Mahanaadu-Logo-PNG-Large

అమరావతే రాజధాని…ప్రజాపరిపాలనకు శ్రీకారం

-ఆర్థిక రాజధానిగా విశాఖను ప్రత్యేకంగా తీర్చిదిద్దుతాం
-కూటమి ప్రతి నిర్ణయం, ప్రతి అడుగు ప్రజల కోసమే
-ప్రజాతీర్పు అధికారం కాదు…ఉన్నతమైన బాధ్యతగా భావిస్తాం
-93 శాతం సీట్లతో 1994 ఫలితాలకు మించి విజయం ఇచ్చారు
-ప్రజల నమ్మకాన్ని నిలబెడదాం..తెలుగు జాతిని నెంబర్‌-1 చేద్దాం
-అమరావతే రాజధాని…పోలవరం పూర్తి చేసి ప్రతి ఎకరాకూ నీళ్లిస్తాం
-కూల్చివేతలు, కక్షసాధింపులకు మా ప్రభుత్వంలో చోటు లేదు
-అలాగని తప్పు చేసిన వాళ్లను వదిలేది లేదు..చట్ట ప్రకారం శిక్షిస్తాం
-పాలకుడు ఎలా ఉండకూడదో జగనే ఒక కేస్‌ స్టడీ
-పర్యటనల్లో పరదాలు, షాపులు మూయడం, చెట్లు నరకడం ఉండదు
-కష్టకాలంలో పవన్‌కళ్యాణ్‌ మద్దతు ఎన్నటికీ మరువలేను
-శపథాన్ని నెరవేర్చిన ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా
-స్టేట్‌ ఫస్ట్‌ నినాదంతో ముందుకెళదాం..ఎన్టీఆర్‌ కలలను సాకారం చేద్దాం
-కలిసి ముందుకు సాగుదాం..రాష్ట్రాన్ని పునర్నిర్మించుకుందాం
-ముందుకు నడిపించండి..తప్పు చేస్తే సూచనలు చేయండి
-శాసనసభను గౌరవసభగా నడుపుదాం..సమస్యల పరిష్కార వేదికగా చేద్దాం
-ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు
-ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నుకుంటూ కూటమి ఎమ్మెల్యేల నిర్ణయం
-ప్రతిపాదించిన పవన్‌, బలపరిచిన పురంధేశ్వరి, అచ్చెన్నాయుడు

అమరావతి: రాష్ట్రంలో బుధవారం నుంచి ప్రజాపాలన సాగుతుందని, కూటమి ప్రతి నిర్ణయం…ప్రతి అడుగు ప్రజల కోసమే ఉంటుందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రజావేదికలా కూల్చివేతలు, మూడు రాజధానుల పేరుతో ఆటలు ప్రజా ప్రభుత్వంలో ఉండవని ఉద్ఘాటించారు. బాధ్యతాయుతమైన, ఒక పాజిటివ్‌ గవర్నమెంట్‌ ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రజలు తమకు ఇచ్చింది అధికారం కాదని…అత్యున్నతమైన బాధ్యత అని పేర్కొన్నారు. అశాంతికి తావు లేకుండా రాష్ట్రంలో పాలన ఉంటుందని తెలిపా రు. విజయవాడలోని ఏ కన్వెన్షన్‌లో మంగళవారం జరిగిన కూటమి ఎమ్మెల్యేల సమావేశంలో చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌, పురంధరేశ్వరి పాల్గొన్నారు. ముఖ్య మంత్రిగా చంద్రబాబు నాయుడు పేరును పవన్‌ కళ్యాణ్‌ ప్రతిపాదించగా పురంధరేశ్వరి, అచ్చెన్నాయుడు బలపరిచారు. దీనికి కూటమి ఎమ్మెల్యేలంతా ఆమోదం తెలిపారు.

