కల్తీ నెయ్యి… నిజాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి..

– జగన్మోహన్ రెడ్డి పాలనలో టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా
– ఏఆర్ ఫుడ్స్ కంపెనీకి టెండర్ ప్రకారం 6 నెలల్లో వెయ్యి టన్నుల నెయ్యి సరఫరా చేసే కెపాసిటీ లేదు
– టీటీడీ టెక్నికల్ టీమ్ రిపోర్టు ద్వారా నవంబర్ 8, 2023న తేలింది
– ఇలాంటి కంపెనీ 6 నెలల్లో వెయ్యి టన్నుల నెయ్యిని ఎలా సరఫరా చేయగలదో జగన్ సమాధానం చెప్పాలి
– ఏఆర్ ఫుడ్స్ కంపెనీ నెయ్యి స్టోరేజి ట్యాంకు కెపాసిటీ కేవలం 6 టన్నులు
– 6 టన్నుల నెయ్యి స్టోరేజీతో 16 టన్నుల కెపాసిటీ గల లారీలను ఏఆర్ ఫుడ్స్ ఎలా నింపగలదు?
– ఏఆర్ ఫుడ్స్ నుండి జూన్ 4న నెయ్యితో దిండిగల్ నుండి బయలుదేరిన AP26TC4779 లారీ తిరుమలకు జూన్ 12న చేరుకుంది.
– 500 కిలోమీటర్ల దూరాన్ని చేరుకునేందుకు 8 రోజులు ప్రయాణం చేయడం ఏంటి?
– ఏఆర్ ఫుడ్స్ కి అంత నెయ్యి సరఫరా చేసే కెపాసిటీ లేదు
– అందుకే ఇతర ప్రాంతాల్లో నెయ్యి కల్తీ చేసి, సరఫరా చేసేందుకే ఇన్ని రోజుల సమయం పట్టింది
– ఈ ఆధారాలతో అసలు ఏఆర్ ఫుడ్స్ డెయిరీ ప్లాంట్‌లో నెయ్యి ఉత్పత్తి కాలేదన్న విషయం రుజువైంది
– ఇతర ప్రాంతాల్లో జంతుకొవ్వుతో తయారు చేసిన కల్తీ నెయ్యిని తమ కంపెనీ పేరుతో సరఫరా చేశారు
– శ్రీవారి ప్రసాదాలకు వాడే నెయ్యిలో కూడా వైసీపీ నేతలు దోపిడీ చేసేందుకు ఏఆర్ ఫుడ్స్ డెయిరీని అడ్డుపెట్టుకున్నారు
– టీటీడీ టెక్నికల్ టీమ్ రిపోర్టులను కూడా ఎక్స్‌, ఇతర సోషల్ మీడియాలో జగన్ పోస్టు చేయగలరా?
– సత్యమేవ జయతే అని చెబుతున్న జగన్ మేం చూపించే ఆధారాలను ప్రజలకు చూపించగలరా?
– నెయ్యి కాంట్రాక్టులో కోట్లు మింగడం కోసం వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, వాళ్లకు సపోర్ట్ చేసే అధికారులు పాపాలు చేశారు
– వైసీపీ చేసిన పాపాలను నిగ్గు తేల్చడానికి మా ప్రభుత్వం సిట్ వేసింది
– సుప్రీంకోర్టు మార్గదర్శకాలతో త్వరలోనే నెయ్యి కల్తీకి పాల్పడిన దుర్మార్గులను ప్రజల ముందు నిలబెడతాం
– ఫ్యాటీ యాసిడ్ టెస్టింగ్ కి అవసరమైన పరికరాలు లేవు అని టీటీడీ ల్యాబ్ రిపోర్టు… అందుకే శ్యాంపిల్స్ ను ఎన్డీడీబీకి పంపాం
– వైసీపీ నేతలు తమ పాపాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రజలను, శ్రీవారి భక్తులను పక్కదారి పట్టించేలా అబద్దాలు
– వైసీపీ చేసిన పాపాలను ప్రక్షాళన చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు
– స్వచ్ఛమైన నందిని నెయ్యితోనే శ్రీవారి ప్రసాదాలు తయారు చేపిస్తున్నాం
– భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
– టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్

 

