ఎన్ కన్వెన్షన్‌పై స్టే లేదు
నిర్మాణాలకు జీహెచ్‌ఎంసీ అనుమతి లేదు
అవన్నీ అనధికార నిర్మాణాలే
చట్ట ప్రకారమే ఎన్ కన్వెన్షన్ కూల్చివేశాం
ఎఫ్‌టీఎల్లో కట్టడాలు ఉన్నందుకే కూల్చివేశాం
చెరువును పూర్తిగా కబ్జా చేసి నిర్మాణాలు
– హైడ్రా చీఫ్ రంగనాధ్
హైదరాబాద్: బీఆర్‌ఎస్-వైసీపీలకు ఇష్టుడైన నటుడు-నిర్మాత-స్టుడియో అధినేత అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్- కన్వెన్షన్ కూల్చివేత సినీ-రాజకీయ రంగాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. అక్కినేనికి చెందిన ఈ కట్టడాలను హైడ్రా నేలమట్టం చేసింది. దానిపై నాగార్జున అభ్యంతరం వ్యక్తం చేశారు. హైకోర్టులో స్టే ఉన్నప్పటికీ, నోటీసులివ్వకుండా ఎలా కూల్చివేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ వేసిన నాగార్జునకు ఊరట లభించింది. కూల్చివేతలు చేపట్టవద్దని న్యాయస్థానం ఆదేశించింది. అయితే అప్పటికే నాగార్జున కట్టడాలను హైడ్రా పూర్తిస్ధాయిలో నేలమట్టం చేయడం జరిగిపోయింది.
ఈ నేపథ్యంలో హైడ్రా చీఫ్ రంగనాధ్.. నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు సంబంధించిన వాస్తవాలను ప్రకటన రూపంలో విడుదల చేశారు. అసలు ‘ఎన్’పై హైకోర్టు స్టే ఇవ్వలేదని, మూడున్నర ఎకరాల తమ్మిడికుంట చెరువును కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ నిర్మించారని వెల్లడించారు. తమకు వచ్చిన ఫిర్యాదు మేరకు కూల్చివేతలు జరిపామన్నారు.
ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై రంగనాధ్ ఇంకా ఏమన్నారంటే.. హైదరాబాద్‌లోని తమ్మిడికుంట చెరువు, ఖానామెట్ గ్రామం, మాదాపూర్‌లోని ఎఫ్‌టిఎల్/బఫర్ జోన్‌లలో హైడ్రా, జీహెచ్‌ఎంసీ, టౌన్ ప్లానింగ్ ఇరిగేషన్.. రెవెన్యూ శాఖల అధికారులు ఆక్రమణలను తొలగించారు. తొలగించబడిన అనేక అనధికార నిర్మాణాలలో ఎన్ – కన్వెన్షన్ కూడా ఒకటి. చట్ట ప్రకారమే ఎన్ కన్వెన్షన్ కూల్చివేశాం.
హైకోర్టు స్టే ఇవ్వడం పూర్తిగా అవాస్తవం. ఎన్ కన్వెన్షన్‌పై ఎలాంటి స్టే లేదు. ఎఫ్‌టీఎల్లో కట్టడాలు ఉన్నందుకే కూల్చివేశాం. చెరువును పూర్తిగా కబ్జా చేసి నిర్మాణాలు చేశారు. ఎన్ కన్వెన్షన్ రిక్వెస్ట్‌ను గతంలోనే అధికారులు తిరస్కరించారు. ఎన్ కన్వెన్షన్‌లో పూర్తిగా కట్టడాలను నేలమట్టం చేశాం.
2014లో హెచ్ఎండీఏ తమ్మిడికుంట సరస్సు పూర్తి ట్యాంక్ స్థాయి (ఎఫ్‌టీఎల్)/బఫర్ జోన్‌లకు సంబంధించి ప్రాథమిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 2016లో తుది నోటిఫికేషన్ జారీ చేయబడింది. 2014లో ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత ఎన్ – కన్వెన్షన్ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. ఎఫ్‌టిఎల్ నిర్ధారణకు సంబంధించి చట్టబద్ధమైన ప్రక్రియను అనుసరించాలని హైకోర్టు ఆదేశించింది.
దీని ప్రకారం పిటిషనర్ ఎన్ కన్వెన్షన్ సమక్షంలో ఎఫ్‌టీఎల్ సర్వే నిర్వహించబడింది.. సర్వే నివేదిక వారికి తెలియజేయబడింది. ఆ తర్వాత ఎన్ కన్వెన్షన్ మియాపూర్ అడిల్‌ను సంప్రదించింది. 2017లో సర్వే నివేదికపై జిల్లా జడ్జి కోర్టు.. ఈ కేసు పెండింగ్‌లో ఉంది. ఏ కోర్టు నుండి ఎటువంటి స్టే ఉత్తర్వులు లేవు.
ఎన్ కన్వెన్షన్ బఫర్ జోన్‌లలో నిర్మించిన అనధికారిక నిర్మాణాల ద్వారా సిస్టమ్స్, ప్రాసెస్‌ను స్పష్టంగా తారుమారు చేస్తోంది. వారి వాణిజ్య కార్యకలాపాలను కొనసాగిస్తోంది. ఎకరా 12 గుంటలను ఆక్రమించిన ఎన్ కన్వెన్షన్, 2 బఫర్ జోన్‌లో ఎకరాల 18 గుంటలు, అనధికారిక నిర్మాణాలను పెంచారు. ఈ కన్వెన్షన్‌కు జీహెచ్ఎంసీ ఎటువంటి అనుమతి ఇవ్వలేదు. తమ్మిడికుంట చెరువు, చుట్టుపక్కల మాదాపూర్, హైటెక్స్ పరిసర ప్రాంతాలను అనుసంధానించే నాలాలలో తనిఖీలు చేయని ఆక్రమణల కారణంగా, తీవ్ర నీటి ఎద్దడి సమస్యలను ఎదుర్కొంటున్నారు.
నీటి నిల్వ సామర్థ్యం 50-60% మేర కుంచించుకుపోవడంతో తమ్మిడికుంట చెరువు దిగువ ప్రాంతాలు నిత్యం భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో ముంపునకు గురవుతున్నాయి. దిగువ, మధ్యతరగతి ప్రజలకు చెందిన అనేక ఇళ్ళు ఈ దిగువ ప్రాంతాలలో మునిగిపోతున్నాయి. ఫలితంగా వారికి తీవ్ర ఆస్తి నష్టం జరుగుతోంది.
నిర్ణీత ప్రక్రియను అనుసరించి, నీటిపారుదల, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ తదితర శాఖల అధికారులు ఈరోజు ఉదయం తమ్మిడికుంట చెరువులోని అనధికార నిర్మాణాలను పూర్తిగా కూల్చివేశారు. తెలంగాణ హైకోర్టు ఈరోజు మధ్యాహ్నం మధ్యంతర స్టే ఇచ్చింది.