– రూరల్ డెవలప్ మెంట్, పంచాయతీ రాజ్ అధికారులతో మంత్రి పెమ్మసాని
హైదరాబాద్, మహానాడు: ఒకప్పుడు ఏపీ, తెలంగాణలో జరిగిన అభివృద్ధిని చూసి ఇతర రాష్ట్రాలు కాపీ కొట్టేవి. తిరిగి ఆ రోజులు రావాలి… అని గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. హైదరాబాద్ లో గల ఎన్ ఐ ఆర్ డి పీ ఆర్(నేషనల్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలపమెంట్, పంచాయతీ రాజ్) ఇన్స్ టిట్యూట్ లో మంగళవారం జరిగిన 66వ జనరల్ కౌన్సిల్ సమావేశానికి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, గ్రామీణాభివృద్ధి శాఖ మరో కేంద్ర సహాయ మంత్రి అయిన కమలేష్ పాశ్వాన్ తో కలిసి గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు.
కార్యక్రమానికి ముందుగా సంబంధిత కేంద్ర, రాష్ట్ర శాఖాధికారులతో కలిసి రోడ్ల నిర్మాణాలపై పెమ్మసాని పరిశీలన జరిపారు. రహదారుల నిర్మాణాలకు సంబంధించి అధికారులు కేంద్ర, రాష్ట్ర స్థాయిలో అవలంబిస్తున్న విధానాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. నల్లరేగడి, ఎర్ర రేగడి నేలలపై జరుపుతున్న నిర్మాణాలపై అధికారులు పలు వివరాలు అందజేశారు. అలాగే నూతన సాంకేతిక విధానాలైన ప్లాస్టిక్ వేస్ట్ ను ఉపయోగించి, ఎఫ్. డి.ఆర్ టెక్నాలజీతో నిర్మిస్తున్న పద్ధతులను పెమ్మసాని గారికి అధికారులు వివరించారు.
అనంతరం రోడ్ల నిర్మాణాలలో సహజంగా ఎదురవుతున్న ఇబ్బందులు, అవకతవలపైనా అధికారులను వివరాలు అడగ్గా, అధికారులు పలు సమస్యలు, పరిష్కారాలను వివరించారు. పెమ్మసాని మాట్లాడుతూ అందుబాటులో ఉన్న టెక్నాలజీతో పాటు సరికొత్త సాంకేతికతను కూడా ఉపయోగించి రహదారుల నిర్మాణాలను చేపట్టాలని, ఆలోచన విధానాల్లో ఇతర రాష్ట్రాలకు మనం ఒక ప్రత్యామ్నాయంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ, ఏపీ మరియు తెలంగాణకు చెందిన రూరల్ డెవలప్ మెంట్, పంచాయతీ రాజ్ శాఖల అధికారులు కూడా పాల్గొన్నారు.