అమరావతి, మహానాడు: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి సంపదను దోచుకునేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం టీటీడీని జంతువుల కొవ్వుతో కలిసిన కల్తీ నెయ్యితో అపవిత్రం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా జగన్ సర్కార్ పాపాలు చేసిందని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం టీటీడీకి కల్తీ నెయ్యిని సరఫరా చేసిందని తెలిపే పలు కీలక డాక్యుమెంట్లను మీడియా ముందు పట్టాభిరామ్ ఉంచారు. ఈ సందర్భంగా పట్టాభి ఏమన్నారంటే…

తిరుమల తిరుపతి దేవస్థానంలో గత ప్రభుత్వం క్షమించరాని పాపం చేసింది. వైసీపీ చేసిన పాపాలను ప్రజల ముందు ఇప్పటికే అనేక ఆధారాలు ఉంచాం. అన్నీ తెలిసే వైసీపీ ఏఆర్ డెయిరీని అడ్డుపెట్టుకుని స్వామివారి ప్రసాదం లడ్డూ తయారీలో కలుషితమైన నెయ్యిని వాడారు. జంతువుల కొవ్వుతో కలిసిన నెయ్యిని వైసీపీ పాలకులు వాడి క్షమించరాని పాపం చేశారు. కోట్లాది మంది హిందువుల మనోభావాలు వైసీపీ పాలకుల పాపాలతో దెబ్బతిన్నాయి. మరిన్ని ఆధారాలు నేడు ప్రజల ముందు ఉంచుతున్నాం. 10 లక్షల కిలోల స్వచ్ఛమైన ఆవు నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఏఆర్ ఫుడ్స్ కంపెనీకి వైసీపీ ప్రభుత్వం ఇచ్చింది. ఈ కాంట్రాక్టు విలువ రూ.31.98 కోట్లు!

వైసీపీ ప్రభుత్వం మే 15, 2024న ఏఆర్ ఫుడ్స్ డెయిరీకి టీటీడీ పర్చేజ్ ఆర్డర్ ఇచ్చింది. టెండర్ పిలిచింది మార్చి 12న, ఫైనల్ చేసింది మే 8న, పర్చేజ్ ఆర్డర్ ఇచ్చింది మే 15న, అగ్రిమెంట్ చేసుకుంది జూన్ 11న. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకునే ఒక్కరోజు ముందు అగ్రిమెంట్ ను పకడ్బందీగా వైసీపీ ప్రభుత్వం చేసింది. ఏ సంస్థ అయినా టీటీడీకి నెయ్యి సరఫరా చేయాలంటే సరఫరా చేసే కంపెనీని టీటీడీ టెక్నికల్ కమిటీ వెళ్లి పరిశీలించి రిపోర్టు ఇవ్వాలి. 2023 నవంబర్ 8న ఒక టీటీడీ టెక్నికల్ టీమ్ ఏఆర్ ఫుడ్స్ కంపెనీ పరిశీలనకు వెళ్లింది. సంవత్సర కాలంలో ఏఆర్ డెయిరీ సంస్థ 2022 – 2023లో సంవత్సరానికి 14,940కిలోలు(14.9టన్నులు) మాత్రమే బల్క్‌గా సరఫరా చేసినట్టు టెక్నికల్ టీమ్ నిర్ధారించింది.

6 నెలల్లో 100 టన్నులు మాత్రమే ఉత్పత్తి చేసే సంస్థ, వెయ్యి టన్నులు టీటీడీకి ఎలా సరఫరా చేయగలదు?

ఏఆర్ ఫుడ్స్ డెయిరీ కంపెనీ ఉత్పత్తి సామర్థ్యం నెలకు సుమారు 16 టన్నులు మాత్రమే. దీని ప్రకారం చూస్తే 6 నెలలకు దాదాపు 100 టన్నుల నెయ్యి మాత్రమే ఏఆర్ డెయిరీ ఉత్పత్తి చేయగలదు. కానీ 6 నెలల్లో ఏఆర్ డెయిరీ టీటీడీకి వెయ్యి టన్నుల నెయ్యి సరఫరా చేసేందుకు కాంట్రాక్టు ఇచ్చారు. ఏఆర్ ఫుడ్ సంస్థకు వెయ్యి టన్నుల నెయ్యి సరఫరా చేసే కెపాసిటీ లేదని తెలిసినా వైసీపీ ప్రభుత్వం ఎందుకు ఇచ్చింది? సత్యమేవ జయతే అని చెబుతున్న వైసీపీ నేతలు టీటీడీ టెక్నికల్ కమిటీ రిపోర్టును కూడా సత్యమేవ జయతే అని ట్వీట్లు, సోషల్ మీడియాలో పోస్టులు జగన్మోహన్ రెడ్డి పెట్టించాలి.

