Mahanaadu-Logo-PNG-Large

ఎయిర్‌ పోర్టు నిర్మాణం పనులు సంతృప్తికరం

భోగాపురం ఎయిర్‌ పోర్టు పనులు 36.6 శాతం పూర్తి
నెలరోజుల్లో 4.8 శాతం పనులు
అనుకున్న సమయం కంటే ముందే పూర్తి చేసేందుకు అధికంగా అవకాశాలు
నిర్మాణం పనుల పురోగతిపై ప్రతి నెలా సమీక్షిస్తాం
ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చే శక్తి యీ ఎయిర్‌ పోర్టుకే వుంది : కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు
రాష్ట్ర మంత్రులు కొండపల్లి శ్రీనివాస్‌, గుమ్మడి సంధ్యారాణిలతో కలసి పనుల పరిశీలన
జి.ఎం.ఆర్‌., ఎల్‌ అండ్ టి సంస్థ ప్రతినిధులతో పనులపై కేంద్ర మంత్రి సమీక్ష
రైల్వేజోన్‌ ఏర్పాటుకు కేంద్రం సానుకూలం
– త్వరలో ఏర్పాటయ్యే అవకాశం: కేంద్ర మంత్రి వెల్లడి

విజయనగరం, ఆగష్టు 11 : జిల్లాలోని భోగాపురం వద్ద నిర్మాణం జరుగుతున్న అంతర్జాతీయ గ్రీన్‌ ఫీల్డ్‌ విమానాశ్రయం పనులు జరుగుతున్న తీరును బట్టి అనుకున్న సమయం కంటే ముందుగానే పూర్తిచేయగలమనే నమ్మకం తమకుందని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు చెప్పారు.

వాస్తవానికి డిశంబరు 2026 నాటికి యీ ఎయిర్‌ పోర్టు నిర్మాణం పూర్తికావలసి వున్నప్పటికీ ముఖ్యమంత్రి ఎన్‌.చంద్రబాబు నాయుడు ఇటీవల భోగాపురం ఎయిర్‌ పోర్టు పర్యటనకు వచ్చినపుడు నిర్ణీత గడువుకంటే ఆరు నెలలు ముందుగా జూన్‌ 2026 నాటికి పూర్తిచేయాలని గడువు విధించారని ఆ సమయానికే పూర్తిచేసే దిశగా వేగవంతంగా పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర మంత్రులు కొండపల్లి శ్రీనివాస్‌, గుమ్మిడి సంధ్యారాణి, ఎంపి కలిశెట్టి అప్పలనాయుడు, నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవితో కలసి ఆదివారం భోగాపురం ఎయిర్‌ పోర్టు నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించి పనులను పరిశీలించారు.

జి.ఎం.ఆర్‌. గ్రూపు డిప్యూటీ మేనేజింగ్‌ డైరక్టర్‌ ఐ.ప్రభాకరరావు వారికి పనుల పురోగతిని వివరించారు. కేంద్ర రాష్ట్ర మంత్రులు ముందుగా ఎయిర్‌ పోర్టు టెర్మినల్‌ భవనం వద్దకు చేరుకొని పనులను పరిశీలించారు. అక్కడ పనిచేస్తున్న కార్మికులతో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ముచ్చటించారు. అనంతరం టెర్మినల్‌ భవనం మొదటి అంతస్థుపైకి వెళ్లి అక్కడ జరుగుతున్న పనులను తెలుసుకున్నారు.

ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌(ఏటిసి) టవర్‌ నిర్మాణం పనులను కూడా మంత్రులు పరిశీలించారు. అనంతరం రన్‌ వే నిర్మాణాన్ని పరిశీలిస్తూ ఎల్ అండ్ టి సంస్థ ప్రాజెక్టు స్థలానికి చేరుకున్నారు. అక్కడ నిర్మాణం పనులపై జి.ఎం.ఆర్‌. సంస్థ ప్రతినిధులు ప్రజంటేషన్‌ ఇచ్చారు.

అనంతరం మంత్రి రామ్మోహన్‌ నాయుడు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ నిర్మాణం పనుల పురోగతిని వివరించారు. ప్రతి నెలా పనుల ప్రగతిని సమీక్షించి ప్రజలకు వివరిస్తామని స్పష్టంచేశారు. ఎయిర్‌ పోర్టు పనులు ఆగష్టు 11 నాటికి 36.6 శాతం పూర్తయ్యాయని మంత్రి వెల్లడించారు. గత నెల జూలై 11 నాటికి 31.8 శాతం పనులు పూర్తికాగా గత నెల రోజుల్లో అదనంగా 4.8 శాతం పనులు జరిగాయని చెప్పారు.

భారీ వర్షాలు నిరంతరాయంగా కురుస్తున్న సమయంలోనూ ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పనులు నిరాటంకంగా జరపడం వల్ల పనుల్లో యీ ప్రగతి సాధ్యమైందని పేర్కొంటూ జి.ఎం.ఆర్‌.సంస్థ ప్రతినిధులను, ఎల్‌ అండ్‌ టి ప్రతినిధులను మంత్రి అభినందించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ యీ ఎయిర్‌ పోర్టు పనులు అనుకున్న సమయానికంటే ముందుగా పూర్తిచేసేందుకు ప్రత్యేక దృష్టి సారించి కృషిచేస్తున్నాయని చెప్పారు.

వాస్తవానికి ముందు నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం యీ సమయానికి 20శాతం పనులు పూర్తికావలసి వుండగా నేడు 36.6 శాతం పూర్తికావడం జరిగిందన్నారు.

