హర్యానాలో మూడోసారి విజయం గొప్ప విషయమే…

– బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు

విజయవాడ, మహానాడు: హర్యానాలో మూడోసారి విజయం సాధించటం అంటే మాములు విషయం కాదు. భిన్నమైన పాలన చేయటం బీజేపీకే సాధ్యం అయ్యింది. మహారాష్ట్ర, జార్ఖండ్ లలో ఇదే విజయాన్ని కైవసం చేసుకుంటాం. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాలనే గెలుపునకు బాటలు వేసిందని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు అన్నారు. ఇక్కడి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం జరిగిన వారధి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఏమన్నారంటే…

ప్రేరేపిత ఉద్యమాలు హర్యానా ప్రజల్లో మొదీ ప్రభుత్వం పట్ల విశ్వాసాన్ని తగ్గించలేకపోయాయి. మోదీ ప్రభుత్వం ప్రజా శ్రేయస్సుకు చేస్తున్న పనులను హర్యానా ప్రజలు గుర్తించారు. ఉద్వేగం , ఉద్రిక్తతలకు తావు లేకుండా ఉన్నతంగా ఆలోచించి హర్యానా ప్రజలు తీర్పునిచ్చారు. ఇక జమ్మూ – కాశ్మీర్ లో ఉగ్రవాదాన్ని నిర్మూలించే లక్ష్యంతో , కాశ్మీర్ లో ఉగ్రవాద కార్యకలాపాలను నిలువరించగలిగాం. సురక్షితమైన పర్యాటక ప్రాంతంగా కాశ్మీర్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో విజయం సాధించాం. ఆంక్షలు లేని పరిస్థితిని నిర్మాణం చేసి త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడిచి విజయం సాధించాం. సైన్యానికి విశేష అధికారాలను కల్పించి భద్రత విషయంలో కాశ్మీర్ లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాం. ఉగ్రవాదాన్ని పూర్తిస్థాయిలో నిర్మూలించి త్వరలోనే అధికారం చేపడతాం.

సమస్యల పరిష్కారానికి ‘వారధి’

ప్రజల సమస్యలు పరిష్కారం కోసం వారధి ఒక చక్కని కార్యక్రమం. అన్ని వర్గాల ప్రజలు ఈ వారధిని సద్వినియోగం చేసుకుంటున్నారని సోము వీర్రాజు అన్నారు. సమస్యలను సంబంధిత శాఖలకు పంపి పరిష్కారం చూపేలా చేస్తున్నాం. దేశంలో మోడీ పాలనని అప్రతిష్ఠ పాలు చేసేందుకు హర్యానా నుండి కాంగ్రెస్ విస్తృతంగా పనిచేసింది. రైతుల పోరాటంలో విషయంలో … పొగాకు విషయంలో కూడా కాంగ్రెస్ రాజకీయాలు చేసింది. ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాలు వినియోగించుకుని కాంగ్రెస్ చేసిన రాజకీయాన్ని హర్యానా ప్రజలు తిప్పికొట్టారు. ఈ విజయం భారతదేశంలో అభివృద్ధికి బాటలు వేసిందన్నారు.

అనంతరం పార్టీ కార్యాలయం లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. హర్యానా గెలుపు తో మిఠాయిలు పంచారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయ చౌదరి, మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ, బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఇన్‌చార్జి శివా మకుటం, అబ్బూరి శ్రీరాం, పీయూష్ దేశాయ్, సూర్య తేజ, గాజుల వెంకయ్య నాయుడు, తదితరులు పాల్గొన్నారు. నేడు హర్యానా… రేపు మహారాష్ట్ర, జార్ఖండ్ అంటూ చేసిన నినాదాలు మిన్నంటాయి.