ఏఆర్ ఫుడ్స్ కంపెనీ ప్రొడక్షన్ ఒక సంవత్సర కాలంలో అక్టోబర్ 2022 నుండి సెప్టెంబర్ 2023 వరకు ఆవునెయ్యి 16,300కేజీలు(16.3టన్నులు) నుండి 16,900కేజీలు(16.9టన్నులు) నెలకు ఉత్పత్తి చేశారు. అంటే సుమారు 16 టన్నులు మాత్రమే ప్రతినెల ఉత్పత్తి చేసే కెపాసిటీ ఉన్న సంస్థకు 6 నెలల్లో వెయ్యి టన్నుల నెయ్యి ఇవ్వాలనే కాంట్రాక్టును వైసీపీ ప్రభుత్వం ఇచ్చింది. ఏఆర్ ఫుడ్స్ కంపెనీ నెయ్యి స్టోరేజీ ట్యాంకు కెపాసిటీ 6 టన్నులు మాత్రమే. టీటీడీకి సరఫరా చేసే ఒక్కో నెయ్యి ట్యాంకర్ కెపాసిటీ 16 టన్నులు. కేవలం 6 టన్నుల స్టోరేజీ ట్యాంకు కెపాసిటీ ఉన్న ఏఆర్ ఫుడ్స్ డెయిరీ 16 టన్నులు కెపాసిటీ ఉన్న నెయ్యి ట్యాంకర్లను ఎలా నింపగలదు? అవకాశం లేదు. ఏఆర్ ఫుడ్స్ కంపెనీకి 6 నెలల్లో వెయ్యి టన్నుల నెయ్యిని ఉత్పత్తి, సరఫరా, నిల్వ చేసే సామర్థ్యం లేదని టీటీడీ టెక్నికల్ కమిటీ ఇచ్చిన నివేదిక రుజువు చేస్తుంది.

ఏఆర్ ఫుడ్స్ డెయిరీ సరఫరా చేసిన నెయ్యి మొత్తం కల్తీనే….

ఏఆర్ డెయిరీ టీటీడీకి ఎనిమిది ట్యాంకులు నెయ్యిని సరఫరా చేసింది. వాటిలో 4 ట్యాంకులు పంపితే దాన్ని వాడారు, మిగిలిన 4 ట్యాంకులను టీటీడీ వెనక్కి పంపించింది. జూన్ 4, 2024న ఏఆర్ ఫుడ్స్ నుండి టీటీడీకి మొదటి నెయ్యి ట్యాంకర్ AP26TC4779 దిండిగల్ నుండి బయలు దేరింది. ఈ లారీ జూన్ 12, 2024న తిరుమలలోని టీటీడీకి చేరింది. దిండిగల్ నుండి తిరుమలకు కేవలం 500 కిలోమీటర్ల దూరం మాత్రమే. ఈ దూరం ప్రయాణించడానికి 8 రోజుల ప్రయాణం పడుతుందా? 8 రోజుల పాటు ఈ లారీ ఎక్కడెక్కడ తిరిగి కల్తీ నెయ్యిని తీసుకువచ్చింది? జూన్ 11న ఏఆర్ ఫుడ్స్ నుండి బయలుదేరిన 2వ నెయ్యి ట్యాంకర్ 20న(10రోజులకు) టీటీడీ ఇన్ గేటుకు చేరింది. 24 జూన్ 2024న స్టోరేజీ ప్లేస్ కు వెళ్లింది. 19 జూన్ 2024న మూడో ట్యాంకర్ ఏఆర్ ఫుడ్స్ నుండి బయలుదేరి 25 జూన్ 2024న(7రోజులకు) టీటీడీకి చేరింది.

