Mahanaadu-Logo-PNG-Large

అవినీతిపై రెఫరెండమా..గ్యారంటీలపై రెఫరెండమా?

-తెలంగాణకు పట్టిన క్యాన్సర్‌ గడ్డ కాంగ్రెస్‌
-కోడిగుడ్డుపై ఈకలు పీకుతున్న రేవంత్‌, కేసీఆర్‌ ఒకటే
-బీజేపీకి ఆదరణ చూడలేక అబద్ధాలు చెబుతున్నారు
-కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌, మహానాడు: కాంగ్రెస్‌, బీఅర్‌ఎస్‌ పార్టీలు రోజురోజుకూ బీజేపీకి పెరుగుతున్న ఆదరణ చూడలేక తమపై విషప్రచారం చేస్తున్నాయని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పొంతన లేని మాటలతో కోడి గుడ్డు మీద ఈకలు పీకుతున్న రేవంత్‌, కేసీఆర్‌లు తెలంగాణ ప్రజలను గొర్రెలు అనుకుంటున్నారు. మీరు ఏది చెప్పినా నమ్మేస్తారని ఊహల్లో ఉన్నారు. కేసీఆర్‌ కంటే రేవంత్‌ అత్యంత ప్రమాదకారి. అధికారం కోసం ఎంతకైనా తెగించి అబద్ధాలు అవలీలగా చెబుతాడు. ఇద్దరూ అబద్ధాలలో ఆరిదేరారని మండిపడ్డారు.

కాంగ్రెస్‌ పాలనలో ఐదేళ్ల భవిష్యత్‌పై ఆందోళన…
పచ్చ కామెర్లు ఉన్నోడికి అంతా పచ్చగానే కనిపిస్తుంది. పేద ప్రజలకు ఇచ్చే ఉచిత బియ్యం, బస్తీ దవాఖానాలు, రైతులకు వేసే డబ్బులు, గ్రామాల్లో వేసే రోడ్లు , 2500 కి.మీ జాతీయ రహదారుల నిర్మాణం, ఎరువుల సబ్సిడీ, వరంగల్‌లో రైల్‌ మానుఫ్యాక్చర్‌ యూనిట్‌, సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ అభివృద్ధి.. ఇవన్నీ రాహుల్‌, రేవంత్‌కు గాడిద గుడ్డులా కనిపిస్తున్నాయా? డబ్బులు ఉన్నాయని అహంకార పూరితంగా మాట్లాడుతు న్నారు. కేంద్రానికి కేసీఆర్‌ సహకరించలేదని అందుకే అభివృద్ధి జరగలేదని అసెంబ్లీలో రేవంత్‌ మాట్లాడలేదా? ఇప్పుడేమో నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్‌ ఐదేళ్లు అధికారంలో ఉంటే తెలంగాణ భవిష్యత్తు ఏంటో అని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగస్తులకు ఒకటో తేదీన జీతాలు ఎక్కడ? పెన్షనర్ల పరిస్థితి దయ నీయంగా మారింది.

తెలంగాణకు పట్టిన కాంగ్రెస్‌ క్యాన్సర్‌ గడ్డ
కాంగ్రెస్‌ ప్రభుత్వం బీఅర్‌ఎస్‌ హయాంలో కాంట్రాక్టర్లు చేసిన పనులకు డబ్బులు విడుదల చేసి వారి నుంచి లబ్ధిపొందారు. కానీ, విద్యార్థులకు ఇవ్వాల్సిన స్కాలర్‌షిప్‌లను పెండిరగ్‌లో పెట్టింది. ఇంతవరకు ఈ ఏడాది ఫీజు విడుదల చేయలేదు. ఆరోగ్య శ్రీ బ్యాలెన్స్‌ పేరుకుపోతుంది. గ్యారంటీలు అమలు చేయకుండా.. చేశామని అబద్ధాలు చెప్పి ఓట్లు అడుగుతూ రెఫరెండం అంటున్నారు. మీ అవినీతి మీద రెఫరెండమా? మీ ఆరు గ్యారంటీల మీద రెఫరెండమా? తెలంగాణలో బీజేపీకి మంచి ఫలితాలు ఇవ్వాలని ప్రజలను కోరుతున్నా. తెలంగాణకు కాంగ్రెస్‌ క్యాన్సర్‌ వలె పట్టి పీడిస్తుంది. పార్లమెంట్‌ ఎన్నికల అనంతరం కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలపై వచ్చే నాలుగేళ్లు తెగించి కొట్లాడతాం. కాంగ్రెస్‌ నినాదాన్ని బీఅర్‌ఎస్‌ ఎత్తుకుని మాట్లాడుతుందని దుయ్యబట్టారు.

కాంగ్రెస్‌ పోషించిన పాకిస్తాన్‌ అడుక్కుతినేలా చేశాం..
పాకిస్తాన్‌ దగ్గర ఆటం బాంబులు ఉన్నాయి.. వారికి మనం అణిగిమణిగి ఉండాలని కాంగ్రెస్‌ నేత ఒకాయన మాట్లాడుతున్నారు. ఈ రోజు ఢల్లీిలో ఉన్నది కాంగ్రెస్‌ కాదు… బీజేపీ ప్రభుత్వం. పాకిస్థానీ ఎత్తుగడలను తిప్పికొట్టి వాళ్ల తోక కట్‌ చేసి నడ్డి విరిచాం. పాకిస్తాన్‌ చంపేవాళ్లు… భారతీయులు చచ్చే వాళ్లు అనే విధంగా కాంగ్రెస్‌ చూస్తూ ఉంది. పాకిస్తాన్‌ను చిప్ప పట్టుకుని ఎందుకు అడుక్కునే స్థితికి మోదీ తెచ్చారు. పాకిస్తాన్‌ దగ్గర అణుబాంబులు ఉన్నా భారత్‌ భయపడదు. అసమర్థతతో కాంగ్రెస్‌ పాకిస్తాన్‌ను పెంచి పోషించింది. ఇటువంటి కాంగ్రెస్‌ పుల్వామా మీద మాట్లాడగలదా? కాంగ్రెస్‌ కూటమి వ్యక్తి ఫరూఖ్‌ అబ్దుల్లా దేశంలో ఉంటూ పార్లమెంట్‌ సభ్యుడిగా ఉంటూ పాకిస్తాన్‌కు మద్దతుగా మాట్లాడతారా? ఇష్టమొచ్చినట్టు అబద్ధాలు చెబుతున్నారు. మీ ప్రకటనలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. రజాకార్లతో విరోచిత పోరాటం చేసిన చరిత్ర తెలంగాణ ప్రజలకు ఉంది.