ఆరా ఉందా…పుట్టి ముంచుతుందా..గట్టెక్కుతుందా?

-కూటమికి అనుకూలంగా అన్ని సర్వే సంస్థలు
-అందుకు భిన్నంగా ఆరా మస్తాన్‌ సర్వే
-ప్రామాణికతపై సర్వత్రా అనుమానాలు
-మహిళల ఓట్లు, కాంగ్రెస్‌ ప్రభావంపై లాజిక్‌ మిస్సయ్యారా?
-గుర్తింపు ఉన్న మంత్రులు ఓడితే ఎమ్మెల్యేలు ఎలా గెలుస్తారు?
-టీడీపీ టికెట్‌ ఇవ్వలేదనే వ్యతిరేకంగా పనిచేశారా అంటూ నిలదీతలు
-ఎగ్జిట్‌పోల్స్‌లో కొత్త తలనొప్పులు..మరో లగడపాటి అంటూ ట్రోలింగ్స్‌
-ఔరా..! ‘ఆరా’ సర్వేలో ఎన్ని సిత్రాలో…
(వాసిరెడ్డి రవిచంద్ర)

ఎగ్జిట్‌ పోల్స్‌ ఏపీలో కొత్త తలనొప్పులు తెచ్చి పెడుతున్నాయి. నిన్నటి వరకు కూటమికి ఏకపక్షం అనుకున్న నేపథ్యంలో ఎక్కువ శాతం ఎగ్జిట్‌ పోల్‌ సర్వే సంస్థలన్నీ కూటమికి అనుకూలంగా సర్వేలు ఇచ్చాయి. అయితే ఇందుకు భిన్నంగా గత ఎన్నికల్లో సక్సెస్‌ ఉన్న గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన ఆరా మస్తాన్‌ ఇచ్చిన ఆరా సర్వే అందరికీ భిన్నంగా ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఆరా సర్వేలో ప్రామాణికత ఉందా లేదా అనే అంశాలపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఆరా సర్వేతో వైసీపీలో కొంత ఉత్సాహం నెలకొనగా ముఖ్యంగా బెట్టింగ్‌ రాయుళ్లకు ఆరా సర్వే ఇంజక్షన్‌గా మారింది.

వైసీపీ శ్రేణులు కొందరు బెట్టింగులకు ముందుకు రావడం తెలుగుదేశం శ్రేణులకు కలిసొచ్చే అంశంగా చెబుతున్నారు. అయితే ఆరా సర్వేతో వైసీపీ శ్రేణులు పుట్టి మునుగు తారా అన్న ఆందోళన కూడా కనిపిస్తుంది. ఆనాడు లగడపాటి రాజగోపాల్‌ సర్వే తో తెలుగుదేశంలో అనేకమంది ఓట్ల రూపాయలు బెట్టింగుల్లో పెట్టి మునిగిపో యారు. ఇప్పుడు దేశంలోని జాతీయ సంస్థలు, స్థానిక సర్వే సంస్థలు 40 వరకు సర్వేలు చేయగా 35 సంస్థలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి స్పష్టమైన మెజార్టీ ఇవ్వగా ఆరా మస్తాన్‌రావు అందుకు భిన్నంగా వైసీపీకి స్వల్ప ఆధిక్యత ఇస్తూ సర్వే విడుదల చేయడం చర్చనీయాంశంగా మారింది. సర్వేలో విశ్వసనీ యతపై అనేక అనుమానాలు, అనేక విమర్శలు ట్రోల్‌ అవుతున్నాయి. అసలు గుంటూరు జిల్లాలో ముఖ్యంగా పల్నాడు జిల్లాలో గెలుపు ఓటములపై మస్తాన్‌ రావు ఇచ్చిన వివరణతో ఆయన సర్వేపై అనుమానాలు తలెత్తుతున్నాయి..