జూన్ 27న బయలుదేరిన 4వ ట్యాంకర్, జూలై 4న(8రోజులకు) ఇన్ గేట్ లోకి వచ్చింది. జూలై 12న స్టోరేజీ ప్రాంతానికి చేరింది. ఒక్కరోజులో టీటీడీకి ఏఆర్ ఫుడ్స్ నుండి రావాల్సిన నెయ్యి ట్యాంకర్లు వారం నుండి 10 రోజుల పాటు ఎక్కడెక్కడ తిరిగి కల్తీ నెయ్యి తెచ్చి శ్రీవారి ప్రసాదాలను కల్తీ చేశారో జగన్మోహన్ రెడ్డి, వైసీపీ పేటీఎం బ్యాచ్ ట్వీట్ లు చేయాలి. ఏఆర్ ఫుడ్స్ కంపెనీ టీటీడీకి అవసరమైనంత నెయ్యి ఉత్పత్తి, సరఫరా చేసే సామర్థ్యం లేక, తమ ట్యాంకర్లను వివిధ ప్రాంతాలకు పంపి, కల్తీ నెయ్యిని ట్యాంకర్లలో నింపి, తిరుమలకు తీసుకొచ్చేందుకు 8 రోజుల సమయం పట్టిందా? ఏఆర్ ఫుడ్స్ సరఫరా చేసిన కల్తీ నెయ్యి వెనుక ఎవరెవరి హస్తం ఉందో నిగ్గు తేల్చడానికే మా ప్రభుత్వం సిట్ వేసింది. సుప్రీం కోర్టు మార్గదర్శకాలతో సిట్ విచారణను వేగవంతం చేసి దోషులను కఠినంగా శిక్షిస్తాం.

ఫ్యాటీ యాసిడ్ టెస్ట్ చేసే పరికరాలు లేవని టీటీడీ ఇచ్చిన రిపోర్టుపై వైసీపీ అబద్ధాలు

తిరుమలకు సేకరించే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందో, లేదో కనుక్కునేందుకు వాడే ఫ్యాటీ యాసిడ్ టెస్ట్ పరికరాలు లేవు అని టీటీడీ ల్యాబ్ రిపోర్టు ఇచ్చింది. ఈ కారణంతో నెయ్యిని ఎన్డీడీబీ కి పంపించామని టీటీడీ చెబుతుంటే, దాన్ని జగన్, వైసీపీ బ్యాచ్ వక్రీకరించి ప్రజలకు అబద్దాలు చెబుతున్నారు. ఏఆర్ డెయిరీకి కాంట్రాక్టును కుట్రపూరితంగా కట్టబెట్టడం తప్ప, మరేంటి అని ప్రశ్నిస్తున్నాం. ఏఆర్ డెయిరీని తెరమీద పెట్టి, తప్పుడు బిల్లులు సృష్టించి, వేరే ప్రాంతాల్లో కల్తీ నెయ్యిని తీసుకువచ్చే కుట్రలో భాగంగానే నేడు వైసీపీ చేసిన కుట్ర బట్టబయలైంది. టీటీడీకి వచ్చిన నెయ్యి ఏఆర్ డెయిరీ సొంత ప్లాంట్‌లో తయారు కాలేదు.

వైసీపీ నేతలు దోచుకున్నదంతా కక్కించేందుకే సిట్

వైసీపీ ప్రభుత్వం స్వామివారి సొమ్ము వందల కోట్లు దోచుకుతినేందుకు ఇంతటి పాపానికి పాల్పడ్డారు. వైవీ సుబ్బారెడ్డి హయాంలో స్వామివారి ప్రసాదానికి వాడే పలు ఆహార పదార్థాలపై ఎంత దోచుకుతిన్నారో మేం త్వరలోనే నిజాలు నిగ్గు తేలుస్తాం. చంద్రబాబు ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం చేసిన పాపాలను పరిహారం చేసేందుకు కృషి చేస్తోంది. దిద్దుబాటు చర్యలు చేపట్టింది. భక్తులు ఎవరూ ఆందోళన పడొద్దు. నేడు నందిని నెయ్యితో శుద్ధమైన నెయ్యి తెప్పించి ప్రసాదాలు తయారు చేయిస్తున్నాం. భక్తులు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

పాపాలు చేసిన ఎవరినీ వదిలిపెట్టం. భూమన కరుణాకర్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డితో పాటు వాళ్లు ఏర్పాటు చేసుకున్న నెట్ వర్క్ ముఠా మొత్తాన్ని టీటీడీ నుండి బయటకు పంపించి టీటీడీ పవిత్రతను కాపాడతాం. ఈ విషయంలో ఎంతటి స్థాయి ఉద్యోగినైనా ఉపేక్షించేది లేదు. టీటీడీని సంపూర్ణంగా ప్రక్షాళన చేసి, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం. తన పాలనలో జరిగిన పాపాలను కూడా జగన్మోహన్ రెడ్డి గమనించాలని కోరుతున్నాం.