జిల్లాలో డీసిల్టేష‌న్ పాయింట్ల ఏర్పాటుకు చ‌ర్య‌లు

– ఇరిగేష‌న్‌, మైన్స్ అధికారుల‌కి సూచించిన రాష్ట్ర మంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ‌
– నెల్లూరు క‌లెక్ట‌రేట్ కార్యాల‌యంలో జిల్లా స్థాయి సాండ్ కమిటీ సమావేశం

నెల్లూరు: జిల్లాలో ప్రజలకు ఇసుక ఇబ్బందులు లేకుండా త్వరగా డీసిల్టేషన్ పాయింట్లు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పురపాలక ,పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పొంగూరు నారాయణ ఇరిగేషన్, మైన్స్ అధికారులకు సూచించారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలోని శంకరన్ హాల్లో జిల్లా స్థాయి సాండ్ కమిటీ సమావేశం కలెక్టర్ ఆనంద్ అధ్యక్షతన జరిగింది.

ఈ సమావేశానికి మంత్రి నారాయణ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ…జిల్లాలో ఉన్న మూడు ఇసుక డిపోలలో నిల్వ‌లు తగ్గిపోతున్న దృష్ట్యా ప్రజలకు ఇసుక ఇబ్బందులు లేకుండా డీసిల్టేషన్ పాయింట్లను గుర్తించి అనుమతులు పొంది ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. డీసిల్టేషన్ పాయింట్లు ప్రారంభమైతే ఇసుక పెద్ద ఎత్తున అందుబాటులోకి వస్తుందని అన్నారు.

వీలైనంత తక్కువ ధరకు ప్రజలకు ఇసుక అందించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. ఇసుక విషయంలో గట్టిగా వ్యవహరించాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశాలిస్తున్నారని , కనుక జిల్లాలో ఎక్కడ ఇసుక అక్రమాలు జరగకుండా పటిష్టంగా వ్యవహరించాలని అధికారులకు మంత్రి సూచించారు.

అనంత‌రం జిల్లా కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ…. ఇసుక డిపోలలో నిల్వలు తగ్గిపోతున్నందున డీసిల్టేషన్ పాయింట్లు అనుమతులు పొంది టెండర్లు పిలవడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎక్కువ పాయింట్లు ఏర్పాటు చేసినట్లయితే ప్రజలకు దగ్గరగా వుండి రవాణా ఖర్చులు తగ్గుతాయని అన్నారు.

ఇసుకకు సంబంధించిన సమస్యలు ఉన్నట్లయితే 0861- 2943569 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా తెలియజేయవచ్చని తెలిపారు. ఇసుక అక్రమాలను అరికట్టడానికి టీములను ఏర్పాటు చేశామని, అలాగే ఇసుక అక్రమాలకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేయడం జరిగిందని మైన్స్ డిడి సమావేశంలో వివరించారు.

ఈ సమావేశంలో జిల్లా పోలీస్ సూపరిండెంట్ కృష్ణ కాంత్. జాయింట్ కలెక్టర్ కార్తీక్, మైన్స్ డి డి శ్రీనివాసరావు ,ఇరిగేషన్ ఎస్.ఇ, కృష్ణ మోహన్, సబ్ కలెక్టర్ విద్యాధరి , ఆర్డీవోలు మలోల‌, మధులత ఏఎస్పీ సౌజన్య పలువురు అధికారులు పాల్గొన్నారు.