ఔరా..! ‘ఆరా’ సర్వేలో ఎన్ని సిత్రాలో…
నిన్నటిదాకా ఎగ్జిట్‌ పోల్స్‌ ఎదురు చూపులు…తీరా అవి వచ్చాక వాటి విశ్వసనీ యత మీద వాదోపవాదాలు…ఇదీ కౌంటింగ్‌ ఫీవర్‌ తీవ్రంగా ఆవరించి ఉన్న ఏపీలో పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందంటూ ఆరా అనే సంస్థ ఇచ్చిన సర్వే ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అదేంటో…ఎందుకో ఇప్పుడు చూద్దాం..ఏపీలో ఎన్నికల ఫలితాలపై నరాలు తెగే ఉత్కంఠ నెలకొన్న వేళ ముందుగా ప్రజానాడిని పసిగట్టే ఎగ్జిట్‌ పోల్స్‌ కోసం అందరూ కళ్లళ్లో ఒత్తులు వేసుకొని ఎదురుచూశారు. దేశ వ్యాప్తంగా జరిగే సార్వత్రిక ఎన్నికలకు జూన్‌ 1 ముగింపు రోజు కావడంతో అదే రోజు ఎగ్జిట్‌ పోల్స్‌కు ఈసీ అనుమతి నిచ్చింది. ఇప్పటికే ఓటింగ్‌కు కౌంటింగ్‌కు మధ్య ఉన్న సుదీర్ఘ విరామం కారణంగా ఫలితాలపై టెన్షన్‌తో ఉన్న రాజకీయ శ్రేణులే కాదు సామాన్య జనాలు సైతం ఎగ్జిట్‌ పోల్స్‌ కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూశారు.

ఇక జూన్‌ 1 రానే వచ్చింది. ఎగ్జిట్‌ పోల్స్‌ సర్వేలు విడుదలయ్యాయి. అయితే ఈ సర్వేల్లో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది ఒక సర్వే…అదే ఆరా సంస్థ విడుదల చేసిన ఎగ్జిట్‌ పోల్‌ సర్వే. ఆరా వ్యవస్థాపకుడు షేక్‌ మస్తాన్‌ పల్నాడు జిల్లాలోని తన స్వగ్రామం మద్దిరాలలో మీడియా సమక్షంలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈ సర్వేను విడుదల చేయడం విశేషం. అయితే ఇప్పుడు ఈ ఆరా సర్వే ప్రజల్లో కౌంటింగ్‌ ఫీవర్‌ను కొంతైనా తగ్గిస్తుందేమోననుకుంటే అందుకు భిన్నంగా ఆ హీట్‌ను మరింత పెంచింది. కారణం ఏపీలో ఎన్నికల ఫలితాలపై మొత్తం జాతీయ సంస్థలు కానీ, రాష్ట్రస్థాయి సంస్థలు కానీ కొంత గుర్తింపు ఉన్న సుమారు 16 సంస్థలు ఎగ్జిట్‌ పోల్స్‌ విడుదల చేశాయి. ఇందులో కేవలం మూడు తప్ప మిగతా సంస్థలన్నీ టీడీపీ కూటమిదే గెలుపు అని ప్రకటించాయి. అయితే ఆత్మ సాక్షి, రైజ్‌, ఆరా ఈ సంస్థలు మాత్రం రాష్ట్రంలో మళ్లీ వైసీపీ ప్రభుత్వం ఏర్పడబోతున్నట్లు వెల్లడిరచాయి. అయితే ఆరా మినహా మిగతా రెండు వైసీపీ జేబు సంస్థలని ప్రతిపక్షాలు కొట్టిపడేశాయి. ఇక ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పేరు, విశ్వసనీయత ఉన్న ఆరా సంస్థ వైసీపీ గెలవబోతోందంటూ ఇచ్చిన సర్వేనే ఇప్పుడు ఎక్కడ చూసినా హాట్‌ టాపిక్‌గా మారింది.

ఒక్కసారి ఆరా సంస్థ సర్వేలో ముఖ్యమైన అంశాలు చూద్దాం
ఆరా మస్తాన్‌ ఏం చెప్పారంటే…రాష్ట్రంలో మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండటంతో పాటు పురుషుల కంటే 4.78 లక్షల మంది మహిళలు ఎక్కువ మంది ఓటేశారు. అలా అదనంగా ఓటేసిన మహిళల్లో 56 శాతం మంది వైఎస్సార్సీపీకి ఓటేశారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు, గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు కారణంగా బీసీల్లోనూ వైసీపీ ఎక్కువ ఓట్లను సాధించింది. కొత్తగా బీసీలు, మహిళల ఓట్లను పెంచుకోవడం వల్ల వైఎస్సార్సీపీ మరోసారి రాష్ట్రంలో అధికారంలోకి రాబోతోంది. వైఎస్సార్సీపీ 49.1 శాతం ఓట్లతో 94-104 అసెంబ్లీ స్థానాల్లో గెలవబోతోంది. అదే సమయంలో టీడీపీ కూటమి 47.55 శాతం ఓట్లు సాధించి 71-81 స్థానాలకు పరిమితం కాబోతుంది. ఇతరులు 3.04 శాతం ఓట్లకు పరిమితం కాబోతున్నారు. సుమారు 2 శాతం ఓట్ల ఆధిక్యం తో టీడీపీ కంటే 20-25 స్థానాల్లో ఆధిక్యంతో వైఎస్సార్సీపీ అధికారంలోకి రాబోతోంది’ అని ప్రకటించారు. అదే సమయంలో వైసీపీ మంత్రులు సీదిరి అప్పలరాజు, గుడివాడ అమర్నాథ్‌, కారుమూరి, చెల్లుబోయిన, కొట్టు సత్యనారా యణ, విడదల రజనీ, ఆదిమూలం సురేష్‌, ఉషశ్రీ చరణ్‌, ఆర్కే రోజా, స్పీకర్‌ తమ్మినేని ఓడిపోతున్నారన్నారు. అలాగే మంత్రులు ధర్మాన, జోగి రమేష్‌, అంబటి రాంబాబు గట్టి పోటీని ఎదుర్కొంటున్నారని చెప్పారు.