ప్రజలు గెలవాలి..రాష్ట్రం నిలబడాలి

అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ ‘‘నేను చాలా ఎన్నికలు చూశాను. కానీ, ఈ ఎన్నికల్లో ప్రజలు రాష్ట్ర చరిత్రలో లేని విధంగా తీర్పు ఇచ్చారు. ప్రజలు ఇచ్చిన తీర్పును నిలబెట్టుకునే బాధ్యత మనందరిపై ఉంది. కూటమికి ఘన విజయాన్ని అందించిన ప్రజలకు శిరస్సు వంచి పాదాభి వందనం చేస్తున్నా. ప్రమాదంలో ఉన్న రాష్ట్రాన్ని కాపాడుకోవాడానికి ప్రజలు చొరవ చూపారు. ప్రజలు గెలవాలి..రాష్ట్రం నిలవాలి అనేది మన లక్ష్యమని ఎన్నికల ముందు ప్రచారం చేశాం. ప్రజలు గెలిచారు…రాష్ట్రాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత మనపై ఉంది. అరాచక, విధ్వంసకర పాలనను ఐదేళ్లు ప్రజలు భరించారు. మూడు పార్టీలు అత్యున్నత ఆశయాలతో పొత్తు పెట్టుకున్నాయి. ఎన్నోసార్లు కలయిక జరిగినప్పటికీ ఇప్పటి పొత్తును నూటికి నూరు శాతం కార్యకర్తలు, నేతలు స్వాగతించి సమిష్టిగా పని చేశారు. కూటమి విజయానికి కష్టపడ్డ మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలను మనస్ఫూర్తిగా అభినందిస్తూ కృతజ్ఞతలు తెలుపుతున్నా’’ అని సందేశమిచ్చారు.

ప్రజలు పెట్టుకున్న నమ్మకంతోనే ఇంతటి విజయం

‘‘1994లో జరిగిన ఎన్నికలు ఏకపక్షంగా జరిగినప్పటికీ ఇన్ని ఓట్లు, సీట్లు రాలేదు. ఈ ఎన్నికల్లో మనం ఓడిపోయింది కేవంల 11 సీట్లలో మాత్రమే. 93 శాతం స్ట్రైక్‌ రేట్‌తో 57 శాతం ఓట్లను కూటమి సాధించింది. ఇది గెలుపు మాత్రమే కాదు…మనపై ఉన్న బాధ్యత. శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, అమలాపురం, ఏలూరు, రాజమండ్రి, మచిలీపట్నం, కృష్ణా, గుంటూరు, నరసరావుపేట, నెల్లూరు, అనంతపురం, హిందూపురం, చిత్తూరు, నంద్యాల పార్లమెంట్‌ స్థానాల పరిధిలో కూటమి క్లీన్‌ స్వీప్‌ చేసింది. జనసేన 21 సీట్లలో పోటీ చేసి 21 స్థానాలనూ గెలించింది. బీజేపీ 10 స్థానాల్లో పోటీ చేస్తే 8 చోట్ల విజయం సాధించింది. ప్రజలు మనల్ని ఆశీర్వదించి గెలిపించారు. మనకు ఇలాంటి విజయం…ఇంతటి సంతోషం ఎప్పుడూ లేదు. దీనికి కారణం ప్రజలు మనపై పెట్టుకన్న నమ్మకం. 95 వేల ఓట్ల మెజార్టీతో గాజువాకలో టీడీపీని గెలి పించారు. ఫలితాలతో ఏపీ ప్రతిష్ట, గౌరవం పెరిగింది. ఏ స్థానాన్ని ఏ అభ్యర్థికి కేటాయించాలో నిర్ణయించి గెలుపే ధ్యేయంగా సీట్లు కేటాయించాం’’ అని చంద్రబాబు వివరించారు.

