Mahanaadu-Logo-PNG-Large

సినీ చరిత్రను మార్చిన అడవిరాముడు

సరిగ్గా 47సంవత్సరాలక్రితం ఇదే రోజు విడుదలైన ఆ “అడవిరాముడు” సినిమా తెలుగు చలనచిత్ర చరిత్రను మార్చేసింది. ఇందులో నటించినవారందరికి స్టార్‌డమ్ నిచ్చింది. . సాంకేతిక నిపుణులు కూడా పెద్ద ధరలకు ఎదిగిపోయారు. సత్య చిత్ర నిర్మాతలు అంతకుముందు శోభన్ బాబు తో తాశీల్దార్ గారి అమ్మాయి తీసి విజయం చవిచూసారు. ఎలాగైనా ఎన్ టి ఆర్ తో తీద్దామనే యోచనలో పడ్డారు.

అప్పటికి ఎన్ టి ఆర్ రాఘవేంద్ర రావు కాంబినేషన్తో చిత్రం ఎవరు తీయలేదు. ఆపని మనం చేద్దామని ఎన్ టి ఆర్ ను కలుసుకుని డేట్స్ అడిగారు. అప్పుడు ఎన్ టి ఆర్ దాన వీర శూర కర్ణ చిత్రం నిర్మాణంలోఉన్నారు. ఇచ్చిన డేట్స్ కేన్సిల్ చేసుకుని మరోసారి 35 రోజులు మధుమలై అడవుల్లో ఏకంగా ఉండి పోయారు. ఎన్ టి ఆర్ అలా out door లో ఉండడమనేది ఈ చిత్రంతో ఆరంభం అయ్యింది. స్కోప్ లో అడవి అందాలతో నిండిన చిత్రంగా రాఘవేంద్రరావు చిత్రీకరించారు.

అప్పటి వరకు ఉన్న ఎన్ టి రామారావు ఇమేజిని మారుస్తూ, ఆహార్యం, దుస్తులు మార్పులు చేసి రాఘవేంద్రరావు కొత్త ఎన్ టి రామారావును చూపించారు. రామారావు ఇంట్రడక్షన్ నుండి హీరోఇజమ్ ప్రదర్శితమౌతూ వస్తుంది.

అడవుల్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు ఎన్ టి ఆర్ దృష్టిలో కారా కిల్లీ డబ్బా కన్పించింది. దాన్ని అందుకుని పది పదిహేను కిళ్లీలకు సరిపడా మసాలాలు అన్ని బంగలా ఆకుల్లో కలిపి చుట్టేసి నోట్లోవేసుకుని నమిలేస్తుంటే యూనిట్ ఠారెత్తి పోయింది. అప్పటికే ఎన్ టి ఆర్ వయస్సు 54. తిన్నదేమో పండా సుబుద్ది కారాకిళ్లీ . అదివాసన చూస్తేనే కళ్లు తిరిగి మైండ్ బ్లాక్ అయిపడి పోవాలి. అలాంటిది పది పదిహేను కిళ్లీల పట్టును పట్టేసారు.

ఎన్ టి ఆర్ నములుతూనే లేచినిలబడి పచార్లు చేస్తుంటే పడిపోగలరని పక్కకు కొందరు చేరారు. ఒకరిద్దరు నీళ్లు అందించారు. నమిలేసిన వ్యర్దం ఉమ్మేస్తాడనుకుంటే చక్కగా మింగేసి చెంబుడు నీళ్లుతాగేసి షాట్ రెడీయా అని అడిగే సరికి యూనిట్ బిక్కముఖాలు వేసారు. ఇలా ఎన్ టి ఆర్ సరదా సందడిగా షూటింగ్ లో పాల్గొ న్నారు. ఎన్ టి ఆర్ పారితోషికం ఈ చిత్రంతోనే 12 లక్షలకు ఎదిగారు.

