నేత కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ

– చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి సునీత

బాపట్ల, మహానాడు: చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను అమలు చేయనుందని చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి కె.సునీత వెల్లడించారు. బాపట్ల జిల్లా ఐలవరం గ్రామంలోని ఖాదీ గ్రామోద్యోగ సంఘం ఆవరణలో ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సునీత మాట్లాడారు.

నేత కార్మికులకు చేతినిండా పని కల్పించాలన్న ధ్యేయం మేరకు కృషి జరుగుతుందన్నారు. యువత సైతం నేత వస్త్రాలను విరివిగా ఆదరిస్తున్నారని, ఇటీవల ముగిసిన జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శనలో రూ. 2 కోట్లకు మించి విక్రయాలు జరగటమే ఇందుకు నిదర్శనమన్నారు. చేనేత జౌళి శాఖ కమిషనర్ జి. రేఖారాణి మాట్లాడుతూ చేనేత, ఖాదీ ఉత్పత్తుల విక్రయాల పెంపునకు పెద్ద ఎత్తున ప్రదర్శనలు నిర్వహించనున్నామన్నారు.

ఖాదీ, గ్రామీణ పరిశ్రమల సంస్ధ సీఈవో వీఆర్‌ విజయ రాఘవ నాయక్ ఖాదీ బోర్డు నేతృత్వంలో అమలవుతున్న వివిధ పథకాలను గురించి వివరించారు. ఖాదీ పరిశ్రమకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలు అందిస్తున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకుని ఆర్ధిక స్వావలంబన దిశగా ముందడుగు వేయవచ్చని తెలిపారు.

చేనేత జౌళి శాఖ సంయిక్త సంచాలకుడు కన్నబాబు, స్ధానిక ప్రజాప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఐలవరం గ్రామంలోని ప్రాథమిక చేనేత సహకార సంఘం, కనగాల గ్రామంలోని డైయింగ్ యూనిట్, ఇసుకపల్లి ప్రాథమిక చేనేత సహకార సంఘం, చెరుకుపల్లి గ్రామంలోని ఆరుంబాకా ప్రాథమిక చేనేత సహకార సంఘాలను సునీత, రేఖారాణి తదితరులు పరిశీలించారు. అక్కడి వర్క్ షెడ్లను పరిశీలించి, కార్మికులతో ముఖాముఖి సమావేశమై సమస్యలను అడిగి తెలుసుకున్నారు.