కష్టకాలంలో పవన్‌కళ్యాణ్‌ మద్దతు ఎప్పుడూ మర్చిపోలేను

‘’అక్రమ కేసులతో నన్ను జైల్లో పెట్టినప్పుడు పవన్‌కళ్యాణ్‌ ఇచ్చిన మద్దతును ఎప్పుడూ మరిచిపోను. నేను రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు నన్ను పరామర్శిం చారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని గతంలో చెప్పినప్పటికీ జైల్లో నన్ను కలిసిన అనంతరం పొత్తు ప్రకటించారు. మూడు పార్టీలు కలిసి పోటీ చేసేం దుకు చొరవ తీసుకున్నారు. ఎన్నికల సమయంలో ధర్మవరంలో పర్యటించిన అమిత్‌ షా వైసీపీ ప్రభుత్వ అవినీతిని ఎండగట్టడంతో పాటు ఏపీకి ఏం అవసర మో చెప్పారు. దీంతో ప్రజల్లో ఒక ఆలోచన మొదలైంది. కూటమిపై నమ్మకం పెరిగింది. చిలకలూరిపేట, రాజమండ్రి, అనకాపల్లి, రాజంపేట సభలతో పాటు విజయవాడ రోడ్‌ షోలో మోదీ పాల్గొన్నారు. ఈ సభలు, రోడ్‌ షోలకు ప్రజల నుంచి విశేషమైన స్పందన వచ్చింది. కూటమి నేతలు, కార్యకర్తలు ఈ ఎన్నికల్లో కష్టపడ్డ విధానం ఎప్పుడూ చూడలేదు…ప్రతి ఒక్కరూ మనసుపెట్టి పని చేశారు. మీ సహకారంతోనే 4వ సారి సీఎంగా రేపు ప్రమాణస్వీకారం చేస్తున్నా. ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతాం. మళ్లీ ప్రజల రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైంది. రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో కేంద్ర సహకారం కూడా అవసరం.ఈ మేరకు కేంద్రం కూడా హామీ ఇచ్చింది. మోదీ, అమిత్‌, నడ్డాతో పాటు కేంద్ర నాయకత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా’’ అని వ్యాఖ్యానించారు.

నాకు తెలిసింది ప్రజాహితం..ప్రజల కోసం కష్టపడటమే…

‘‘45 ఏళ్ల నా రాజకీయ జీవితంలో రాగ ద్వేషాలకు అతీతంగా పనిచేశాను. ప్రజల కోసం కష్టపడటం, ప్రజాహితమే నాకు తెలుసు. ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతా. నా ప్రతి ఆలోచన, తపనంతా ప్రజల కోసమే. ఎన్నో విజయాలు చూశాను…సంక్షోభాలు చూశాను. సంక్షోభాలను అవకాశాలుగా మార్చుకున్నాం. రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. పేదల జీవితాలు మార్చడానికి నిత్యం పనిచేసి మన నిజాయితీని ప్రజలకు తెలియజేద్దాం. రాష్ట్రం పూర్తిగా శిథిలమైంది. దెబ్బతినని వర్గమంటూ లేదు. చిన్న పనులు చేసుకునే వారు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని వచ్చి ఓట్లు వేసి వెళ్లారు. విదేశాల్లో ఉన్న వారు లక్షల ఖర్చు పెట్టుకుని వచ్చి ఓట్లు వేశారు. ఓటర్లు బాధ్యతగా నిర్వర్తించిన ప్రవర్తన తెలుగుజాతి చరిత్రలో నిలిచిపోతుంది. ఏ అహంకారంతో పాలకులు విర్రవీగారో అది పూర్తిగా అనిగిపోయింది. పదవుల్లో ఉన్నామని విర్రవీగితే ఇలాంటి ఫలితాలే వస్తాయి. ఇవన్నీ కేస్‌ స్టడీగా మీరు తీసుకోవాలి. బూతులు మాట్లాడిన నేతలు, అరాచక శక్తులు, అవినీతి పరులను చూశారు. పాలకులు అంటే ఎలా ఉండాలో చూశారు…పాలకుడికి ఎలాంటి అర్హత ఉండాలో కూడా ఈ తీర్పు ఒక సూచికం. జగన్‌ ప్రవర్తన చూశాక ఇలాంటి వ్యక్తి పాలనకు పనికి రాడని ప్రజలు నిర్ణయించుకుని తీర్పునిచ్చారు. పాలన ఎలా ఉండకూడదో..గత పాలన ఒక కేస్‌ స్టడీ’’ అని వివరించారు.

గౌరవసభగా శాసనసభను నడుపుదాం

‘‘కక్ష తీర్చుకోవాలని ముందుకెళితే సమస్యలే వస్తాయి. అలాగని తప్పు చేసిన వారిని క్షమించి పూర్తిగా వదిలేస్తే మళ్లీ అదే దారికి వస్తారు. చట్ట పరంగా శిక్షించడంతో పాటు విధ్వంసం, కక్ష రాజకీయాలు చేయకుండా సరైన దారిన పెట్టాలి. కార్యకర్తలపై దాడులు చేసి కేసులు పెట్టి వేధించారు. ఇబ్బందుల్లో ఉన్నవారిని మనం కాపాడుకున్నాం. నడి వీధుల్లో ప్రాణాలు తీస్తూ అరాచకంగా ప్రవర్తించారు. మెడపై కత్తి ఉన్నా జై తెలుగుదేశం అంటూ ప్రాణాలు వదిలిన ఘటన నా కళ్ల ముందు ఇప్పటికీ తిరుగుతోంది. నాకు కూడా అసెంబ్లీలో అవమానం జరిగింది. దాన్ని భరించలేక మళ్లీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగుపెడతానని శపథం చేసి బయటకు వచ్చాను. అసెంబ్లీని గౌరవ సభగా మార్చుతానని చెప్పాను. మనం శాసనసభను గౌరవ సభగా మార్చి ప్రజా సమస్యలు పరిస్కరించేందుకు వేదికగా మార్చుకుందాం’’ అని పిలుపునిచ్చారు.

