– పాప మరణం చాలా బాధించింది: మంత్రి శ్రీధర్ బాబు
– సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి రైస్ మిల్ లో మైనర్ బాలిక అత్యాచారం, హత్య ఘటన స్థలాన్ని పరిశీలించిన మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, ఎంపీ గడ్డం వంశీ కృష్ణ, ఎమ్మెల్యేలు విజయ రమణ రావు, మక్కాన్ సింగ్
-రామగుండం సి.పి శ్రీనివాసును వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రులు…
– బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా ఆదుకుంటామని, నిందితునికి కఠిన శిక్ష పడేలాగా చూస్తామని హామీ ఇచ్చిన మంత్రులు
సుల్తానాబాద్: నిందితుడు చేసింది చాలా నీచమైన చర్య. సమాజం తలదించుకునేలా చేశాడు. పాప మరణం నన్ను చాలా బాధించిందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు విచారం వ్యక్తం చేశారు. నిందితుడు బీహార్ కు చెందినవాడు. ఇక్కడ కూలీ పని చేస్తున్నాడు. పాపను అపహరించి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పరారీలో ఉన్న నిందితున్ని పోలీసులు సకాలంలో పట్టుకున్నారు.పాప ఆచూకీ తెలిసే లోపే, అప్పటికే చనిపోయింది.
ఈ కేసును ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. తక్షణమే తగిన విచారణ జరిపించి, నిందితున్ని శిక్షించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపి నిందితునికి శిక్ష పడేలా చూస్తాము. ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటది. పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తాం. పాప తల్లిదండ్రుల్ని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుంటాము, వారిని అన్ని విధాలుగా ఆదుకుంటాం.