Mahanaadu-Logo-PNG-Large

గవర్నర్‌కు కూటమి నేతల ఫిర్యాదు

-పోలీసులు వైసీపీతో కుమ్మక్కయ్యారు
-శాంతిభద్రతలను పునరుద్ధరించాలి
-అల్లర్లకు కారకులపై చర్యలకు ఆదేశించండి

అమరావతి, మహానాడు: రెండు రోజులుగా రాష్ట్రంలో వైసీపీ చేస్తున్న దాడులు దౌర్జన్యాలు అరాచకాలపై గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌కు బుధవారం కూటమి నేతలు ఫిర్యాదు చేశారు. వీటిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, నశించిపోయిన శాంతి భద్రతలను తిరిగి పునరుద్ధరించాలని కోరారు. అనంతరం విలేకరుల సమావేశంలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, బోండా ఉమామహేశ్వరరావు, దేవినేని ఉమామహేశ్వరరావు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి లంకా దినకర్‌, టీడీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, జనసేన నేత చల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడారు.

పోలీసులు చోద్యం చూశారు
వర్ల రామయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో నశించిన శాంతిభద్రతలు, మాపై జరిగిన అరాచకత్వాన్ని గవర్నర్‌కు వివరించాం. పోలీసులు, పోలీసు అధికారులు వ్యవహరించిన తీరు గురించి చెప్పాం. మాచర్ల, తాడిపత్రి, చంద్రగిరి, పూతలపట్టు, నరసరావుపేట ఇలా అనేక చోట్ల పోలీసులు వైకాపాతో మిలాఖత్‌ అయ్యారు. వీటిపై చర్యలు తీసుకోవాలని ఆధారాలతో సమర్పించాం. పిన్నెల్లి సోదరులు చేసిన అరాచకం సినిమాలను తలపించేలా ఉన్నాయి. చంద్రగిరిలో పులివర్తి నానిని కొట్టి చంపడానికి ప్రయత్నించారు. తాడిపత్రిలో పెద్దారెడ్డి ఇష్టం వచ్చినట్లు వ్యవహరించాడు. వీటిపై తప్పకుండా చర్యలు తీసుకుంటానని గవర్నర్‌ హామీ ఇచ్చారు. అధికార పార్టీతో ఎవరు లాలూచీ పడ్డారో, చేతులు కలిపారో ఆ పోలీసు అధికారులపై చర్యలు తీసుకుంటామని చెప్పారన్నారు.

ఓటమి భయంతో వైసీపీ దాడులు
లంకా దినకర్‌ మాట్లాడుతూ అత్యధిక పోలింగ్‌ చూసి జగన్మోహన్‌ రెడ్డి హింసను ప్రేరేపించారు. పోలింగ్‌ శాతాన్ని తగ్గించడానికి ప్రయత్నించారు. ప్రజలు ఈ రాక్షస పరిపాలనకు చరమగీతం పాడాలని నిర్ణయించుకున్నారు. 82 శాతం ప్రజలు ఓటుహక్కు వినియోగించుకోవడం సంతోషదాయకం. కూటమి గెలవబోతోంది. తిరుపతి, దర్శి, తాడిపత్రి ఘటనలను గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లాం. సానుకూలంగా స్పందించారు. ప్రభు త్వ చీఫ్‌ సెక్రటరీకి, డీజీపీకి సమన్లు వచ్చాయి. గవర్నర్‌ కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు. లబ్ధిదారులకు ఇవ్వాల్సిన 14,200 కోట్లు కాంట్రాక్టుకు దోచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

పోలీసుల హింసను ప్రేరేపించారు
చల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ వైసీపీ ఎక్కడపడితే అక్కడ అల్లర్లు సృష్టించింది. ఎన్నికలు సజావుగా జరగకుండా చూడడానికి అనేక ప్రయత్నాలు చేసి ఫెయిలయ్యారు. రకరకాల హింసలకు ప్రేరేపించారు. వీటన్నింటిని కూటమి తరపున గవర్నర్‌కు విన్న వించాం. తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామన్నారు. పేదలకు అందాల్సిన డబ్బు 14వ తేదీన అందించాలని ఎన్నికల కమిషన్‌ చెప్పింది. అయితే ఇంతవరకు చర్యలు లేవు. ఆ డబ్బు వెంటనే ప్రజలకు అందేలా చూడాలని కోరాం.

వైసీపీ అరాచకాలపై ఈసీ చర్యలు తీసుకోవాలి
బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ పవిత్ర స్థలమైన తిరుపతి, చంద్రగిరిలో ఒంగోలు పార్లమెంట్‌ వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి అరాచకాలు, పులవర్తి నానిపై జరిగిన హత్యా ప్రయత్నం, తాడిపత్రిలో పెద్దారెడ్డి అరాచకాలు, నరసరావుపేటలో దుర్మార్గాలు, మాచర్లలో మహిళపై దాడి, దర్శిలో శ్రీలక్ష్మి కుటుంబసభ్యులపై దాడులు జరిగాయి. వీటిని గవర్నర్‌ దృష్టికి తెచ్చాం. చీఫ్‌ సెక్రటరీని, డీజీపీని ఢల్లీిలో చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ పిలవడం జరిగింది. దీనిపై స్పష్టంగా అన్ని చర్యలు తీసుకుంటామని గవర్నర్‌ తెలిపారు.

నిరాశ నిస్పృహల వల్లే వైసీపీ దాడులు
దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు పూర్తిగా ఎన్నికల నిర్వహణలో వైఫల్యం చెందారు. రాష్ట్రంలో ఎన్నికల అనంతరం కూడా శాంతిభద్రతలు లోపించాయి. పలనాడు జిల్లాలో హింసాత్మకమైన సంఘటనలు జరిగాయి. తాడిపత్రి స్ట్రాంగ్‌ రూమ్‌ పక్కనే పులివర్తి నానిపై దాడి జరిగింది. ఇదంతా ఉద్దేశపూర్వకంగానే జగన్‌ చేయించారు. వీటిపై గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లాం. చర్యలు తీసుకుంటామని గవర్న ర్‌ హామీ ఇచ్చారు. చీఫ్‌ ఎన్నికల కమిషన్‌ నుంచి డీజీపీ, చీఫ్‌ సెక్రటరీలకు సమన్లు వచ్చాయి.

పల్నాడులో అరాచకాలు
జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ పలనాడు ప్రాంతంలో వైసీపీ అభ్యర్థులు, పార్లమెంటు పోటీ చేస్తున్న అనిల్‌ కుమార్‌ యాదవ్‌ అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. ఎన్నికల ముందు నుంచే గ్రామాల్లోకి వెళ్లి భయబ్రాంతులకు గురి చేశారు. వారు ఓట్లు అడిగే పరిస్థితి లేదని గ్రహించి ప్రజల్ని రెచ్చగొట్టడం మొదలు పెట్టారు. పలనాడు ప్రాంతం ప్రశాంత మైన వాతావరణం. నిప్పు రాజేసి అరాచకాలు సృష్టించారు. ఇప్పటికైనా కక్షలు కార్పణ్యాలను నివారించాలని డిమాండ్‌ చేశారు.