆమె మీడియాతో ఏమన్నారంటే… చిన్నారి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పాం. నిందితుడికి 2 నుండి 3 నెలల్లో కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటున్నాం.. ఈ మేరకు తల్లిదండ్రులకు హామీ ఇచ్చాం. ముఖ్యమంత్రి ఇలాంటి హత్యాచారాలపై ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు.
గత ప్రభుత్వంలో అనేక హత్యాచారాలు, అప్పుడు రాని వారు అందరూ నేడు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు రాజకీయ లబ్ధి కోసం పాకులాడడం సరైనది కాదు. దేవుడు కూడా ఇలాంటి వారిని క్షమించడు. మా కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి గల ప్రభుత్వం. గత ప్రభుత్వ హయాంలో సిసి కెమెరాలు నిర్వీర్యం చేసి గంజాయి, నకిలీ మద్యం విచ్చల విడిగా యువతకు అలవాటు అయ్యేలా నిస్తేజంగా వ్యవహరించారు. గత ప్రభుత్వ హయాంలో పోలీస్ శాఖను నిర్వీర్యం చేశారు. బాధితుల పక్షాన నిలబడడమే కాదు, ఎలాంటి సంఘటనలు జరగకుండా మహిళలకు అండగా చర్యలు తీసుకుంటున్నాం.
మహిళా సాధికారతకు, అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోంది. టీడీపీ ప్రభుత్వం గతంలోనే మహిళా సాధికారత దిశగా మొట్ట మొదటగా మహిళా పొదుపు సంఘాలు ఏర్పాటు చేసింది. గంజాయి సాగును అరికట్టి, గంజాయి నిర్మూలనకు గట్టి చర్యలు తీసుకుంటున్నాం. నార్కోటిక్ వింగ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. గంజాయిపై ఉక్కుపాదం మోపి కట్టడి చేస్తున్నాం. ప్రజలకు వారి ఆకాంక్షలకు అనుగుణంగా.. ప్రజా సంక్షేమ, అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. చిన్నారిపై అఘాయిత్యం బాధేసింది. చాక్లెట్ కొనిస్తానని అత్యాచారం చేసి హత్యచేయడం మరింత బాధించింది.
అలిమేలుమంగాపురం ఘటన సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తోంది. ప్రభుత్వం చిన్నారి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటుంది. చిన్నారి కుటుంబానికి సొంత ఇంటిని నిర్మించి ఇస్తాం. ఘటన జరిగిన తరువాత నిందితుడిని వెంటనే అరెస్ట్ చేశాం. పోలీసులు వెంటనే స్పందించారు. మద్యం మత్తులో నిందితుడు దారుణానికి ఒడిగట్టాడు. బాలికపై అత్యాచారం చేసిన నిందితుడిని కఠినంగా శిక్షిస్తాం. చిన్నపిల్లల మరణాల్ని వైసీపీ రాజకీయం చేయడం బాధాకరం.
క్రైం రికార్డు చూస్తే గత ఐదేళ్ళలో ఎన్నో ఘటనలు జరిగాయి. పులివెందులలో మహిళపై అత్యాచారం జరిగితే జగన్ ఎందుకు నిందితుడిని శిక్షించలేదు. ఏపీలో సిసి కెమెరాలను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తున్నాం. దిశ యాప్ అంటూ రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారు? చంద్రబాబు ప్రతి ఆడబిడ్డను సొంత బిడ్డగా చూస్తున్నారు. చంద్రబాబును విమర్శించే అర్హత జగన్ కు లేదు. వైసీపీ హయాంలో మద్యం ఏరులై పారింది..అప్పుడు రోజాకు తెలియలేదా..? మద్యంపై రోజా చేస్తున్న రాద్ధాంతం హాస్యాస్పదం.