– ఆంధ్రా న్యాయవాదుల బస్సుకు ప్రమాదం!
– రాజేంద్రప్రసాద్ భార్య జ్యోత్స్న మృతి
విజయవాడ, మహానాడు: విహార యాత్రకు వెళ్ళిన విజయవాడ న్యాయవాదుల బస్సుకు ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఒకరు మృతి చెందగా, 11 మందికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆంధ్రాలోని విజయవాడ నుంచి బార్ అసోసియేషన్ న్యాయవాదులు రెండు బస్సుల్లో అజ్మేర్ విహారయాత్రకు వెళ్లారు. మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఆగివున్న ట్రక్కును న్యాయవాదుల బస్సు ఢీకొంది. ఈ ఘటనలో ప్రముఖ న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్ భార్య జ్యోత్స్న అక్కడికక్కడే మృతి చెందారు. రాజేంద్రప్రసాద్ సహా 11 మందికి గాయాలయ్యాయి.
చంద్రబాబు దిగ్భ్రాంతి
– జ్యోత్స్న మృతికి సీఎం సంతాపం
రాజస్థాన్ లో విజయవాడ బార్ అసోసియేషన్ సభ్యులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారన్న ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రముఖ న్యాయవాది రాజేంద్ర ప్రసాద్ భార్య జ్యోత్స్న మృతి చెందడంపై చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. మహిళలు, విద్యార్థినులను చైతన్యం పరిచేందుకు పలు కార్యక్రమాలు నిర్వహించిన జ్యోత్స్న మృతి బాధాకరమన్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించిన సీఎం… వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
రాజస్థాన్ ముఖ్యమంత్రి బజన్ లాల్ శర్మతో ఫోన్ లో ముఖ్యమంత్రి మాట్లాడారు. బాధితులకు అవసరమైన సాయం అందించాలని కోరారు. అలాగే, న్యాయవాదులు తిరిగి ఇళ్ళకు రావడానికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని చంద్రబాబు కోరారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని, అవసరమైన సాయం అందించాలని తన కార్యాలయ అధికారులకు కూడా సీఎం ఆదేశించారు.
మంత్రి లోకేష్ సంతాపం
మహిళా భద్రత, సాధికారత కోసం ఉద్యమించిన ప్రముఖ సీనియర్ న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్ భార్య గొల్లపల్లి జ్యోత్స్న మృతి చెందడం తీవ్రంగా కలచివేసిందని విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. ఆమె మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలిపారు. విహారయాత్ర విషాదయాత్రగా మారడం బాధాకరం… ఇదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రాజేంద్ర ప్రసాద్, ఇతర న్యాయవాదులు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
స్త్రీల హక్కుల కోసం పోరాడిన గొప్ప మహిళ
జ్యోత్స్న మృతి దిగ్భ్రాంతికి గురిచేసింది… ఆమె దశాబ్ద కాలంగా జెండర్ ఈక్వాలిటీ, స్త్రీల హక్కులు వంటి వాటిపై అనేక కార్యక్రమాలు నిర్వహించారు… SAFE Step ahead for Equality అనే సంస్థ స్థాపించి విజయవాడలోని కళాశాలలో, పాఠశాలలలో అనేక కార్యక్రమాలు నిర్వహించారని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు తెలిపారు. ఈ కార్యక్రమాలలో నేను కూడా పాల్గొన్నాను. దసరా సెలవుల సందర్భంగా అనేకమంది లాయర్లు తోపాటు జోత్స్న, రాజేంద్రప్రసాద్ రాజస్థాన్ టూరుకు వెళ్ళి ప్రమాదాన్ని గురికావడం విచారకరం. ఆమె మృతికి ప్రగాఢ సంతాపాన్ని ప్రకటిస్తున్నట్టు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.