ఎయిర్‌ పోర్టు నిర్మాణంలో ముఖ్యమైన ఎర్త్‌ వర్క్‌ పనులు గత నెలలో 97.1శాతం జరుగగా నేటికి 98శాతం పూర్తయినట్టు చెప్పారు. రన్‌ వే పనులు గత నెల ఇదే సమయానికి 32శాతం పూర్తికాగా ఈరోజు నాటికి 38.67శాతం పూర్తయినట్టు తెలిపారు. టాక్సీవే పనులు గత నెలలో 16.7 శాతం జరగగా, ఈరోజు నాటికి 20.78శాతం పూర్తయినట్టు పేర్కొన్నారు.

టెర్మినల్‌ భవనం పనులు గత నెలలో 22.5 పూర్తికాగా ఈరోజుకు 27.2 శాతం పూర్తయ్యాయని తెలిపారు. ఏటిసి నిర్మాణం పనులు గత నెలలో 25.58శాతం పూర్తికాగా నేడు 30.69శాతం పూర్తయినట్లు చెప్పారు. సబ్‌ స్టేషన్‌లు, వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌లు వంటి నిర్మాణాలు 6 నుంచి 12 శాతం మేరకు పూర్తయినట్లు తెలిపారు.

ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చేశక్తి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి వుందని తాను బలంగా నమ్ముతున్నట్టు కేంద్ర మంత్రి చెప్పారు. అందుకే దీనికి అంత ప్రాధాన్యత ఇస్తున్నట్టు మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు పనులు చేయించిన స్ఫూర్తితోనే యీ ఎయిర్‌ పోర్టు పనులను కూడా శరవేగంగా నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు.

ఉత్తరాంధ్ర ప్రాంతం తమకు ఆదరించి ఎంతో గొప్ప విజయాన్ని అందించిందని, యీ ప్రాంత ప్రజలు తమపై వుంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా ఇక్కడి ప్రాజెక్టులకు అధికంగా ప్రాధాన్యత ఇస్తామని ఇటీవల భోగాపురం పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారని మంత్రి గుర్తు చేశారు.

ప్రధానమంత్రి నరేంద్రమోడి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశంలో యీ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ఆర్‌.సి.ఎస్‌. ఉడాన్‌ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని, యీ పథకం ద్వారా మనదేశ పౌరవిమానయాన రంగం ప్రపంచంలోనే ఉన్నతస్థాయికి వెళ్లే అవకాశం ఉందని కేంద్ర పౌరవిమానయాన మంత్రి కె.రామ్మోహన్‌ నాయుడు చెప్పారు.

ఏ రంగంలోనూ లేనివిధంగా యీ రంగంలో 16శాతం వృద్ధిరేటు నమోదవుతోందన్నారు. నవీ ముంబాయి, నోయిడా వద్ద నిర్మిస్తున్న కొత్త ఎయిర్‌ పోర్టులను వచ్చే ఏప్రిల్ నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. వచ్చే ఐదేళ్లలో పౌరవిమానయాన రంగంలో గణనీయమైన పురోగతి సాధిస్తామన్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎయిర్‌ పోర్టుల వసతులను గణనీయంగా పెంచేందుకు తమ మంత్రిత్వశాఖ కృషి చేస్తుందని కేంద్ర మంత్రి వెల్లడించారు. మన రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా మూలపేట, దగదర్తి, నాగార్జున సాగర్‌, కుప్పం ఎయిర్‌ పోర్టులతో పాటు అనంతపూర్‌, ఒంగోలులో కూడా కొత్త ఎయిర్‌పోర్టులు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు వున్నాయని, వీటిని పరిశీలిస్తున్నట్టు పేర్కొన్నారు. తెలంగాణలో హైదరాబాద్‌ మినహా మరో ఎయిర్‌ పోర్టు లేదని, కొత్తగూడెం, అదిలాబాద్, వరంగల్‌ వంటి ప్రాంతాల్లో నిర్మాణానికి ప్రతిపాదనలు పరిశీస్తామన్నారు.

విశాఖలో రైల్వే జోన్‌ అతి త్వరలో ఏర్పాటు కానుందని తాను భావిస్తున్నట్టు కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు చెప్పారు. రైల్వే శాఖకు రాష్ట్ర ప్రభుత్వం విశాఖ నగరంలో ఇచ్చేందుకు ప్రతిపాదించిన 52 ఎకరాల స్థలం ఎంతో అనువుగా వుందని, రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం సానుకూలంగా వుందని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర అధికారులు సంయుక్తంగా సమావేశమై రైల్వే జోన్‌ ఏర్పాటుకు ఇచ్చిన స్థలాన్ని పరిశీలించి తదుపరి చర్యలు చేపట్టారని, త్వరలోనే విశాఖ రైల్వేజోన్‌ పనులు ప్రారంభమవుతాయని ఆశిస్తున్నట్టు చెప్పారు.

ఇప్పటికే తాను, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యీ విషయమై రైల్వే మంత్రితో చర్చలు జరిపామన్నారు. ఎయిర్‌ పోర్టు నిర్మాణ ప్రాంతం వద్ద కేంద్ర మాజీ మంత్రి పి.అశోక్ గజపతిరాజు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును కలిశారు. యీ పర్యటనలో జిల్లా కలెక్టర్‌ డా.బి.ఆర్.అంబేద్కర్‌, జి.ఎం.ఆర్‌. గ్రూపు డిప్యూటీ మేనేజింగ్‌ డైరక్టర్ ఐ.ప్రభాకరరావు, జిఎంఆర్‌ విశాఖపట్నం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్టు లిమిటెడ్ సి.ఇ.ఓ. మన్మోయ్‌ రాయ్‌, ప్రాజెక్టు హెడ్‌ (కార్పొరేట్‌ రిలేషన్స్‌) బి.హెచ్.ఏ. రామరాజు, చీఫ్ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్ ఎం.కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.