మరో లగడపాటి కానున్నాడా…
అయితే ఊరంతా ఒక దారి అయితే ఉలిపి కట్టెది మరో దారి అన్నట్లుగా ఇప్పుడు ఆరా సంస్థ ప్రకటించిన ఈ సర్వేనే రాష్ట్రంలో కాకను మరింత పెంచి ఇటు జనాల్లో వాదోపవాదాలు, అటు సోషల్‌ మీడియాలో భీకర ట్రోలింగ్‌లకు కారణమైంది. వాటి సారాంశం ఏమంటే ఈ సర్వేతో ఆరా సంస్థ తన విశ్వసనీ యత కోల్పోనుంది. 2014 ఎన్నికల తర్వాత లగడపాటి ఎలాగైతే టీడీపీకి అను కూలంగా ఎగ్జిట్‌ పోల్స్‌ ఇచ్చి కనుమరుగ య్యాడో…ఇప్పుడు కూడా సేమ్‌ ఆరా మస్తాన్‌ కూడా అలాగే వైసీపీకి అనుకూలంగా సర్వే ఇచ్చి…మరో లగడపాటి కాబోతున్నారని జోస్యం చెబుతున్నారు. ఎన్నికల ఫలితాలపై రాజకీయ పార్టీల భవిష్యత్తు గురించి చెప్పే ఆరా మస్తాన్‌ 2024 కౌంటింగ్‌ డే తరువాత ఆరా ఇక తెలుగు రాష్ట్రాల్లో కనిపించడు…అని నెటిజన్లు జోస్యం చెబుతున్నారు. నెటిజన్లు ఇంత తీవ్రంగా ప్రతిస్పందించడానికి కారణాలు కూడా ఉన్నాయంటున్నారు. అవేంటంటే…ఇంతమంది కాస్తో కూస్తో పేరు, గుర్తింపు ఉన్న వైసీపీ మంత్రులు ఓడిపోతే మిగతా ఎమ్మెల్యేలు మాత్రం ఎలా గెలుస్తారు? మంత్రుల మీద అంత వ్యతిరేకత ఉంటే అది వైసీపీ ప్రభుత్వం పైన ఉన్నట్లే…దాంతో ఎమ్మెల్యేలు ఇంకా ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశాలు ఉంటాయి కదా అనేది నెటిజన్ల లాజిక్‌…

మహిళల ఓట్లపై గారడి
అలాగే సంక్షేమ పథకాల లబ్ధిదారులైన మహిళలు ఓట్లు వేసి జగన్‌ను గెలిపి స్తున్నట్లుగా చెబుతున్నారని, అదే నిజమైతే…సుమారు కోటి పది లక్షల మంది మహిళలు ఈ సంక్షేమ పథకాలు అందని వారున్నారని మీ లాజిక్‌ ప్రకారమే వారు వ్యతిరేక ఓటు వేసి ఉండొచ్చు కదా అని ప్రశ్నిస్తున్నారు. అసలు ఈ ఎన్నికల్లో గెలుస్తామని వైసిపి ఏవైతే కారణాలు చెబుతుందో అవే కారణాలను ఆరా మస్తాన్‌ లెక్కల్లోకి మార్చి అంకెల గారడితో కనికట్టు చేయాలని చూస్తున్నాడంటున్నారు. దీనివెనుక ఏదో లబ్ధి ఉందని అనుమానిస్తున్నారు.