కక్షపూరిత రాజకీయాలు కాదు…నిర్మాణాత్మక రాజకీయాలు చేద్దాం

‘‘రాష్ట్రానికి ఎంత అప్పు ఉందో తెలియదు…ఎక్కడ నుంచి తెచ్చారో తెలియదు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. సాగునీటి వ్యవస్థ నిర్వీర్యం అయింది. వ్యవసాయం రంగం పూర్తిగా సంక్షోభంలో ఉంది. ఐదేళ్లలో తొమ్మిది సార్లు విద్యుత్‌ చార్జీలు పెంచారు. పదేళ్ల తర్వాత కూడా రాజధాని ఏది అంటే చెప్పు కోలేని పరిస్థితి. ప్రజల సమస్యలు చెప్పుకోవడానికి నిర్మించిన ప్రజావేదికను కూల్చి దుర్మార్గంగా వ్యవహరించారు. కక్ష పూరిత రాజకీయాలు కాకుండా నిర్మాణాత్మక రాజయాలు పాటిద్దాం. 2014లో సీఎంగా ప్రమాణస్వీకారం చేయ డానికి ముందు ఢల్లీి వెళ్లాను. పోలవరం ముంపు మండలాలు 7 తెలంగాణలో ఉన్నాయి. ఆ 7 మండలాలు పునరావాసానికి ఒప్పుకుంటే తప్ప సీఎంగా ప్రమా ణ స్వీకారం చేస్తానని మోదీకి చెప్పాను. మొదటి కేబినెట్‌ లోనే 7 మండలాలు ఏపీలో కలుపుతు నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం సహకారంతో 72 శాతం పనులు పూర్తి చేస్తే.. నేడు మళ్లీ పరిస్థితి మొదటికి వచ్చింది. డయాఫ్రం వాల్‌ కొట్టుకుపోయింది. మళ్లీ కేంద్ర సహకారంతో పోలవరం పూర్తి చేసి నదులు అనుసంధానంతో చేసి ప్రతి ఎకరాకు నీళ్లందిస్తాం’’ అని హామీ ఇచ్చారు.

రాజధానిగా అమరావతి…ఆర్థిక రాజధానిగా విశాఖ

‘‘ఏపీకి రాజధానిగా అమరావతే ఉంటుంది. విశాఖ ఆర్థిక రాజధానిగా ఉంటుం ది. మూడు పార్టీలకు విశాఖపట్నం ముఖ్యమైన నగరం. 2014లో ఎంపీగా విశాఖలో హరిబాబు భారీ మెజారిటీతో గెలిచారు. తర్వాత 2019లో విశాఖప ట్నంలోని 4 సీట్లు గెలిచాం. ఇప్పుడు విశాఖ పార్లమెంట్‌ను క్లీన్‌ స్వీప్‌ చేశాం. విశాఖను రాజధానిగా చేస్తామని, ప్రమాణ స్వీకారం అక్కడే చేస్తానని జగన్‌ చెప్పినా ప్రజలు ఇక నువ్వు రావొద్దని తీర్పు ఇచ్చారు. న్యాయ రాజధాని కర్నూ లు అంటూ మోసం చేశారు. రాయలసీమలో వన్‌ సైడ్‌గా ఎన్నికలు జరిగాయి. ఊహించని మెజార్టీని ప్రజలు మనకు ఇచ్చారు. సీఎం వస్తున్నాడంటే చెట్లు కొట్టేయడం, షాపులు బంద్‌ చేయడం, పరదాలు కట్టడం లాంటివి ఇక ఉండ వు. ముఖ్యమంత్రి కూడా మామూలు మనిషే. నేను సీఎంగా ఉన్నా, నా మిత్రు డు పవన్‌ కళ్యాణ్‌ ఏ పదవిలో ఉన్నా సామాన్యుల్లా ప్రజల్లో ఒకరిగానే ఉంటాం. హోదా సేవ కోసం తప్ప పెత్తనం కోసం కాదు. మేము బయటకు వచ్చినప్పుడు ప్రజలు ఎవ్వరూ ఇబ్బంది పడకూడదన్నది మా విధానం’’ అని చెప్పారు.