జయప్రదకు ఈ చిత్రంతో వెనక్కి చూడకుండా ముందుకు సాగిపోయేలా చిత్రపరంపర వచ్చి పడింది. ఆమె ఉంటే చాలు చిత్రవిజయం తేలిక అవుతుం దనేంత ఎత్తుకు ఎదిగిపోయింది. జయసుధ పరిస్థితి అదే. రాఘవేంద్రరావు సూపర్ డూపర్ హిట్ డైరెక్టర్ గా నమోదు అయ్యింది ఈ చిత్రంతోనే.

28-4-77లో విడుదలయిన ఈ చిత్రం 100 రోజులు 32 కేంద్రాలు కలెక్షన్స్తో ఆడింది. అలాగే 175 రోజులు 16 సెంటర్లు, ఏడాదిపాటు 4సెంటర్లు రికార్డులు సృష్టించాయి. 4 కోట్లులాభాలు తెచ్చిపెట్టాయి.

అడవి రాముడు సినిమా అప్పట్లో ఒక ప్రభంజనం. వసూళ్ళలో తెలుగు సినిమా చరిత్రలోనే ఒక చరిత్ర. ఆ రోజుల్లో అడవి రాముడు సాధించిన కమర్షియల్ రికార్డులు దక్షిణాదితో పాటు, ఉత్తరాది సినీసీమ వారిని కూడా ప్రాంతీయ తెలుగు సినిమా పరిశ్రమ వైపు కళ్ళువిప్పార్చి చూసేలా చేసింది. అప్పటి దాకా తెలుగు సినిమా వసూళ్ళు కోటి మార్కును దాటింది – కేవలం రెండే రెండు సినిమాలు. మొదటిది… ఎన్ టి ఆర్ ‘లవకుశ’. రెండోది ఎన్ టి ఆర్ స్వీయ దర్శకత్వంలో మూడు పాత్రలు నటించి, నిర్మించిన ‘దాన వీర శూర కర్ణ’. రెండూ పౌరాణికాలే.

కానీ, తొలిసారిగా సాంఘిక కథా చిత్రమైన ‘అడవి రాముడు’ ఏకంగా 4 కోట్ల గ్రాస్ సాధించి, అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. ఏకంగా ఏడాది పాటు ఏకధాటిగా ఆడింది. జనం క్యూలు కట్టి, ఆ సినిమా చూశారు. తెలుగు సినిమా స్టామినా ఎంత ఉందో తొలిసారిగా బాక్సాఫీస్ వద్ద రుచి చూపించింది. ఎన్ టి ఆర్ ‘అడవి రాముడు’ ఇచ్చిన ఆ భరోసాతో భారీగా సినిమాలు తీయడానికి దర్శక, నిర్మాతలు ధైర్యం చేశారు. తెలుగు సినిమాల వసూళ్ళూ ఆ దామాషాలో భారీగా పెరిగాయి. అలా తెలుగు సినిమాల్లో నిర్మాణవ్యయం, దానికి తగ్గట్లే వసూళ్ళూ పెరగడానికి కూడా ‘అడవి రాముడు’ మూలమైంది.

46 ఏళ్ళ క్రితం అప్పటి తెలుగు జనాభా, టికెట్ రేట్లు, రూపాయి విలువ లెక్కల్ని ఇప్పటి లెక్కలతో పోల్చి చూస్తే, అడవి రాముడు ఇవాళ దాదాపు 500 కోట్ల వసూల్ సినిమా అని సినీ వ్యాపార వర్గాల అంచనా. అన్నట్లు సినిమా రిలీజై ముప్ఫై ఏళ్ళు గడిచిన తరువాత కూడా మొన్న మొన్నటిదాకా దాదాపు 15 సరికొత్త ప్రింట్లతో రిపీట్ రన్ లు ఆడిన ఏకైక పాత చిత్రమూ ఇదే. అందుకే, హాలీవుడ్ పద్ధతిలో తెగిన టికెట్లు, చూసిన ప్రేక్షకుల సంఖ్యను బట్టి చూస్తే, అత్యధిక వ్యూయర్ షిప్ సాధించిన సినిమాగా, ‘అడవి రాముడు’ది అభేద్యమైన రికార్డని ట్రేడ్ విశ్లేషణ!

– దుర్గాప్రసాద్ కొంగర