– గజల్ శ్రీనివాస్
గుంటూరు, మహానాడు: మూడో ప్రపంచ తెలుగు మహాసభల(2026) కు ముఖ్య సమన్వయకర్తగా గుంటూరు నగరానికి చెందిన ప్రముఖుడు పి.రామచంద్ర రాజుని నియమించినట్టు ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ కేశిరాజు శ్రీనివాస్( గజల్ శ్రీనివాస్) తెలిపారు. నగరంలోని భారతీయ విద్యా భవన్ లో మంగళవారం నిర్వహించిన ఆంధ్ర సారస్వత పరిషత్ సమావేశానికి అధ్యక్షత వహించిన ఆయన మాట్లాడారు.
తెలుగు భాష, తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు పరిరక్షణే ధ్యేయంగా 75 ఏళ్ళ కిందట సురవరం ప్రతాపరెడ్డి, బూర్గుల రామకృష్ణారావు వంటి పెద్దలు ఆంధ్ర సారస్వత పరిషత్ ను ఏర్పాటు చేసి ఆంధ్ర భాషాభివృద్ధికి, తెలుగు కళలు సాంస్కృతిక, సాహిత్య, సాంప్రదాయాల వైభవోన్నతికి విశేష కృషి చేశారని తెలిపారు. వారి ఆశయ సాధన కోసం కొనసాగింపుగా తెలుగు భాషాభివృద్దిని విశ్వవ్యాప్తి చేయటానికి ఆంధ్ర సారస్వత పరిషత్ పనిచేస్తోందని తెలిపారు. దీనిలో భాగంగా మూడో ప్రపంచ తెలుగు మహాసభలను తెలుగు సాంస్కృతిక రాజధాని అయిన గుంటూరు(అమరావతి)లో వైభవో పేతంగా నిర్వహించనున్నట్టు ఆయన వెల్లడించారు. ఈ మహాసభలకు ముఖ్య సమన్వయకర్తగా పి.రామచంద్ర రాజుని నియమించామని, వారి ఆధ్వర్యంలో మహాసభలు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్నామని గజల్ శ్రీనివాస్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో రామచంద్ర రాజు, పరిషత్ ఉపాధ్యక్షుడు, గురు సహస్రావధాని కడిమిళ్ళ వరప్రసాద్, ఆంధ్ర శాశ్వత పరిషత్ ప్రధాన కార్యదర్శి చక్రవధానుల రెడ్డప్ప ధవేజి, సహకారదర్శి అడ్డాల వాసుదేవరావు, సభ్యులు సునీత, రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ డాక్టర్ రవి వడ్లమాని, సాహితీ సమాఖ్య జిల్లా కన్వీనర్ ఎస్వీఎస్ లక్ష్మీనారాయణ, ప్రముఖ వైద్యుడు రమణ యశస్వి , పారిశ్రామికవేత్త కంచర్ల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.