తొలితరం లో క్యారెక్టర్ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఋష్యేంద్రమణి గురించి ఈ తరంలో చాలామందికి తెలియదు. ఐదు దశాబ్దాల పాటు కొనసాగిన ఈమె నట జీవితంలో గుర్తుంచుకోదగ్గ పాత్రలు చాలా పోషించారు. ఎన్ ఏ టి, విజయా సంస్థల సినిమాలలో ఎక్కువగా నటించారు. కరుణ, ఆవేదన, భక్తిరసం పాత్రల అభినయంలో మంచి ప్రతిభను చూపారు.
జయసింహ లో యస్వీఆర్ సరసన, పాండురంగ మహాత్మ్యం లో దారితప్పిన కొడుకును దరిచేర్చే తల్లిగా, గులేబకావళి కథలో కొడుకుకి దూరమై ఆవేదన చెందే తల్లిగా, సీతారామ కళ్యాణం లో రావణుని తల్లిగా, శ్రీకృష్ణ పాండవీయం, శ్రీకృష్ణ సత్య లో గాంధారి గా, మాయాబజార్ లో సుభద్రగా, మిస్సమ్మ లో ఎస్వీ ఆర్ సరసన హీరోయిన్గకు తల్లిగా, గుండమ్మ కథ లో ఎల్ విజయలక్ష్మి కి తల్లిగా, జగదేకవీరుని కథ లో మహారాణి గా, భామావిజయం లో వేశ్యమాత గా, శ్రీకృష్ణావతారం లో కుంతీదేవి గా, శ్రీకృష్ణార్జున యుద్ధంలో గంధర్వ రాజు గయుని భార్యగా, శ్రీకృష్ణ విజయం లో దేవకీదేవి గా.. ఇత్యాది పలురకాలు పాత్రలు పోషించి ఆనాటి ప్రేక్షకులను అలరించారు.
చాలా సాంఘిక చిత్రాల్లో కూడా ముఖ్య భూమికలు పోషించి మెప్పించారు. ఋష్యేంద్రమణి నటించిన చివరి చిత్రం 1986లో వచ్చిన షిరిడీ సాయిబాబా మహత్యం. నాలుగు దక్షిణాది భాషల్లో సుమారు 150 చిత్రాల్లో నటించారు. ఒక్క సినిమా పత్ని లో (1942) కథానాయికగా నటించారు. ఉదాత్తమైన కరుణారస పాత్రల్లో బాగా రాణించారు.
విజయవాడ కు చెందిన ఈ నట విదుషీమణి ఋష్యేంద్రమణి 1917 జనవరి 1న జన్మించారు. తన 85వ ఏట వయోభారంతో 2002లో ఈరోజే.. ఆగస్టు 17న మరణించారు. 22వ వర్ధంతి సందర్భంగా నటి ఋష్యేంద్రమణి ని గుర్తుచేసుకుంటూ నివాళులు అర్పిద్దాం.
– గాదె లక్ష్మీ నరసింహ స్వామి (నాని)
విజయనగరం