– కలెక్టర్ నాగలక్ష్మి
గుంటూరు, మహానాడు: ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తున్న ఇసుకను నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు తిరిగి అమ్మకాలు చేసే వారి వాహనాలు సీజ్ చేయడంతో పాటు భారీగా అపరాధ రుసుం విధిస్తామని, జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి హెచ్చరించారు. మంగళవారం కొల్లిపర మండలంలోని మున్నంగి ఇసుక స్టాక్ యార్డును కలెక్టర్ నాగలక్ష్మి తెనాలి సబ్ కలెక్టర్ ప్రఖార్ జైన్, అసిస్టెంట్ కలెక్టర్ స్వప్నిల్ పవర్ జగన్నాథ్ తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
స్టాక్ యార్డ్ వద్ద పేమెంట్లు వసూలు చేస్తున్న సచివాలయ ఉద్యోగులతో మాట్లాడారు. పేమెంట్ చెల్లించిన తర్వాత ఇసుక లోడుకు రసీదులు అందించే స్వయం సహాయక సభ్యులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. రసీదు పుస్తకాలు పరిశీలించి ఎక్కువ రసీదులలో వినియోగదారుడు, ఇసుక సరఫరా చేసే వాహనదారుని ఫోన్ నెంబర్లు ఒకటే ఉండటం గుర్తించి ఇక నుంచి కచ్చితంగా వినియోగదారుల ఫోన్ నెంబర్ నమోదు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. స్టాక్ యార్డు వద్ద నిర్వహణ విధులు నిర్వహిస్తున్న స్వయం సహాయక సంఘంకు టన్నుకు పది రూపాయిలు అందిస్తున్నారని, బాధ్యతగా పనిచేయాలన్నారు.
రసీదులో వినియోగదారుల పూర్తి వివరాలు నమోదు చేయాలని అవసరమైతే వాహనదారులు తెచ్చిన వినియోగదారునికి ఫోన్ చేసి చెక్ చేయాలన్నారు. ప్రతి రోజు జరిగిన లావాదేవీల వివరాలను ఎక్స్ఎల్ షీట్ లో నమోదు చేయాలన్నారు. రసీదు నమోదు కేంద్రం వద్ద ఉన్న వాహన డ్రైవర్లతో కలెక్టర్ మాట్లాడుతూ వినియోగదారులు చెప్పిన ప్రకారం వారి ఆధార్ కార్డు ఇతర వివరాలు, ఫోన్ నెంబర్ తో సహా అందించి ఇసుకను తీసుకువెళ్లాలని తెలిపారు.
నియోగదారులు పేరు చెప్పి ఇసుకను తీసుకొని అధిక ధరలకు విక్రయించినట్లు గుర్తిస్తే వాహనదారుల వాహనాలను సీజ్ చేయడంతో పాటు భారీ ఎత్తున జరిమాన విధిస్తామని హెచ్చరించారు. ఇటీవల ఇసుక డెలివరీ తీసుకున్న వినియోగదారుల వివరాలను రసీద్ పుస్తకంలో పరిశీలించి కొంత మందికి తహశీల్దారుతో కలెక్టర్ ఫోన్ చేయించారు.
వారు ఇసుక తీసుకున్న అవసరం, టన్నులు, ధర తదితర అంశాలను తెలుసుకొని పుస్తకంలోని వివరాలను పరిశీలించారు. నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం ఇసుకను వినియోగదారులకు సక్రమంగా సరఫరా అయ్యేలా స్టాక్ యార్డులో పనిచేసే ఉద్యోగులతో పాటు సంబంధిత శాఖల అధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ప్రభుత్వం వినియోగదారులకు ఇసుకను ఉచితంగా అందిస్తోందని, కేవలం ఆపరేషన్ చార్జీ కింద ఒక్కో టన్నుకు 250 రూపాయలు మాత్రమే వసూలు చేస్తోందని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో కొల్లిపర తహశీల్దారు సిద్ధార్ధ, మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.