జోగి రాజీవ్‌పై ఎఫ్‌ఐఆర్ న‌మోదు చేసిన ఏసీబీ

– ఏ1గా జోగి రాజీవ్, ఏ2గా జోగి వెంకటేశ్వరావుపేర్లు
– ఎఫ్‌ఐఆర్‌లో మండల సర్వేయర్‌ రమేష్, గ్రామ సర్వేయర్ దేదీప్య పేర్లు కూడా
– సెక్షన్ 120బీ, 420 ఐపీసీ, పీసీ యాక్ట్ 7, 12 సెక్షన్ల కింద కేసు న‌మోదు

ఇబ్రహీంపట్నం: అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంట్లో ఉదయం ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. 15 మంది అధికారులతో కూడిన ఏసీబీ బృందం, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేశ్ నివాసానికి ఈ ఉదయం 5 గంటలకు చేరుకుని సోదాలు జరిపింది. ఈ సందర్భంగా పలు రికార్డులు మరియు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.

అనంతరం, ఈ కేసులో కీలకంగా భావిస్తున్న జోగి రమేశ్ కుమారుడు జోగి రాజీవ్‌ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా ఆయ‌న‌పై ఏసీబీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. రాజీవ్ పేరును ఏ1గా చేర్చింది.

అలాగే ఏ2గా జోగి వెంకటేశ్వరావు పేరు చేర్చింది ఏసీబీ. వీరితో పాటు ఎఫ్‌ఐఆర్‌లో మండల సర్వేయర్‌ రమేష్, గ్రామ సర్వేయర్ దేదీప్య, నున్న సబ్‌ రిజిస్ట్రార్‌ వి.నాగేశ్వరరావుల‌ను కూడా చేర్చింది. సెక్షన్ 120బీ, 420 ఐపీసీ, పీసీ యాక్ట్ 7, 12 సెక్షన్ల కింద, అలాగే ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ సెక్షన్ 4 ప్రకారం కేసు నమోదు చేశారు.

ఇదే వ్య‌వ‌హారంలో ఆగస్టు 8న అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేసింది. అవ్వ వెంకట శేషు నారాయణ ఫిర్యాదుతో విజయవాడ వెస్ట్ ఏసీపీ విచారించారు. విచారణ నివేదికను గతంలోనే డీజీపీకి ఎన్టీఆర్ జిల్లా సీపీ సమర్పించారు. మండల, గ్రామ సర్వేయర్లు తప్పుడు సర్వే చేశారంటూ విజయవాడ పోలీసులు నివేదిక ఇచ్చారు. దీంతో విజయవాడ పోలీసుల నివేదిక ఆధారంగా తాజాగా ఏసీబీ కేసు నమోదు చేసింది.

సర్వే జరపకుండా సర్వే రిపోర్ట్ ఇచ్చినట్లు ఏసీబీ నిర్ధారించింది. సరిహద్దుల్లో ఉన్నవారికి నోటీసులు ఇవ్వకుండా నివేదిక‌ ఇచ్చినట్లు తేల్చింది. 87 సర్వేనెంబర్ సీఐడీ అటాచ్‌లో ఉందని ఏసీబీ గుర్తించింది. నున్న సబ్ రిజిస్ట్రార్‌ రికార్డులను సరిగా పరిశీలించకుండానే రిజిస్ట్రేషన్ చేశారని ఏసీబీ తెలిపింది.