అమ్మ జోగి.. ఏమి స్కెచ్ వేశావ్?

– ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చి ఉంటే, ఒక్క ఆస్తి కూడా ఉండేది కాదు
(ప్రదీప్-నందిగామ)

జోగి రమేష్‌ అగ్రిగోల్డ్‌ భూముల్ని అడ్డగోలుగా కబ్జా చేశారు. సర్వే నంబరు మార్చేసి.. వాటిని కొట్టేసి.. తన కొడుకు, బాబాయ్‌ పేరిట మార్చేసి.. ఏకంగా ప్రహరీ నిర్మించేశారు. వాటి యజమానులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా.. జోగి రమేష్‌ మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు సన్నిహితుడు కావడంతో విచారణ లేకుండా తొక్కిపెట్టారు.

స్కాం ఎలా చేసాడో తెలిస్తే, ఆశ్చర్య పోతారు
విజయవాడ గ్రామీణ మండలం అంబాపురం గ్రామంలో రీ సర్వేనంబరు 87లో అవ్వా వెంకట శేషునారాయణరావు, వారి బంధువులకు భూములు ఉన్నాయి. వీరు అగ్రిగోల్డ్‌ కంపెనీలో భాగస్వాములుగా ఉన్నారు. అగ్రిగోల్డ్‌ కేసులో ప్రభుత్వం రీసర్వే నంబరు 87లో 2,293.05 గజాల స్థలాన్ని జప్తు చేసింది. వాటిపై వైకాపా నాయకుల కన్ను పడింది. పక్కా ప్రణాళిక వేశారు.

అంబాపురంలోనే రీసర్వే నంబరు 88లో పోలవరపు మురళీమోహన్‌ అనే వ్యక్తి నుంచి మాజీ మంత్రి తనయుడు జోగి రాజీవ్‌ 1,074 గజాలు, ఆయన బాబాయ్‌ జోగి వెంకటేశ్వరరావు 1,086 గజాలు కొని 2022లో రిజిస్టర్‌ చేయించారు. ఆ దస్తావేజుల్లో సర్వే నంబరు 88 అని స్పష్టంగా ఉంది. తర్వాత నెల రోజులకే తమ దస్తావేజుల్లో సర్వే నంబరు l87కు బదులు 88 అని తప్పుగా నమోదైందంటూ దరఖాస్తు చేశారు. అప్పటికే జోగి రమేష్‌ మంత్రిగా ఉండటంతో ఏమాత్రం విచారణ లేకుండా అధికారులు సర్వే నంబరు మార్చేశారు.

వెంటనే అమ్మకం
దొంగదారిలో స్వాధీనం చేసుకున్న భూమిని వెంటనే 2023 మే నెలలో వైకాపా కార్పొరేటర్‌ పడిగపాటి చైతన్యరెడ్డి బంధువులకు అమ్మేశారు.