కాంగ్రెస్‌ ప్రభావంపై ప్రశ్నలు
మరి కొంతమంది నెటిజన్లు మరింత లోతుగా వెళ్లి కాంగ్రెస్‌ పార్టీ కారణంగా లోక్‌సభ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మూడు సీట్లను కోల్పోతుందని మస్తాన్‌ అంచనా వేశారు. మరి అలాంటప్పుడు సాక్షాత్తూ పీసీసీ అధ్యక్షురాలు, వైఎస్‌ కుమార్తె షర్మిల లాంటి బలమైన నేత పోటీలో ఉన్న కడపలోనే కాంగ్రెస్‌ పార్టీకి డిపాజిట్లు రానప్పు డు… ఇక మిగతా స్థానాల్లో కాంగ్రెస్‌ ఇంకెంత వరకు ప్రభావం చూపుతుందనేది నెటిజన్ల ప్రశ్న…అలాగే లోక్‌సభ ఎన్నికల్లో ప్రభావం చూపిన కాంగ్రెస్‌ అభ్యర్థులు …మరి అసెంబ్లీ ఎన్నికల్లో కొంచెం కూడా ప్రభావం చూపకుండా ఉంటారా? అనేది మరో ప్రశ్న?

టీడీపీ టికెట్‌ ఎందుకడిగారో చెప్పాలని నిలదీతలు
మరి కొంత మంది నెటిజన్లయితే ఇంకో అడుగు ముందుకేసి ఆరా మస్తాన్‌ ఈ ఎన్నికల్లో టీడీపీ తరపున తన సతీమణికి టికెట్‌ అడిగాడని, ఇది నిజమా కాదో చెప్పాలని…ఆ టికెట్‌ ఇవ్వలేదనే కారణంతో వైసీపీకి అనుకూలంగా మారారని అంటున్నారు. మరి వైసీపీ గెలిచేట్లయితే టీడీపీ టికెట్‌ ఎందుకడిగారో చెప్పాలని నిలదీస్తున్నారు. ఇంకొంత మంది నెటిజన్లయితే ఆరా మస్తాన్‌ గతంలో ఏం చెప్పాడో వాటి ఆధారంగానే ఈసారి ఆరా సర్వే తప్పులతడకగా తేల్చేస్తున్నారు. గత ఎన్నికల కంటే పోలింగ్‌ శాతం పెరిగితే అది ఖచ్చితంగా ప్రతిపక్షానికి అను కూలంగా ఉంటుందని ఎన్నికల రోజు ఆరా మస్తాన్‌ చెప్పారని… అలాకాకుండా పోలింగ్‌ శాతం గతం కంటే తగ్గితే మాత్రం అధికార పార్టీకి అనుకూలంగా ఉంటుందని చెప్పిన విషయం గుర్తు చేస్తున్నారు.

మరి ఇప్పుడు పోలింగ్‌ శాతం పెరిగింది..మరి తాను చెప్పిన లాజిక్‌ ప్రకారం ప్రతిపక్షలకు లాభం చేకూరకుండా వైఎస్సార్సీపీకి సీట్లు పెరుగుతాయని ఎలా చెబుతున్నావ్‌ అని కడిగిపారేస్తున్నారు. తెలంగాణా ఎన్నికల సమయంలో అసలు ఎగ్జిట్‌ పోల్స్‌ చేయడం అనేది సాధ్యం కాదు.. ఇవన్నీ ప్రీ పోల్‌ సర్వేలే. కుండబద్దలు కొట్టినట్లు చెప్పిన నువ్వు ఈ సర్వే ఎలా చేశావ్‌ అని ఏకిపడేస్తున్నారు. అయితే న్యూట్రల్‌ పీపుల్‌ మాత్రం ఆరా మస్తాన్‌ సర్వే సైంటిఫిక్‌గా ఉంటుందని, 2019 ఎన్నికలు సహా పలు సందర్భాల్లో ఆరా సంస్థ కచ్చితమైన అంచనాతో విశ్వసనీయత సంపాదించుకుందని..ఒకవేళ సర్వే తప్పుగా ఇస్తే అతని క్రెడిబులిటీ మొత్తం పోతుందనే సంగతి అతనికి తెలియదా అని అభిప్రాయపడుతున్నారు. మరి ఇన్ని చిత్ర విచిత్రాల నడుమ వాస్త వ ఫలితాలేంటనేది జూన్‌ 4 తేలిపోనుంది. అంతవరకూ వెయిట్‌ చేయక తప్పదు మరి…సో…బిపీ బిళ్లలతో బీ రెడీ…