– ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ
మంగళగిరి, మహానాడు: జగన్ రెడ్డి పాలన అంతా అవినీతి మయమేనని ఆర్టీసీ ఛైర్మన్, టీడీపీ మచిలీపట్నం పార్లమెంట్ అధ్యక్షుడు కొనకళ్ల నారాయణ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఏమన్నారంటే… వైసీపీ నాయకులు రాష్ట్ర ప్రతిష్ఠను దిగజార్చడమే కాకుండా పరమ పవిత్రమయిన తిరుమలను కూడా తమ అవినీతికి అడ్డాగా మార్చుకున్నారు. ఏటీఎం కార్డులా తిరుమల దేవస్థానాన్ని వాడుకుని దాని మీద కూడా డబ్బులు సంపాదించాలనే నీచపు ఆలోచనలు చేసారు. ఎంతో పవిత్రమయిన, ఎంతో రుచికరమయిన స్వామి వారి లడ్డు ప్రసాదాన్ని కూడా కల్తీ చేశారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక లడ్డు నాణ్యత మెరుగుపరిచి తిరిగి పూర్వపు రుచి, వైభవం తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదే. ప్రతిదానిలోనూ ముడుపులకు అలవాటు పడిన జగన్ రెడ్డి అండ్ కో శ్రీవారి లడ్డూకి ఉపయోగించే నెయ్యి లో కూడా కక్కుర్తి పడి తన అస్మదీయులకు కాంట్రాక్టు కట్టబెట్టేందుకు రివర్స్ టెండరింగ్ పేరుతో 48 కోట్ల రూపాయల తక్కువకు నాణ్యత లేని నెయ్యికి టెండర్లు ఖరారు చేశారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు అధికారంలోకి వచ్చాక తిరుమలకు తిరిగి పూర్వ వైభవం తెచ్చేందుకు అహర్నిశలు కష్టపడుతున్నారు. జగన్ రెడ్డి ప్రభుత్వంలో టెండర్లు ఖరారు చేసిన ఏఆర్ డైరీ నెయ్యి శాంపిళ్లను పరీక్షకు పంపగా ఆ రిపోర్టులో నెయ్యిలో జంతు సంబంధిత కొవ్వులు కలిశాయన్న భయంకరమయిన నిజాలు వెలుగులోకి వచ్చాయి.
రాష్ట్రం మొత్తం మీ అరాచకాలపై విచారణ చేసి అందుకు బాధ్యలయిన ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మళ్ళీ ఇటువంటి తప్పులు పునరావృతం కాకుండా రాష్ట్రాన్ని గాడిలో పెట్టటానికి సుపరిపాలన అందించటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, లోకేష్ అహర్నిశలు కష్టపడుతున్నారు. మీరు ప్రజల విశ్వాసం కోల్పోయారు, ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. ఇకనైయినా మీ బుద్ది మార్చుకోకపోతే ప్రజలు మిమ్మల్ని తరిమికొడతారు.