స్టేట్‌ ఫస్ట్‌ నినాదంతో ముందుకు వెళదాం

‘‘గత ప్రభుత్వం దాడులు చేసి బాధితులపైనే కేసులు పెట్టింది. ఏ ఒక్కరి ఆత్మగౌరవానికి మన ప్రభుత్వంలో భంగం కలగదు. స్టేట్‌ ఫస్ట్‌ నినాదంతో ముందుకు వెళతాం. కేంద్రంలో రాష్ట్రానికి సముచిత గౌరవం దక్కింది. కేంద్రం లో ముగ్గురు మంత్రులుగా ఉన్నారు. రామ్మోహన్‌ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌, శ్రీనివాసర వర్మకు మంత్రి పదవులు వచ్చాయి. సాధారణ వ్యక్తులకు కూడా బీజేపీ ఎంపీ టికెట్లు ఇచ్చింది. టీడీపీ-జనసేన కూడా అదే పంథాలో ఉన్నాయి. పదేళ్లు మోదీ పాలన దేశ ప్రతిష్టను పెంచింది. ప్రపంచం లోనే భారతీయులకు గుర్తింపు వచ్చింది. గతంలో 11వ స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ 5వ స్థానానికి వచ్చింది. ఎన్డీఏ 3.0 ప్రభుత్వంలో 3వ ఆర్థిక అతిపెద్ద దేశంగా భారత్‌ అవతరించబోతోంది. 2047 నాటికి వికసిత్‌ భారత్‌ మోదీ కల…మనందరి కల వికసిత్‌ ఏపీ అనే లక్ష్యంతో ముందుకు వెళదాం. పేదరికం లేని దేశం, రాష్ట్రంగా మారాలి. పేదరికం లేని సమాజం ఎన్టీఆర్‌ కల. తనకు తెలిసిన ఒకే ఒక్క ఇజం హ్యూమనిజం అని ఎన్టీఆర్‌ చాటి చెప్పారు. సమాజమే దేవాలయం- ప్రజలే దేవుళ్లు అని ముందుకెళ్లిన ఎన్టీఆర్‌ కలలను సాకారం చేద్దాం’’ అని పిలుపునిచ్చారు.

ముందుకు నడిపించండి…తప్పు చేస్తే ఫీడ్‌ బ్యాక్‌ ఇవ్వండి

ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా..మీరు ఓట్లు వేసి మమ్మల్ని గెలించారు. ఓటు వేశాక మీ బాధ్యత తీరిపోయిందనుకోకుండా నిత్యం తమను ఆశీర్వదించి ముందుకు నడపాలి. మొన్నటి ఎన్నికల్లో ప్రతి పోలింగ్‌ స్టేషన్‌ జనంతో నిండి ఉండి రాత్రి 2 వరకు క్యూలో ఉండి ఓట్లు వేశారు. నన్ను నడిపించండి…తప్పు చేస్తే ఫీడ్‌ బ్యాక్‌ ఇవ్వండి. కలిసి ముందుకు సాగి రాష్ట్రాన్ని పునర్నిర్మించుకుందాం. ప్రపం చంలో 2047 నాటికి మన దేశం మొదటి స్థానంలో ఉంటుంది. తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్‌ 1గా ఉండాలనేది నా కల. సంపాదనలో తెలుగువారు అగ్రస్థానంలో ఉన్నారు. నిర్ధిష్టమైన సమయంలోనే ఏపీని నెంబర్‌ 1గా చేసుకుందాం. నన్ను జైల్లో పెట్టినప్పుడు బయటకు రావడానికి 53 రోజులు పట్టింది…అక్కడ ఏం చేస్తారో తెలియని పరిస్థితి ఉంది. నా కోసం నిలబడ్డ కార్యకర్తలు, నాయకులను జీవితాంతం గుర్తు పెట్టుకుంటా’’ అని చెప్పారు.