– ఇరువురిని ఘనంగా సత్కరించిన ఎమ్మెల్యే సింధూర రెడ్డి, మాజీ మంత్రి రఘునాథ్ రెడ్డి
అనంతపురం, మహానాడు: ఇక్కడి పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో నిర్వహించిన డిఎస్పీల పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనితకు మంగళవారం పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి తో పాటు మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి, అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ లు పుష్ప గుచ్చం అందించి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాలువతో సత్కరించారు. అదేవిధంగా పీటీసీ గెస్ట్ హౌస్ లో ఉన్న డీజీపీ ద్వారకా తిరుమలరావును మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి, ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా పలు సమస్యలపై హోం మంత్రి అనిత, డీజీపీ తిరుమలరావు దృష్టికి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తీసుకొచ్చారు. పుట్టపర్తి నియోజకవర్గం లో పలు స్టేషన్లో పోలీసు సిబ్బంది లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తెలిపారు. కొన్ని ఏళ్ళ క్రితం పోలీస్ లకు ఇచ్చిన వాహనాలు కాలం చెల్లి పూర్తిగా దెబ్బతిన్నాయని, అంతే కాకుండా ఆ వాహనాలు ఎక్కడపడితే అక్కడే ఆగిపోతున్నాయని అవి పూర్తిగా పాడై పోవడం వల్ల పోలీసులకు ఏ మాత్రం ఉపయోగ పడడం లేదని వారి దృష్టికి తీసుకువెళ్ళారు. నూతన పోలీసు వాహనాలను, జిల్లా ఎస్పీ నూతన కార్యాలయం తో పాటు ప్రత్యేక పోలీస్ గెస్ట్ హౌస్ ను మంజూరు చేయాలని కోరారు.
పుట్టపర్తి నియోజక వర్గంలో ఎస్సైలకు, సీఐలు కాలం చెల్లిన వాహనాలు వాడుతున్నారని ఆ స్థానంలో నూతన వాహనాలు అందించే విధంగా ప్రత్యేక చొరవ తీసుకోవాలని హోంమంత్రి అనిత, డిజిపి ద్వారాక తిరుమలరావు ను ప్రత్యేకంగా విన్నవించారు. అలాగే నల్లమాడ, ఆమడ గూరు, పుట్టపర్తి, బుక్కపట్నం పోలీస్ స్టేషన్ లకు నూతన భవనాలు మంజూరు చేయాలని కోరారు. దీనికి వారు సానుకూలంగా స్పందించి తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.