పేదరికం లేని రాష్ట్రమే చంద్రబాబు, పవన్‌ కల్యాణ్ కల

– స్వర్ణాంధ్ర 2047 గోడపత్రికలు ఆవిష్కరణ సభలో డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి

నవ్యాంధ్రప్రదేశ్‌ను పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కల అని దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ(టీడీపీ) ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పేర్కొన్నారు. దర్శి టౌన్, క్రిస్టియన్ పాలెం లో గురువారం “ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమం లో పాల్గొని స్వర్ణాంధ్ర 2047 గోడపత్రికలను ఆమె ఆవిష్కరించి, మాట్లాడారు. జగన్‌రెడ్డి అరాచకాల నుంచి బయటపడ్డామనే సంతోషంలో ఉన్న సామాన్యులను కష్టం ఎరగని స్వర్ణాంధ్రప్రదేశ్‌ వైపు నడిపించడమే తమ కూటమి ప్రభుత్వం ధ్యేయమన్నారు. దర్శి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దే లక్ష్యంగా ఐదేళ్ల కూటమి ప్రభుత్వం పని చేస్తుందని మీకు మాటిస్తున్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సహకారంతో దర్శి లో ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన రోడ్లు, డ్రైన్ల నిర్మాణం, మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం, పార్కుల అభివృద్ధి, విద్యుదీకరణ వంటి సదుపాయాలను కల్పించే ఒక కార్యాచరణతో ప్రభుత్వం ముందుకు వెళుతుందని తెలిపారు.

జగన్‌రెడ్డి రూ.వెయ్యి పింఛన్‌ పెంచడానికి ఐదేళ్లు పట్టిందని, మిగతా రూ.3 వేలు కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు పెంచారన్నారని లక్ష్మి తెలిపారు. జగన్‌ ప్రభుత్వానికి, కూటమి పాలనకు మధ్య వ్యత్యాసం ఇదేనన్నారు. సీఎంగా చంద్రబాబు చేసిన తొలి 5 సంతకాలతోనే రాష్ట్రం దశ మారిందన్నారు. వికసిత్ భారత్ – 2047కు ప్రణాళిక సిద్ధం చేస్తున్న నేపథ్యంలో స్వర్ణాంధ్ర దార్శినిక పత్రం విడుదలకు సీఎం చంద్రబాబు చొరవు చూపుతున్నారని తెలిపారు. 2047 నాటికి దేశంలో ఏపీ నంబర్ వన్ స్థానంలో ఉండాలని కోరుకున్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు అని గర్వంగా చెబుతున్నానన్నారు. పిల్లలకు మంచి ఉన్నతమైన భవిష్యత్తు ఇవ్వాలనే ముందు చూపున్న నాయకుడు ఈ దేశానికి, రాష్ట్రానికి అవసరమని ప్రజలంతా ఆలోచించాలని చంద్రబాబు కోరుకుంటున్నారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కనిగిరి ఆర్డీవో, మాజీ శాసన సభ్యుడు నారపుశెట్టి పాపారావు, దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, దర్శి మండల ఎమ్మార్వో శ్రాణ్ కుమార్, దర్శి మున్సిపల్ కమిషనర్ మహేష్, తదితర అధికారులు, ప్రజా నాయకులు పాల్గొన్నారు.